ఆ మార్గానికి.. మోక్షమెప్పుడో?
ABN , Publish Date - Sep 19 , 2025 | 11:49 PM
Expectations for expansion of six-lane national highway జిల్లాలో ఇచ్ఛాపురం నుంచి నరసన్నపేట వరకు ఆరులేన్ల జాతీయ రహదారి ప్రతిపాదలనకు మోక్షం లభించడం లేదు. జిల్లా సరిహద్దు పైడిభీమవరం నుంచి నరసన్నపేట సమీపాన జమ్ము జంక్షన్ వరకు సుమారు 180 కిలోమీటర్ల మేర ఆరులేన్ల జాతీయ రహదారి విస్తరించి ఉంది.
ఆరులేన్ల జాతీయరహదారిపై ఆశలు గల్లంతు
నరసన్నపేట నుంచి ఇచ్ఛాపురం వరకు విస్తరణకు నిరీక్షణ
టెక్కలి, సెప్టెంబరు 19(ఆంరఽధజ్యోతి): జిల్లాలో ఇచ్ఛాపురం నుంచి నరసన్నపేట వరకు ఆరులేన్ల జాతీయ రహదారి ప్రతిపాదలనకు మోక్షం లభించడం లేదు. జిల్లా సరిహద్దు పైడిభీమవరం నుంచి నరసన్నపేట సమీపాన జమ్ము జంక్షన్ వరకు సుమారు 180 కిలోమీటర్ల మేర ఆరులేన్ల జాతీయ రహదారి విస్తరించి ఉంది. కాగా జమ్ము జంక్షన్ నుంచి ఇచ్ఛాపురం వరకు సుమారు 126 కిలోమీటర్లు.. నాలుగు లేన్ల జాతీయ రహదారికే పరిమితమైంది. దీంతో ఈ మార్గాన్ని ఆరులేన్లుగా విస్తరించాలని ఈ ప్రాంతవాసులు ఎన్నాళ్ల నుంచో విజ్ఞప్తి చేస్తున్నారు. కానీ కేంద్ర ప్రభుత్వానికి సంబంధిత మంత్రిత్వశాఖ అనుమతి లభించడం లేదు. జాతీయ రహదారిపై ట్రాఫిక్ అనుకూలత లేదనే కారణంతో ఆరులేన్ల విస్తరణకు అనుమతి లభించడం లేదు. వాస్తవానికి పలాస టోల్‌గేట్ లెక్కల ప్రకారం రోజుకు సుమారు 6వేల వాహనాలు జాతీయ రహదారిపై రాకపోకలు సాగిస్తున్నాయి. అయితే పూర్తిస్థాయిలో ఆరులేన్ల జాతీయరహదారి లేకపోవడం జిల్లా ప్రజలకు శాపంగా మారింది. కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడుపై ఈ ప్రాంత ప్రజాప్రతినిధులు, ప్రజానీకం ఆరులేన్ల రహదారి మంజూరు కోసం కృషి చేయాలని ఒత్తిడి చేస్తున్నారు.
జిల్లాలో పైడిభీమవరం నుంచి నరసన్నపేట వరకు నాగావళి, వంశధార నదులపై పెద్దపెద్ద వంతెనలు సైతం పూర్తయ్యాయి. మందస మండలం పరిధిలో జాతీయరహదారిపై మహేంద్రతనయ, ఇచ్ఛాపురం సమీపంలో బాహుదా నదులపై కూడా వంతెనలు నిర్మించారు. నరసన్నపేట నుంచి ఇచ్ఛాపురం వరకు జాతీయరహదారిపై వంతెనలు, ఫ్లైఓవర్లు, బైపాస్ రోడ్లు, సర్వీస్ రోడ్లు, రైల్వేక్రాసింగ్స్ వద్ద ఎన్‌హెచ్‌ఏఐ యంత్రాంగం పూర్తిచేసింది. టెక్కలి సమీపంలో రూ.4,624కోట్లతో మూలపేట పోర్టు శరవేగంగా నిర్మాణం జరుగుతోంది. దీంతో ఈ ప్రాంతంలో ఆరులేన్ల రహదారి నిర్మాణం కచ్చితంగా జరుగుతుందని అంతా భావించారు. కాగా జాతీయ రహదారికి, పోర్టు రోడ్లు కనెక్టింగ్ అయిన చోట కొత్త స్ట్రక్చర్ల మంజూరుకు ఎన్‌హెచ్‌ఏఐ యంత్రాంగం అంగీకరించినట్లు తెలుస్తోంది. కానీ ఆరులేన్ల రహదారి నిర్మాణం ఊసెత్తడం లేదని జిల్లావాసులు నిరాశ చెందుతున్నారు.
ట్రాఫిక్ చాలడం లేదు :
నరసన్నపేట నుంచి ఇచ్ఛాపురం వరకు ఎన్‌హెచ్16లో ట్రాఫిక్ చాలడం లేదు. నరసన్నపేట నుంచి ఆంధ్రా, ఒడిశా ప్రాంతాలకు వయా చల్లపేట వాహనాలు వెళ్తూ ఉన్నాయి. అందువలనే కేంద్ర ప్రభుత్వం ట్రాఫిక్ చాలదనే కారణంతో ఆరులేన్ల విస్తరణకు ముందుకు రావడం లేదు. అయినప్పటికీ ఆరులేన్ల రహదారి విస్తరణ కోసం నావంతు కృషి చేస్తున్నాను.
- కింజరాపు రామ్మోహన్‌నాయుడు, కేంద్రమంత్రి