ఆడుకుంటూ పుష్కరిణిలో పడి..
ABN , Publish Date - Dec 22 , 2025 | 12:50 AM
పట్టణంలోని అయ్యప్పస్వామి దేవాలయం ఎదురుగా ఉన్న రామలింగేశ్వర పుష్కరిణిలో ఆదివారం ఇద్దరు చిన్నారులు పడి మృతి చెందారు.
- ఇద్దరు చిన్నారుల మృతి
- గణేష్‌నగర్‌లో విషాదం
ఆమదాలవలస, డిసెంబరు 21 (ఆంధ్రజ్యోతి): పట్టణంలోని అయ్యప్పస్వామి దేవాలయం ఎదురుగా ఉన్న రామలింగేశ్వర పుష్కరిణిలో ఆదివారం ఇద్దరు చిన్నారులు పడి మృతి చెందారు. మునిసిపాలిటీ పరిధిలోని గణేష్‌నగర్‌కు చెందిన సురవరపు పవన్‌సాయి (8), శంఖం ధనూష్ (6) అనే ఇద్దరు పిల్లలు ఆదివారం పాఠశాలలకు సెలవు కావడంతో ఆడుకోవడానికి సమీపంలో ఉన్న రామలింగేశ్వర పుష్కరిణి వద్దకు వెళ్లారు. మెట్లపై ఆడుకుంటూ ధనుష్ ప్రమాదవశాత్తూ పుష్కరిణి నీటిలో పడిపోయాడు. దీనిని గమనించిన పవన్‌సాయి.. ధనూష్‌ను కాపాడే ప్రయత్నంలో ఆ బాలుడు కూడా నీటిలో పడిపోయాడు. ఇద్దరూ పుష్కరిణిలో మునిగిపోయిన విషయాన్ని గమనించిన కొందరు స్థానికులు కాపాడడానికి సాహసించలేక అగ్నిమాపక దళానికి సమాచారం ఇచ్చారు. అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకొని పుష్కరిణిలో దిగి ఇద్దరు చిన్నారులను బయటకు తీశారు. 108 వాహన సిబ్బంది వచ్చి చిన్నారులకు సీపీఆర్ చేసి ప్రాణాలను కాపాడడానికి ఎంత ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. అయితే మృతి చెందిన చిన్నారులు ఎవరేది కొంత సమయం వరకు ఎవరూ గుర్తుపట్టలేకపోయారు. తర్వాత గణేష్‌నగర్‌కు చెందిన చిన్నారులుగా తెలిసింది. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు అక్కడకు చేరుకుని పిల్లల మృతదేహాలను చూసి కన్నీరుమున్నీరుగా విలపించారు.
పేద కుటుంబాలు..
ధనూష్, పవన్‌సాయివి నిరుపేద కుటుంబాలు. ఽధనుష్ తండ్రి పట్టణంలో చిన్న టిఫిన్ సెంటర్‌ను నడుపుకొంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ధనుష్ పట్టణంలోని ఓ ప్రైవేట్ పాఠశా లలో ఒకటో తరగతి చదువుతున్నాడు. అలాగే పవన్‌సాయి తండ్రి లగేజీ ఆటో నడుపుకొంటూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. పవన్‌సాయి స్థానిక లక్ష్మీనగర్ పాఠశాలలో మూడో తరగతి చదువుతున్నాడు.
మృతదేహాల తరలింపుపై అభ్యంతరం..
108 వాహనంలో ఉన్న పవన్‌సాయి, ధనుష్ మృతదేహాలను తల్లిదండ్రులు తమ భుజాలపై వేసుకొని ఇంటికి తరలించారు. ప్రమాదవశాత్తూ జరిగిన సంఘటనపై కేసు నమోదు చేసి మృతదేహాలను పోస్టుమార్టంకు పంపించాలని పోలీసులు చెప్పినా వారు వినలేదు. పోలీసులు నచ్చజెప్పడంతో చివరకు అంగీకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి మృతదేహాలను శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించినట్లు ఎస్‌ఐ బాలరాజు తెలిపారు.