Share News

Water problem: కొండపై గ్రామాలకు నీరేదీ?

ABN , Publish Date - Mar 11 , 2025 | 12:11 AM

Hilltop villages కొండపై గిరిజన గ్రామాలకు తాగునీటి కష్టాలు తప్పడం లేదు. సీతంపేట ఐటీడీఏ పరిధిలో 672 గిరిజన గ్రామాలు ఉన్నాయి. ఇందులో 93,877 మంది నివసిస్తున్నారు. 234 రక్షితనీటి పథకాలు, 1,497 పంపుసెట్లు, 888 బావులు ఉన్నాయి.

Water problem: కొండపై గ్రామాలకు నీరేదీ?
అడ్డివాడలో గ్రావిటేషన్‌ ద్వారా నీటి సరఫరా

  • మరమ్మతులకు గురైన రక్షితనీటి పథకాలు

  • పాడైపోయిన పైపులైన్లు

  • గిరిజనులకు తప్పని ఇబ్బందులు

  • మెళియాపుట్టి, మార్చి 10(ఆంధ్రజ్యోతి):

  • మెళియాపుట్టి మండలం కొండపై ఉన్న అడ్డివాడ గిరిజన గ్రామంలో సుమారు 37 కుటుంబాలు ఉన్నాయి. 150 మంది ప్రజలు నివసిస్తున్నారు. 15 ఏళ్ల కిందట ఒక స్వచ్ఛంద సంస్థ ఈ గ్రామానికి గ్రావీటి ద్వారా ట్యాంక్‌ ఏర్పాటు చేసింది. పైపుల ద్వారా ట్యాంకుకు వస్తున్న ఊటనీటిని గిరిజనులు వినియోగిస్తున్నారు. కొండపై నుంచి నాలుగు కిలోమీటర్ల పొడవునా వేసిన పైపులు పాడవడంతో నీరు తక్కువగా వస్తోందని ఆందోళన చెందుతున్నారు. ఈ పథకానికి సోలార్‌ ఏర్పాటు చేసినా పనిచేయడం లేదని, రోజూ నీటికోసం ఇబ్బందులు పడుతున్నామని వాపోతున్నారు.

    ...........................

  • మెళియాపుట్టి మండలం చందనగిరిలో సుమారు 60 కుటుంబాల్లో 200 మంది జనాభా నివసిస్తున్నారు. ఇక్కడ కూడా గ్రావిటీ ద్వారా నీరందిస్తున్నారు. ఊటబావి నుంచి వచ్చే పైపులైన్లు పాడవడంతో నీరు రావడం లేదు. ఇటీవల రోడ్డు పనులు చేపట్టినప్పుడు పైపు తవ్వడంతో బురదనీరే వస్తోందని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

    .........................

  • మెళియాపుట్టి మండలం గూడ గ్రామంలో 23 ఇళ్లు ఉన్నాయి. 97 మంది ప్రజలు నివసిస్తున్నారు. గ్రామానికి గ్రావిటీ నీరు సైతం లేదు. దీంతో కొండ కింద రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న బావినీరే దిక్కవుతోంది. గతంలో బావిలో మోటారు ఏర్పాటు చేసి.. గ్రామంలో ట్యాంక్‌కు తాగునీరు సరఫరా చేసేవారు. ప్రస్తుతం మోటారు పాడవడంతో నీరు తమ గ్రామానికి రావడం లేదని గిరిజనులు పేర్కొంటున్నారు.

    .......................

  • ఇలా కొండపై గిరిజన గ్రామాలకు తాగునీటి కష్టాలు తప్పడం లేదు. సీతంపేట ఐటీడీఏ పరిధిలో 672 గిరిజన గ్రామాలు ఉన్నాయి. ఇందులో 93,877 మంది నివసిస్తున్నారు. 234 రక్షితనీటి పథకాలు, 1,497 పంపుసెట్లు, 888 బావులు ఉన్నాయి. వీటితోపాటు 115 గ్రావిటీలు ఉన్నాయి. విద్యుత్‌ సౌకర్యం లేని గ్రామాలకు 210 సోలార్‌ పథకాలను ఏర్పాటు చేశారు. వైసీపీ ప్రభుత్వం గత ఐదేళ్లూ తాగునీటి పథకాల నిర్వహణ కోసం నిధులు మంజూరు చేయలేదు. దీంతో చాలా తాగునీటి పథకాలు మరమ్మతులకు గురయ్యాయి. పలుచోట్ల పైపులు పాడైపోయాయి. 2022లో మాజీ సీఎం జగన్‌ పాతపట్నంలో పర్యటించారు. ఉద్దానం తాగునీటి పథకంతోపాటు ఇంటింటికీ తాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు. పాతపట్నం నియోజకవర్గానికి రూ.265కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఎన్నికల ముందు పైపులు తెచ్చారు. కానీ పనులు చేపట్టకపోవడంతో తాగునీటి ఇబ్బందులు తప్పడం లేదని గిరిజనులు ఆవేదన చెందుతున్నారు.

  • ఆర్‌డబ్ల్యూఎస్‌ ఏఈ లేక..

    ప్రస్తుతం వేసవి సమీపించింది. కాగా రెగ్యులర్‌ ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారి లేరు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మెళియాపుట్టి ఏఈ కల్యాణ్‌ను విశాఖ జిల్లాకు బదిలీ చేశారు. పాతపట్నం ఏఈ ఉదయ్‌కు మెళియాపుట్టి ఇన్‌చార్జి ఏఈగా బాధ్యతలు అప్పగించారు. ఆయన ఇటీవల అంగన్‌వాడీ కేంద్రాలకు సైతం తాగునీరు ఇవ్వాలనే ఉద్దేశంతో ట్యాంకులు ఏర్పాటుకు నిధులు మంజూరు చేశారు. కాగా పనులు చేసినా బిల్లులు ఇవ్వడం లేదని పలువురు పేర్కొంటున్నారు. రెండు మండలాలలకు ఒక్కరే ఏఈ కావడంతో తాగునీటి సమస్య పరిష్కారం కావడం లేదని చెబుతున్నారు.

  • ఇబ్బందులు రానివ్వం

    వేసవిలో ఎక్కడా తాగునీటికి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే తాగునీటి సమస్యలు ఉన్న గ్రామాలను గుర్తించాం. ఆయాచోట్ల పనులు చేపడతాం.

    - ప్రసాద్‌పండా, ఎంపీడీవో, మెళియాపుట్టి

Updated Date - Mar 11 , 2025 | 12:11 AM