వెంటిలేటర్లకు ‘ఊపిరి’ ఆడేదెప్పుడు?
ABN , Publish Date - Dec 02 , 2025 | 11:59 PM
Only 42 of the 373 ventilators in RIMS are working! అత్యవసర సమయంలో రోగి ప్రాణాలకు ఊపిరి పోయాల్సిన వెంటిలేటర్లు మూలకు చేరాయి. శ్రీకాకుళం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి(రిమ్స్)లో నెలకొన్న తాజా పరిస్థితి చూస్తే రోగుల గుండెల్లో దడ పుట్టక తప్పదు. కాగితాల మీద వందల సంఖ్యలో వెంటిలేటర్లు కనిపిస్తున్నా.. ఆచరణలో పనిచేసేవి మూడో వంతు కూడా లేకపోవడం గమనార్హం.
రిమ్స్‌లో 373 పరికరాలకు పనిచేసేవి 42 మాత్రమే!
మిగిలినవన్నీ మూలకు చేరిన వైనం
అత్యవసర సేవల్లో అంతులేని నిర్లక్ష్యం
శ్రీకాకుళం, డిసెంబరు 2(ఆంధ్రజ్యోతి): అత్యవసర సమయంలో రోగి ప్రాణాలకు ఊపిరి పోయాల్సిన వెంటిలేటర్లు మూలకు చేరాయి. శ్రీకాకుళం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి(రిమ్స్)లో నెలకొన్న తాజా పరిస్థితి చూస్తే రోగుల గుండెల్లో దడ పుట్టక తప్పదు. కాగితాల మీద వందల సంఖ్యలో వెంటిలేటర్లు కనిపిస్తున్నా.. ఆచరణలో పనిచేసేవి మూడో వంతు కూడా లేకపోవడం గమనార్హం. రిమ్స్‌లో రికార్డుల ప్రకారం మొత్తం 373 వెంటిలేటర్లు ఉన్నా, ప్రస్తుతం పనిచేస్తున్నవి కేవలం 42 మాత్రమే. మరి మిగిలిన 331 వెంటిలేటర్లు ‘కండమ్’(కండెమనేషన్) చేయబడ్డాయి. అంటే అవి మరమ్మతులకు కూడా నోచుకోని స్థితిలో లేదా కాలం చెల్లిపోయి మూలన పడ్డాయని అర్థం. దాదాపు 88 శాతం జీవనధార పరికరాలు మూలనపడితే జిల్లా ప్రజల ప్రాణాలకు భరోసా ఎక్కడిది?. పిడియాట్రిక్, అడల్ట్స్ వార్డుల్లో తరుచూ వెంటిలేటర్లు అవసరం ఉంటున్నాయి. కానీ ఆశించినస్థాయిలో వెంటిలేటర్లు లేక రోగులు ఇబ్బందులు పడుతున్నారు.
విపత్తు వస్తే.. విలవిల్లాడాల్సిందేనా..?
గతంలో కొవిడ్ మహమ్మారి విరుచుకుపడినప్పుడు ఆక్సిజన్ అందక.. వెంటిలేటర్లు దొరక్క చాలా మంది మృతి చెందారు. ఆ సమయంలో ‘వెంటిలేటర్లు లేవు’ అని చేతులెత్తేసిన ప్రభుత్వాలు.. ఆ తర్వాత పాఠాలు నేర్చుకున్న దాఖలాలు కనిపించడం లేదు. ఒకవేళ రేపు కొవిడ్ వంటి మరో కొత్త వైరస్ వచ్చినా.. లేదా ఏదైనా భారీ ప్రమాదం జరిగి పదుల సంఖ్యలో అత్యవసర కేసులు వచ్చినా.. ఈ 42 వెంటిలేటర్లు ఏ మూలకు సరిపోతాయి?. అప్పటికప్పుడు కొత్తవి కొనలేరు. ఉన్నవాటిని బాగు చేయించలేరు. ‘యుద్ధం వచ్చాక కత్తులు నూరుతాం’ అన్నట్లుగా అధికారుల తీరు ఉందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. 331 వెంటిలేటర్లు నిరుపయోగంగా మారినా వాటిస్థానంలో కొత్తవి సమకూర్చుకోవడంలో లేదా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడంలో అలసత్వం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది.
దృష్టి సారిస్తేనే.. ఫలితం
వెంటిలేటర్ అంటే కేవలం ఒక యంత్రం కాదు.. అది ఒక ప్రాణం. 331 వెంటిలేటర్లు మూలన పడటం అంటే 331 మంది ప్రాణాలకు రక్షణ కవచం లేనట్లే. ప్రజల ప్రాణాలతో ముడిపడి ఉన్న అంశం కాబట్టి ప్రభుత్వం వీటిపై దృష్టి సారించాలి. కండమ్ చేసిన 331 వెంటిలేటర్ల స్థానంలో వెంటనే కొత్తవాటిని మంజూరు చేయాలి. లేదా కనీసం ఆపరేషనల్ కెపాసిటీని 80 శాతానికి పెంచేలా చర్యలు తీసుకోవాలి. ఉన్న 42 వెంటిలేటర్లలో కూడా ఎప్పుడు ఏది మొరాయిస్తుందో తెలియదు. కాబట్టి బయోమెడికల్ ఇంజనీరింగ్ విభాగం నిరంతరం అప్రమత్తంగా ఉండాలి. కేవలం పరికరాలు ఉంటే సరిపోదు. ఆపద వచ్చినప్పుడు వాటిని ఆపరేట్ చేయడానికి సరిపడా టెక్నీషియన్లు ఉన్నారా? లేదా? అన్నది పరిశీలించాలి. ఆసుపత్రి అభివృద్ధి కమిటీ నిధులు, ప్రభుత్వ ప్రత్యేక గ్రాంట్ల ద్వారా వెంటిలేటర్ల మరమ్మతులు, కొనుగోలుకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. జిల్లా యంత్రాంగం, వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు ఇప్పటికైనా మేల్కొని మరో విపత్తు రాకముందే రిమ్స్ వెంటిలేటర్లకు ‘ఆక్సిజన్’ అందించాల్సిన అవసరం ఉంది.
ప్రభుత్వానికి విన్నవించాం
ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో 331 వెంటిలేటర్లు మూలకు చేరాయి. అత్యధిక వెంటిలేటర్లు కోవిడ్ సమయంలో పీఎం కేర్స్ ఫండ్ నుంచి మంజూరైనవే. ఇవి కొన్నాళ్ల కిందట పాడయ్యాయి. వాటి నిర్వహణకు సంబంధించి ఆయా సంస్థలవారు ఉండరు. ప్రస్తుతం అత్యవసరంగా వెంటిలేటర్లు మంజూరు చేయాలని ప్రభుత్వానికి విన్నవించాం. ప్రతిపాదనలను కూడా సిద్ధం చేసి ఆసుపత్రి సమావేశంలో ప్రస్తావించాం.
- డాక్టర్ లుకలాపు ప్రసన్నకుమార్, ఇన్‌చార్జి సూపరింటెండెంట్, రిమ్స్