బిల్లులు ఎప్పుడిస్తారో?
ABN , Publish Date - Nov 20 , 2025 | 12:35 AM
ఒక్క దామోదరరావే కాదు జిల్లా వ్యాప్తంగా ఉన్న కాంట్రాక్టర్లు అందరూ బిల్లుల కోసం ఎదురుచూస్తున్నారు.
- 15వ ఆర్థిక సంఘ నిధులతో చేపట్టిన పనులు
- రూ.కోట్లలో బిల్లులు పెండింగ్
- కాంట్రాక్టర్లకు తప్పని ఎదురుచూపు
-కాశీబుగ్గకు చెందిన కణితి దామోదరరావు అనే కాంట్రాక్టర్ పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీలో రహదారులు, కాలువ పనులు చేపట్టేందుకు టెండర్లు దక్కించుకుని ఆ పనులు పూర్తి చేశాడు. రెండేళ్లవుతున్నా ఆయనకు బిల్లులు చెల్లించలేదు. ఈ పనుల కోసం ఆయన లక్షల రూపాయలు అప్పుచేసి పెట్టుబడి పెట్టాడు. వాటికి వడ్డీలు చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నాడు. బిల్లుల కోసం ఇంజనీరింగ్ అధికారుల చుట్టూ తిరుగుతున్నాడు.
పలాస, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి): ఒక్క దామోదరరావే కాదు జిల్లా వ్యాప్తంగా ఉన్న కాంట్రాక్టర్లు అందరూ బిల్లుల కోసం ఎదురుచూస్తున్నారు. 15వ ఆర్థిక సంఘం నిధులతో చేపట్టినా పనులకు నేటికీ బిల్లులు అందకపోవడంతో వారు ఇబ్బందులు పడుతున్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో చివరి సంవత్సరం నుంచి కూటమి ప్రభుత్వం వచ్చిన 16 నెలల కాలంలో చేసిన పనులకు గాను ఇప్పటి వరకు బిల్లులు చెల్లించలేదు. పైగా కొత్త అభివృద్ధి పనులకు టెండర్లు పిలుస్తూ కాంట్రాక్టర్లతో బలవంతంగా పనులు చేయిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఒక్కో కాంట్రాక్టర్‌కు రూ.10లక్షల నుంచి రూ.కోటి వరకూ బిల్లులు పెండింగ్ ఉన్నాయి. వాటి కోసం ప్రతిరోజూ కాంట్రాక్టర్లు ఇంజనీరింగ్ అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో సీఎంఎస్‌ఎఫ్ ద్వారా బిల్లులు ఇచ్చేవారు. అయితే చివరి ఏడాది చేపట్టిన పనులకు సంబంధించి రూ.కోట్లలో బకాయిలు ఉండిపోయాయి. అనంతరం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కాంట్రాక్టర్లకు రూ.కోట్లలో బకాయిలు ఉన్న విషయాన్ని గుర్తించి, వాటిని దపదపాలుగా ఇచ్చేందుకు నిర్ణయం తీసుకుంది. ఆరు నెలల కిందట ఒక్కో కాంట్రాక్టర్‌కు రూ.50 లక్షల వరకూ బకాయిలు చెల్లించింది. కూటమి ప్రభుత్వం సీఎంఎస్‌ఎఫ్ ఖాతాలను పూర్తిగా రద్దు చేసి, కొత్త ఖాతాల ద్వారా నగదు చెల్లించడానికి రంగం సిద్ధం చేసింది. మొత్తం అన్నిరంగాల్లో ఉన్న ప్రభుత్వ శాఖలను ఒకే ఖాతాకిందకు తీసుకువచ్చింది. గ్రేడింగులను విభజించి పోర్టరులో నమోదైన మేరకు వరుస క్రమంలో బిల్లులు ఇచ్చేందుకు చర్యలు చేపట్టింది. ఇది జాప్యం జరుగుతుండడంతో గత 16 నెలల కాలంలో చేసిన పనులకు బిల్లులు చెల్లించలేకపోతుంది. 15వ ఆర్థిక సంఘం నిధులతో శ్రీకాకుళం కార్పొరేషన్, ఆమదాలవలస, పలాస-కాశీబుగ్గ, ఇచ్ఛాపురం మున్సిపాలిటీల్లో చేపట్టిన పనులన్నింటికీ బిల్లు బకాయిలు ఉన్నాయి. ఒక్క పలాస-కాశీబుగ్గలోనే రూ.2 కోట్ల మేర బిల్లులు పెండింగ్ ఉన్నాయి. దీంతో కొత్త పనులు చేపట్టేందుకు కాంట్రాక్టర్లు ఇష్టపడడం లేదు. ఉన్న బిల్లులకే దిక్కులేదు, కొత్త పనులు ఏ విధంగా చేపట్టగలమని అధికారులను ప్రశ్నిస్తున్నారు. అయితే, కాంట్రాక్టర్లతో బలవంతంగా పనులు చేయిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. దీనిపై పలాస-కాశీబుగ్గ డీఈఈ కనకరాజును వివరణ కోరగా.. ‘మొత్తం బిల్లుల కోసం ప్రభుత్వానికి నివేదించాం. పోర్టర్‌లో నమోదు చేసిన మేరకు వరుస క్రమంలో బిల్లు బకాయలు నేరుగా కాంట్రాక్టర్ల బ్యాంకు ఖాతాల్లో జమవుతాయి. వచ్చే ఏడాది మార్చి నాటికి బిల్లులు వేస్తామని ప్రభుత్వం తెలిపింది. వచ్చే నెల డిసెంబరులో కొంతమేరకు ఖాతాల్లో పడే అవకాశం ఉంది.’ అని తెలిపారు.