Share News

విద్యుత్‌ ప్రమాదం సంభవిస్తే దిక్కెవరు?

ABN , Publish Date - Oct 04 , 2025 | 01:19 AM

జిల్లా నలుమూలల నుంచి పేదలు ఈ పెద్దాసుపత్రినే ఆశ్రయిస్తుంటారు.

విద్యుత్‌ ప్రమాదం సంభవిస్తే దిక్కెవరు?
ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి

- 930 పడకల ఆసుపత్రికి ముగ్గురే ఎలక్ట్రీషియన్లు

- వేధిస్తున్న సిబ్బంది కొరత

- కానరాని కొత్త నియామకాలు

- ఇదీ జీజీహెచ్‌(రిమ్స్‌)లో పరిస్థితి

శ్రీకాకుళం రిమ్స్‌, అక్టోబరు 3 (ఆంధ్రజ్యోతి): జిల్లా నలుమూలల నుంచి పేదలు ఈ పెద్దాసుపత్రినే ఆశ్రయిస్తుంటారు. తమ ఆరోగ్యానికి భరోసా దొరుకుతుందని, తమలాంటి నిరుపేదలకు ఇదే పెద్ద దిక్కని వస్తుంటారు. 930 పడకలతో ఉన్న ఈ ఆస్పత్రిలో మాత్రం సమస్యలు రాజ్యమేలుతున్నాయి. ముఖ్యంగా విద్యుత్‌ ప్రమాదం సంభవిస్తే దిక్కెవరనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అదే జిల్లా కేంద్రం శ్రీకాకుళంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి(రిమ్స్‌). మొత్తం ఆసుపత్రికి సంబంధించి ఎలక్ట్రీషియన్లు ముగ్గురే ఉన్నారు. వీరిలో రెగ్యులర్‌ ఎలక్ట్రీషియన్‌ ఒకరు కాగా, మరొకరు కాంట్రాక్టు పద్ధతిలో, ఇంకొకరు ఔట్‌ సోర్సింగ్‌ విధానంలో పనిచేస్తున్నారు. ఏళ్లు గడుస్తున్నా కొత్త నియామకాలు జరగడం లేదు. వాస్తవానికి ఆస్పత్రిలో 25 మంది విద్యుత్‌ సిబ్బంది అవసరం. కానీ, కేవలం ముగ్గురు మాత్రమే సేవలందిస్తున్నారు. రిమ్స్‌కు సంబంధించి ఇటీవల కొత్త ఉద్యోగాల కోసం నోటిఫికేషన్‌ను అధికారులు జారీ చేశారు. ఇందులో ఎలక్ట్రీషియన్‌ పోస్టులకు చోటు లేకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

తరచూ ప్రమాదాలు..

శ్రీకాకుళం జీజీహెచ్‌లో తరచూ షార్ట్‌ సర్క్యూట్‌ ఘటనలు సంభవిస్తున్నాయి. కొద్ది నెలల కిందట పిడియాట్రిక్‌ వార్డులో విద్యుత్‌ ప్రమాదం జరిగింది. అయితే, ఎటువంటి అపాయం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. మరోసారి జరిగిన షార్ట్‌ సర్క్యూట్‌తో కంప్యూటర్లు పాడైపోయాయి. ఇలా తరచుగా సంఘటనలు జరుగుతున్నా ఎలక్ట్రీషియన్లను కనీసం ఔట్‌ సోర్సింగ్‌ పద్ధతిలోనైనా నియమించక పోవడంపై రోగులు ఆందోళన చెందుతున్నారు. ప్రధానంగా ఎమర్జెన్సీ, పీడియాట్రిక్‌ తదితర వార్డుల్లో ఏసీలు తరచుగా పాడైపోతున్నాయి. విద్యుతు సరఫరాలో హెచ్చు తగ్గులు, షార్ట్‌ సర్క్యూట్‌ ప్రమాదాలే ఇందుకు కారణం. ఆసుపత్రికి అనుబంధంగా ఉన్న వైద్య కళాశాల(రిమ్స్‌)లోని లైబ్రరీలో ఇటీవల జరిగిన షార్ట్‌ సర్క్యూట్‌తో కంప్యూటర్లు, ఏసీలు, సీలింగ్‌, ఫర్నీచర్‌ కాలిపోయాయి. ఈ ప్రమాదం నుంచి విద్యార్థులు త్రుటిలో తప్పించుకున్నారు. అయినా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. ఎవరైనా ప్రాణాలు కోల్పోతే గానీ, చర్యలు తీసుకోరా...అని విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా జీజీహెచ్‌ అధికారులు స్పందించి, సమస్య తీవ్రతను గుర్తించి ఎలక్ట్రీషియన్ల నియామకానికి తక్షణ చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

Updated Date - Oct 04 , 2025 | 01:19 AM