Share News

మా డబ్బులు ఎప్పుడిస్తారు?

ABN , Publish Date - Sep 07 , 2025 | 12:09 AM

Customers protest at the post office in Ichchapuram ఇచ్ఛాపురంలో పోస్టాఫీసు వద్ద ఖాతాదారులు శనివారం నిరసన చేపట్టారు. తాము దాచుకున్న డబ్బులు ఎప్పుడిస్తారని అధికారులను నిలదీశారు. కుటుంబ అవసరాలు, చదువులు, వివాహాలు, వైద్యసేవల నిమిత్తం చాలామంది ఖాతాదారులు పోస్టాఫీసులో డబ్బులు దాచుకున్నారు.

మా డబ్బులు ఎప్పుడిస్తారు?
ఇచ్ఛాపురంలో పోస్టాఫీస్‌ వద్ద బాధితుల నిరసన

ఇచ్ఛాపురంలో పోస్టాఫీస్‌ వద్ద ఖాతాదారుల నిరసన

రెండు వారాల్లో చెల్లించాలని డిమాండ్‌

లేదంటే నిరాహార దీక్ష చేస్తామని హెచ్చరిక

ఇచ్ఛాపురం, సెప్టెంబరు 6(ఆంధ్రజ్యోతి): ఇచ్ఛాపురంలో పోస్టాఫీసు వద్ద ఖాతాదారులు శనివారం నిరసన చేపట్టారు. తాము దాచుకున్న డబ్బులు ఎప్పుడిస్తారని అధికారులను నిలదీశారు. కుటుంబ అవసరాలు, చదువులు, వివాహాలు, వైద్యసేవల నిమిత్తం చాలామంది ఖాతాదారులు పోస్టాఫీసులో డబ్బులు దాచుకున్నారు. ఇటీవల కొంతమంది చేతివాటం కారణంగా ఆన్‌లైన్‌ మోసం వెలుగుచూడడంతో ఖాతాదారులు ఆందోళన చెందుతున్నారు. రెండు నెలలుగా తాము దాచుకున్న డబ్బులు ఇవ్వాలంటూ పోస్టాఫీసు చుట్టూ తిరుగుతున్నారు. అయినా అధికారుల్లో స్పందన లేకపోవడంతో శనివారం చాట్ల లోహిదాస్‌రెడ్డి, ఇసురు బాలరాజు, కిరణ్మయి, శ్యాంకుమార్‌, ప్రశాంత్‌ తదితర ఖాతాదారులు పోస్టాఫీస్‌ వద్ద ఆందోళన చేశారు. తమ డబ్బులు ఎప్పుడిస్తారో స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

పోస్టల్‌ సిబ్బంది జిల్లా సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోస్టల్‌(ఎస్పీ) అధికారి వి.హరిబాబుకు ఫోన్‌ద్వారా సమాచారం ఇచ్చారు. ఆయన బాధితులతో ఫోన్‌లో మాట్లాడి సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. బాధితుడు లోహిదాస్‌ ఎస్పీతో ఫోన్‌లో మాట్లాడుతూ.. ‘మా కుటుంబానికి సంబంధించి దాచుకున్న రూ.11లక్షలతోపాటు 33 ఖాతాదారుల సొమ్మును పోస్టల్‌ సిబ్బంది దోచుకున్నారు. మరో 5మందికి నకిలీ పాస్‌ పుస్తకాలు ఇచ్చి మోసానికి పాల్పడ్డారు. మొత్తంగా సుమారు రూ.2.87 కోట్లు వరకు ఆన్‌లైన్‌ మోసం జరిగింది. మా డబ్బులు మాకు ఇవ్వాల’ని చెప్పారు. అలాగే మరికొంతమంది బాధితులు మాట్లాడుతూ రెండు వారాల్లో తమ డబ్బులు వడ్డీతో సహా చెల్లించాలని లేదంటే నిరాహార దీక్షలు చేపడతామన్నారు. పెట్రోల్‌ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటామని మరికొందరు పేర్కొన్నారు. దీనిపై ఎస్పీ హరిబాబు స్పందిస్తూ.. ‘ఈ కేసు సీబీఐకి అప్పగించాం. దీనిపై పూర్తిస్థాయిలో విచారణ జరుగుతోంది. ఇప్పటికే ఆన్‌లైన్‌ మోసాలకు పాల్పడిన ఐదుగురిని అరెస్టు చేశారు. నెలరోజుల్లో సమస్య పరిష్కరించి ఖాతాదారులందరికీ న్యాయం చేస్తామ’ని హామీ ఇచ్చారు. ఆందోళన వద్దని సూచించారు. దీంతో ఖాతాదారులు శాంతించారు. బాధితులకు అంగన్‌వాడీ యూనియన్‌ లీడర్‌ బి.హైమావతి, జనసేన నాయకులు దాసరి శేఖర్‌ మద్దతు పలికారు.

Updated Date - Sep 07 , 2025 | 12:09 AM