Road works: ఆ పనులు ఎవరు చేశారు?
ABN , Publish Date - Mar 11 , 2025 | 12:01 AM
collecter enqwairy సీతంపేట ఐటీడీఏ పరిధిలో చేపడుతున్న రహదారి పనులపై కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆరా తీసినట్టు సమాచారం. ఐటీడీఏ పరిధిలోని ఓ ఇంజనీరింగ్ అధికారి కాంట్రాక్టర్‌గా వ్యవహరిస్తూ.. నాణ్యత లోపంతో పనులు చేపట్టి.. బిల్లులు పక్కదారి పట్టిస్తున్నారనే ఆరోపణలున్నాయి.

ఐటీడీఏ పరిధిలో రహదారుల నిర్మాణంపై కలెక్టర్ ఆరా!
ఆంధ్రజ్యోతి కథనానికి స్పందన
మెళియాపుట్టి, మార్చి 10(ఆంధ్రజ్యోతి): సీతంపేట ఐటీడీఏ పరిధిలో చేపడుతున్న రహదారి పనులపై కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆరా తీసినట్టు సమాచారం. ఐటీడీఏ పరిధిలోని ఓ ఇంజనీరింగ్ అధికారి కాంట్రాక్టర్‌గా వ్యవహరిస్తూ.. నాణ్యత లోపంతో పనులు చేపట్టి.. బిల్లులు పక్కదారి పట్టిస్తున్నారనే ఆరోపణలున్నాయి. దీనిపై ఈ నెల 8న ‘ఆంధ్రజ్యోతి’లో ‘ఆ అధికారే కాంట్రాక్టర్’ శీర్షికన ప్రచురితమైన కథనంపై కలెక్టర్ స్పందించారు. ఈ పనులు ఎవరు చేపడుతున్నారు.. నాణ్యత తదితర అంశాలపై ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది. కూటమి ప్రభుత్వం గతంలో ఎన్నడూ లేనంతగా రహదారుల నిర్మాణానికి ఉపాధిహామీ నిధులు మంజూరు చేసింది. హిరమండలం పరిధిలో ఐదు పనులకు రూ.8.45కోట్లు, మెళియాపుట్టి మండలంలో 39 పనులకు రూ.20.79 కోట్లు, పలాస, టెక్కలిలో రెండేసి పనులకు రూ.80లక్షలు చొప్పున, మందసలో 25 పనులకు రూ.100 కోట్లు ఐటీడీఏ ద్వారా మంజూరు చేసింది. సీతంపేట పరిధిలో సుమారు 73 పనులకు రూ.4,084.00 కోట్లు నిధులు విడుదల చేసినట్లు ఇంజనీరింగ్ అధికారులు లెక్కలు చూపారు. అయితే అధికంగా కొంతమంది బినామీ పేర్లుతో ఇంజనీరింగ్ అధికారులు పనులు చేయించడం చర్చనీయాంశమైంది. కలెక్టర్‌తోపాటు ఈఎన్‌సీ శ్రీనివాసరావు ఈ పనులపై క్వాలిటీ కంట్రోల్ అధికారుల నుంచి సమాచారాన్ని సేకరిస్తున్నట్టు తెలిసింది. అధికారులు ఎవరైనా బినామీల పేరిట పనులు చేస్తున్నారా? లేదా? ఆరా తీసినట్టు సమాచారం. దీంతో ఇంజనీరింగ్‌శాఖ అధికారి తమ తప్పును కప్పి పుచ్చుకునేందుకు ప్రజాప్రతినిధుల చుట్టూ తిరుగుతున్నారు. మరోవైపు గత ప్రభుత్వ హయాంలో జిల్లాలో చేసిన 33 పనులకు సంబంధించి విజిలెన్స్ అధికారులు విచారణ చేపడుతున్నారు. కాగా.. అక్రమాలకు పాల్పడిన వారిపై ఎటువంటి చర్యలు తీసుకుంటారో వేచిచూడాలి.