Share News

శుద్ధజల కేంద్రాలు తెరిచేదెప్పుడు?

ABN , Publish Date - Oct 02 , 2025 | 12:23 AM

గత వైసీపీ ప్రభుత్వంలో పలాస, ఇచ్ఛాపురం నియోజకవర్గాల్లో మూతపడిన 135 శుద్ధజల కేంద్రాలను తెరుస్తామని కూటమి ప్రభుత్వం చెప్పింది.

శుద్ధజల కేంద్రాలు తెరిచేదెప్పుడు?
కవిటి మండలం కొరికాన పుట్టుగలో నిరుపయోగంగా ఎన్టీఆర్‌ సుజలధార ట్యాంక్‌

- గత వైసీపీ సర్కారులో మూతపడిన 135 ప్లాంట్లు

- వినియోగంలోకి తెస్తామన్న కూటమి ప్రభుత్వం

- మూడు నెలల కిందట రూ.5.75 కోట్లు కేటాయింపు

- ఇప్పటికీ విడుదలకాని నిధులు

ఇచ్ఛాపురం, అక్టోబరు 1 (ఆంధ్రజ్యోతి): గత వైసీపీ ప్రభుత్వంలో పలాస, ఇచ్ఛాపురం నియోజకవర్గాల్లో మూతపడిన 135 శుద్ధజల కేంద్రాలను తెరుస్తామని కూటమి ప్రభుత్వం చెప్పింది. వీటికోసం రూ.5.75 కోట్లను కేటాయించింది. నిధుల విడుదలకు ఈ ఏడాది జూన్‌లో కేబినెట్‌ ఆమోదం తెలిపింది. కానీ, ఇంతవరకూ నిధులు రాకపోవడంతో శుద్ధ జల కేంద్రాలు తెరుచుకోలేదు. దీంతో రెండు నియోజకవర్గాల్లోని వందలాది గ్రామాల ప్రజలకు ఇబ్బందులు తప్పడంలేదు.

ఇదీ పరిస్థితి..

ఉద్దానంలో కిడ్నీ వ్యాధులకు తాగునీరు కలుషితం కావడం ఒక కారణమని అధ్యయనాలు తేల్చాయి. దీంతో 2018లో టీడీపీ ప్రభుత్వం ఎన్టీఆర్‌ సుజలధార పథకాన్ని ప్రారంభించింది. అప్పట్లో ఈ పథకం కుప్పం నియోజకవర్గానికి కేటాయించాల్సి ఉంది. కానీ, నాడు మంత్రిగా ఉన్న లోకేశ్‌ ప్రత్యేక చొరవతో ఉద్దానంలో రూ.14 కోట్ల వ్యయంతో శుద్ధ జలాల ప్లాంట్లను అధికారులు ఏర్పాటు చేశారు. పలాస, వజ్రపుకొత్తూరు, మందస, కవిటి, కంచిలి, సోంపేట, ఇచ్ఛాపురం మండలాల్లో ఒక్కొక్క మదర్‌ ప్లాంట్‌ను ఏర్పాటు చేశారు. ఈ ఏడు మండలాల్లోని మదర్‌ ప్లాంట్ల నుంచి 135 గ్రామాల్లోని సరఫరా కేంద్రాలకు ట్యాంకర్లతో (స్టీల్‌ కంటైనర్లు) శుద్ధ జలాలను తరలించేవారు. ఇక్కడ 20 లీటర్ల నీటిని రూ.2కే ప్రజలకు అందించేవారు. కొన్నాళ్ల పాటు ఇవి బాగానే పనిచేశాయి. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత వీటి నిర్వహణను గాలికొదిలేసింది. నిర్వహణ వ్యయం పేరిట 20 లీటర్ల నీటి క్యాన్‌ను రూ.7కు పెంచింది. ఒక కుటుంబానికి రోజుకు సగటున మూడు క్యాన్లు అవసరం. అంటే తాగునీటికి రోజుకు రూ.21 ఖర్చుచేయాల్సి వచ్చేది. తరువాత ఉద్దానం సమగ్ర మంచినీటి పథకం అంటూ హడావుడి చేసిన జగన్‌ ప్రభుత్వం శుద్ధజల కేంద్రాలను పూర్తిగా పట్టించుకోవడం మానేసింది. దీంతో ప్లాంట్లన్నీ మూతపడ్డాయి. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత ఎన్టీఆర్‌ సుజలధారపై ప్రత్యేక దృష్టి సారించింది. ఈ మేరకు శుద్ధజల కేంద్రాల నిర్వహణకు రూ.5.75 కోట్లు కేటాయించింది. ఈ నిధులను తక్షణమే మంజూరు చేసి శుద్ధజల కేంద్రాలను తెరిపించాలని ఉద్దానం ప్రజలు కోరుతున్నారు.

అన్ని కేంద్రాలు తెరుస్తాం

ఉద్దానం ప్రజలకు శుద్ధ జలాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యం. అన్ని శుద్ధజల కేంద్రాలను అందుబాటులోకి తెస్తాం. ఎక్కడైనా ప్లాంట్లు పాడైతే ఫిర్యాదు చేయాలి. వెంటనే బాగుచేయిస్తాం.

-ఏవీ మురళిమోహన్‌, డీఈఈ, ఆర్‌డబ్ల్యూఎస్‌

Updated Date - Oct 02 , 2025 | 12:23 AM