ఇంకెప్పుడిస్తారో?
ABN , Publish Date - Oct 26 , 2025 | 11:37 PM
Farmers' wait for agricultural machinery రైతులకు రాయితీపై హార్టికల్చర్, అగ్రికల్చర్ యంత్రాలు, పనిముట్లు అందడం లేదు. ఖరీఫ్ సీజన్ ముగుస్తున్నా ఇంకా 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వ్యవసాయ పరికరాల పంపిణీపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదు. దీంతో రైతులు ఆధునిక వ్యవసాయ పద్ధతులకు దూరమవుతున్నారు.
వ్యవసాయ యంత్రాల కోసం రైతుల ఎదురుచూపు
ఖరీఫ్ సీజన్ ముగుస్తున్నా కానరాని పంపిణీ
వివరాల నమోదుకే పరిమితమైన అధికారులు
కోటబొమ్మాళి, అక్టోబరు 26(ఆంద్రజ్యోతి): రైతులకు రాయితీపై హార్టికల్చర్, అగ్రికల్చర్ యంత్రాలు, పనిముట్లు అందడం లేదు. ఖరీఫ్ సీజన్ ముగుస్తున్నా ఇంకా 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వ్యవసాయ పరికరాల పంపిణీపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదు. దీంతో రైతులు ఆధునిక వ్యవసాయ పద్ధతులకు దూరమవుతున్నారు. కూలీల కొరత నేపథ్యంలో అన్నదాతలు వ్యవసాయ పనులకు యంత్రాలు, పనిముట్లపై ఆధారపడుతున్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఐదేళ్లపాటు రైతులకు ఎలాంటి పరికరాలు అందించలేదు. క్లస్టర్ హైరింగ్ సెంటర్లను ఏర్పాటు చేసి వైసీపీకి అనుకూలమైన వారికి మాత్రమే వాటిని అందజేశారు. 2014-19 మధ్య అప్పటి టీడీపీ ప్రభుత్వం ఏడాదికి సుమారు రూ.60కోట్ల నుంచి రూ.80కోట్ల వరకు రాయితీ పరికరాలను పంపిణీ చేసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పరికరాల పంపిణీపై స్పష్టత కరువైంది. గత ఏడాది కూడా చివర్లో నామమాత్రంగా పరికరాలు పంపిణీ చేశారు. ఈ ఏడాది ట్రాక్టర్లు, మినీ ట్రాక్టర్లు, ఆయిల్ ఇంజన్లు, పవర్‌టిల్లర్లు, వీడర్లు, టార్పాలిన్లు, రోటావేటర్లు, కోత యంత్రాలు, స్ర్పేయర్లు, దమ్ము సెట్, దుక్కు సెట్ తదితర వ్యవసాయ యంత్ర, పరికరాలను సబ్సిడీపై రైతులకు అందించాల్సి ఉంది. కానీ, ఇంతవరకు ఆ ఊసే లేదు. ప్రభుత్వం కొత్తగా ప్రవేశ పెట్టిన ఎఫ్‌ఎం(ఫాం మెకనైజేషన్) యాప్‌లో రైతుల వద్ద ఏయే వ్యవసాయ పరికరాలు అందుబాటులో ఉన్నాయి.. ఇంకా ఏవి అవసరం.. ప్రస్తుతం ఉన్నవి రాయితీపై ఇచ్చినవా.. రైతులు సొంతంగా కొనుగోలు చేసినవా? అనే వివరాలు రైతు సేవా కేంద్రాల్లో పని చేస్తున్న గ్రామ వ్యవసాయ సహాయకులు నమోదు చేస్తున్నారు. అవసరాలకు అనుగుణంగా యంత్రాలు, పనిముట్లకు దరఖాస్తులు ఆహ్వానిస్తారని వారు చెబుతున్నా ఇప్పటివరకు ఎలాంటి మార్గదర్శకాలు రాలేదు. ఇప్పటికే యంత్రాలు, పనిముట్ల పంపిణీలో జాప్యం కావడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. వ్యవసాయ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా ఫలితం ఉండడం లేదు. మరికొన్ని రోజుల్లో వరి కోతలు ప్రారంభంకానున్నాయి. వీటికి కోత యంత్రాలు అవసరం. అలాగే, వర్షాలు కురిస్తే పంటను కాపాడుకోవడానికి టార్పాలిన్లు కావాల్సి ఉంటుంది. ఈనేపథ్యంలో రాయితీపై యంత్రాలు, పనిముట్లను అధికారులు అందించాలని రైతులు కోరుతున్నారు.
ఆయిల్ ఇంజన్ అందజేయాలి
నేను రెండు ఎకరాల్లో కూరగాయలు సాగు చేస్తున్నా. వాటికి సాగునీరు అందించేందుకు ఆయిల్ ఇంజన్ అవసరం. దీని ధర బయట మార్కెట్‌లో రూ.25వేల పైగా ఉంది. గత టీడీపీ ప్రభుత్వం సబ్సిడీపై రైతులకు రూ.10వేలుకే అందించింది. ఇంజన్ కోసం కొన్ని నెలలుగా మండల వ్యవసాయ కార్యాలయానికి తిరుగుతున్నా. వచ్చినప్పుడు ఇస్తామని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సబ్సిడీపై అందించాలి.
- నేతింటి చిన్నబాబు, ఊడికలపాడు, కోటబొమ్మాళి.
నివేదిక పంపించాం
ఆయిల్ ఇంజన్లు, స్ర్పేయర్లు, టార్పాలిన్‌లు కావాలని ప్రతిరోజూ రైతులు కార్యాలయానికి వస్తున్నారు. వారి పేర్లను నమోదు చేసుకొని ఆ వివరాలు ఉన్నతాధికారులకు అందజేశాం. యంత్రాలు, వ్యవసాయ పనిముట్లు కార్యాలయానికి వచ్చిన వెంటనే రైతులకు అందజేస్తాం.
- ఎస్.గోవిందరావు, మండల వ్యవసాయాధికారి, కోటబొమ్మాళి.