Share News

విద్యార్థులకు భద్రత ఏదీ?

ABN , Publish Date - Nov 16 , 2025 | 11:31 PM

Failures in government hostels ప్రభుత్వ వసతిగృహాలకు సంబంధించి ఇటీవల వెలుగుచూసిన ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. వసతిగృహాలపై పర్యవేక్షణ లేకపోవడంతో ఇటువంటి పరిణామాలు జరుగుతున్నాయి. వార్డెన్ల కొరత నేపథ్యంలో విద్యార్థుల రక్షణ, భద్రత ప్రశ్నార్థకంగా మారుతోంది.

విద్యార్థులకు భద్రత ఏదీ?

  • ప్రభుత్వ వసతిగృహాల్లో వైఫల్యాలు

  • సగానికిపైగా హాస్టళ్లలో వార్డెన్లు లేరు

  • పర్యవేక్షణ లేక తప్పని ఇబ్బందులు

  • రణస్థలం, నవంబరు 16(ఆంధ్రజ్యోతి):

  • ఈ ఏడాది జనవరిలో శ్రీకాకుళంలోని ఓ బాలికల వసతిగృహంలోకి ఆగంతుకులు ప్రవేశించారు. రాత్రి సమయంలో గోడ దూకి లోపలికి ప్రవేశించి ఓ విద్యార్థినిపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. తోటి విద్యార్థులు గమనించి కేకలు వేయగా.. అక్కడి నుంచి పరారీ అయ్యారు.

  • వారం రోజుల కిందట వేకువజామున టెక్కలిలోని ఓ వసతిగృహంలో ఓ విద్యార్థిని గోడ దూకి పారిపోయింది. విశాఖ బస్సెక్కి వెళ్లిపోయింది. గమనించిన తోటి విద్యార్థులు, సిబ్బంది తల్లిదండ్రులకు సమాచారమిచ్చారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విశాఖ వెళ్లి పట్టుకున్నారు.

  • రణస్థలంలోని ప్రభుత్వ వసతిగృహంలో ఓ విద్యార్థిపై తోటి విద్యార్థులే లైంగిక దాడికి పాల్పడ్డారు. హాస్టల్‌లో రెగ్యులర్‌ వార్డెన్‌ లేకపోవడంతో పర్యవేక్షణ కొరవడింది. దీంతో ఒక జూనియర్‌ విద్యార్థిపై సీనియర్లు పైశాచికత్వం ప్రదర్శించి.. వీడియో చిత్రీకరించారు.

  • ప్రభుత్వ వసతిగృహాలకు సంబంధించి ఇటీవల వెలుగుచూసిన ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. వసతిగృహాలపై పర్యవేక్షణ లేకపోవడంతో ఇటువంటి పరిణామాలు జరుగుతున్నాయి. వార్డెన్ల కొరత నేపథ్యంలో విద్యార్థుల రక్షణ, భద్రత ప్రశ్నార్థకంగా మారుతోంది. కొంతమంది విధుల్లో నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. వంట మనుషులు, సెక్యూరిటీ గార్డులకు పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించి రాత్రిపూట వార్డెన్లు హాస్టళ్లకు రావడం లేదన్న విమర్శలున్నాయి. దీంతో మెనూ అమలు, హాస్టళ్ల నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. వసతి కూడా సక్రమంగా లేదు. పర్యవేక్షణ లేక విద్యార్థులు క్రమశిక్షణ తప్పుతున్నారు.

  • ఇదీ పరిస్థితి..

  • జిల్లాలో 81 ప్రభుత్వ వసతి గృహాల్లో 6,500 మంది వరకూ విద్యార్థులు ఉన్నారు. 44 మంది మాత్రమే వార్డెన్లు ఉండగా.. 34 హాస్టళ్లను ఇన్‌చార్జిలతోనే నెట్టుకొస్తున్నారు. సగానికిపైగా వార్డెన్లు లేకపోవడంతో ఒక్కొక్కరు రెండు హాస్టళ్ల బాధ్యతలు చూస్తున్నారు. వాస్తవానికి ప్రతి హాస్టల్‌లో వార్డెన్‌, డిప్యూటీ వార్డెన్‌, కుక్‌, సహాయకులు, నైట్‌ వాచ్‌మెన్‌ ఉండాలి. దగ్గర్లో ఉన్న పీహెచ్‌సీ ఏఎన్‌ఎంలు విద్యార్థులకు వైద్య పరీక్షలు చేస్తుండాలి. కానీ వార్డెన్లు అరకొరగా ఉండగా.. మిగతా సిబ్బంది కాంట్రాక్ట్‌ ప్రతిపాదికన పని చేస్తున్నారు. రెండు మూడు హాస్టళ్ల బాధ్యతలు అప్పగించడంతో వార్డెన్లు పూర్తిస్థాయిలో పర్యవేక్షించడం లేదు. దీంతో విద్యార్థులు గాడి తప్పుతున్నారు. కిందిస్థాయి సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. గత 20ఏళ్లుగా వార్డెన్‌ల నియామకాలు చేపట్టలేదు. చాలామంది పదవీ విరమణ పొందగా, వారి స్థానంలో కొత్త వారు రాలేదు. దీంతో ఏటా వార్డెన్‌ పోస్టుల ఖాళీలు పెరుగుతున్నాయి. ప్రభుత్వం వార్డెన్ల పోస్టుల భర్తీపై దృష్టి సారించాల్సి ఉంది. హాస్టళ్లలో వార్డెన్‌, వంట మనిషి, సహాయకులు, సెక్యూరిటీ గార్డులు పూర్తిస్థాయిలో ఉంటేనే విద్యార్థులకు రక్షణ, భద్రత ఉంటుంది.

  • అరకొరగా మెనూ

  • వసతిగృహాల్లో విద్యార్థులకు సంబంధించి డైట్‌ చార్జీలు పెంచకపోవడంతో ఆహారం నాణ్యతపై ఆ ప్రభావం పడుతోంది. 2018లో టీడీపీ ప్రభుత్వ హయాంలో డైట్‌చార్జీలు పెంచారు. వైసీపీ పాలనలో అసలు డైట్‌ చార్జీలు పెంచకపోవడంతో మెనూ సక్రమంగా అమలుకాలేదు. కరోనా తర్వాత నిత్యావసర వస్తువుల ధరలు భారీగా పెరగడంతో మెనూలో కోత విధిస్తున్నారు. వారానికి ఆరు రోజులు పెట్టాల్సిన కోడిగుడ్డును రెండు రోజులే పెడుతున్నారు. చికెన్‌ వారానికి ఒక రోజుకే పరిమితం చేస్తున్నారు. కూరల్లో నాణ్యత కొరవడుతోంది. కూటమి ప్రభుత్వమైనా స్పందించి పెరిగిన నిత్యావసరాల ధరలకు అనుగుణంగా మెస్‌ చార్జీలు పెంచాలని పలువురు కోరుతున్నారు. వసతిగృహాల్లో సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

  • నివేదిక కోరాం..

  • ఇటీవల జరిగిన ఘటనలపై నివేదిక కోరాం. ప్రభుత్వ వసతిగృహాలకు సంబంధించి వార్డెన్లు కొరత వాస్తవమే. అయినా ఎక్కడా ఇబ్బందులు లేకుండా చూస్తున్నాం. విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం పెడుతున్నాం. జిల్లాలో 34 హాస్టళ్లకు సంబంధించి వార్డెన్ల కొరత ఉంది. కొందరికి అదనపు బాధ్యత పడుతోంది. దీనిపై ప్రభుత్వానికి నివేదించాం.

    - అనూరాధ, బీసీ సంక్షేమ శాఖ అధికారి, శ్రీకాకుళం

Updated Date - Nov 16 , 2025 | 11:31 PM