Share News

పదోన్నతుల్లో ఎందుకింత జాప్యం?

ABN , Publish Date - Jul 30 , 2025 | 11:55 PM

జిల్లాలోని సచివాలయాల్లో ఏఎన్‌ఎంలుగా పనిచేస్తున్న వారి పదోన్నతుల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది.

పదోన్నతుల్లో ఎందుకింత జాప్యం?
డీఎంహెచ్‌వో కార్యాలయం వద్ద బైఠాయించిన ఏఎన్‌ఎంలు

- ప్రభుత్వ ఆదేశాలు కూడా బేఖాతరు చేస్తే ఎలా?

-మాకు న్యాయం చేయండి

-డీఎంహెచ్‌వో కార్యాలయంలో ఏఎన్‌ఎంల బైఠాయింపు

అరసవల్లి, జూలై 30 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని సచివాలయాల్లో ఏఎన్‌ఎంలుగా పనిచేస్తున్న వారి పదోన్నతుల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం గతేడాది అక్టోబరులోనే పదోన్నతులపై జీవో విడుదల చేసింది. ఆ జీవోను అనుసరించి రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఏఎన్‌ఎంలకు పదోన్నతులు కల్పించి నాలుగు నెలలు కావస్తోంది. కానీ, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో ఇంతవరకు ఎటువంటి పదోన్నతులు కల్పించలేదు. శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి కనీసం లిస్టు కూడా తయారుకాలేదు. పదోన్నతులు కల్పించకుండానే ఏఎన్‌ఎంలకు బదిలీలు కూడా చేసేశారు. మిగతా జిల్లాల్లో తొలుత పదోన్నతులు కల్పించి, అనంతరం బదిలీలు నిర్వహించారు. కానీ, జిల్లాలోని పరిస్థితి మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా ఉంది. ఇప్పటివరకు కనీసం లిస్టు కూడా తయారు చేయకపోవడం ఏమిటని, రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా శ్రీకాకుళం జిల్లాలోనే ఎందుకింత జాప్యం జరుగుతుందో అర్థం కావడం లేదని ఏఎన్‌ఎంలు వాపోతున్నారు. గతేడాది అక్టోబరు 22 నాటికే అభ్యర్థుల నుంచి అభ్యంతరాలను స్వీకరించి, సీనియారిటీ ప్రకారం తుది జాబితాను ప్రకటించాల్సి ఉంది. కానీ, ఇంతవరకు జాబితాలను కూడా తయారు చేయలేదు. వెంటనే తమను గ్రేడ్‌-3 నుంచి గ్రేడ్‌-2 ఏఎన్‌ఎంలుగా పదోన్నతి కల్పించాలని వారు కోరుతున్నారు. పదోన్నతుల విషయమై ఏఎన్‌ఎంలు పెద్ద ఎత్తున బుధవారం జిల్లా కేంద్రంలోని వైద్యారోగ్యశాఖ కార్యాలయానికి చేరుకుని డీఎంహెచ్‌వోను కలిసేందుకు వేచి చూశారు. కార్యాలయం మొదటి అంతస్థులో వారు బైఠాయించారు. కానీ, డీఎంహెచ్‌వో అందుబాటులో లేకపోవడంతో చివరకు కార్యాలయ సూపరింటెండెంట్‌కు వినతిపత్రం అందజేశారు. ఇప్పటికే ఎన్నోసార్లు అధికారులను కలిశామని, ప్రతీసారి ప్రమోషన్లు ఇచ్చేస్తామని చెబుతూ వాయిదాలు వేస్తున్నారే తప్ప పట్టించుకునే వారే కరువయ్యారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో మొత్తం 150 ఖాళీలు ఉన్నాయని, ర్యాంకుల ఆధారంగా తమకు వెంటనే పదోన్నతులు కల్పించాలని కోరారు. కార్యక్రమంలో ఏఎన్‌ఎంలు టి.మోహినమ్మ, కె.ధనలక్ష్మి, ఎం.ఝాన్సీదేవి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 30 , 2025 | 11:55 PM