Share News

BC loans: బీసీ రుణాలు ఎప్పుడిస్తారో?

ABN , Publish Date - Nov 27 , 2025 | 12:11 AM

BC loans: బీసీ రుణాలు మంజూరైతే ఏదైనా వ్యాపారం చేసుకొని స్వయం ఉపాధి పొందుదామని భావిస్తున్న దరఖాస్తుదారులకు నిరాశే ఎదురవుతోంది.

 BC loans: బీసీ రుణాలు ఎప్పుడిస్తారో?

-దరఖాస్తులు సేకరించి ఎనిమిది నెలలవుతున్న వైనం

- ఇప్పటికీ మంజూరు కాకపోవడంతో ఆందోళన

- అభ్యర్థులకు తప్పని ఎదురుచూపు

పాతపట్నం, నవంబరు 26 (ఆంధ్రజ్యోతి): బీసీ రుణాలు మంజూరైతే ఏదైనా వ్యాపారం చేసుకొని స్వయం ఉపాధి పొందుదామని భావిస్తున్న దరఖాస్తుదారులకు నిరాశే ఎదురవుతోంది. బీసీ కార్పొరేషన్‌ రుణాల కోసం వారు దరఖాస్తు చేసుకుని ఎనిమిది నెలలు కావస్తున్నా ఇంత వరకు రూపాయి కూడా మంజూరు కాలేదు. దీంతో వారు తీవ్ర నిరాశ చెందుతున్నారు. రుణాలు ఎప్పుడు మంజూరవుతాయా? అని ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు.

ఇదీ పరిస్థితి..

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనతికాలంలోనే జిల్లా వెనుకబడిన తరగతుల సేవా సహకార సంఘం ద్వారా సబ్సిడీ రుణాలు మంజూరు చేసేందుకు దరఖాస్తులను ఆహ్వానించింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను స్వయం ఉపాధి యూనిట్‌ స్థాపించేందుకు దారిద్య్రరేఖకు (బీపీఎల్‌)కు దిగువనున్న బీసీ అగ్రవర్ణ పేదలు (ఈడబ్ల్యూఎస్‌) కమ్మ, రెడ్డి, ఈబీసీ, క్షత్రియ, ఆర్యవైశ్య, బ్రాహ్మణ కులస్థులకు చెందిన 21-60ఏళ్ల వయసు గల వారి నుంచి దరఖాస్తులు సేకరించింది. అదే విధంగా డి-ఫార్మసి, బీ-ఫార్మసీ పూర్తిచేసి ఉన్న బీసీ, ఈడబ్ల్యూఎస్‌ నిరుద్యోగ యువత జనరిక్‌ ఫార్మసీల ఏర్పాటు నిమిత్తం, 21-50 సంవత్సరాల మధ్య వయసు ఉన్న (కాపు తెలగ, బలిజ, ఒంటరి) వారికి స్వయం ఉపాధి పథకం స్థాపించేందుకు సబ్సిడీతో కూడిన రుణాల మంజూరు చేసేందుకు అధికారులు దరఖాస్తులు ఆహ్వానించారు. దీంతో ఈ ఏడాది మార్చిలో అభ్యర్థులు అధికసంఖ్యలో దరఖాస్తులు చేసుకున్నారు.

యూనిట్‌ విలువ ఇలా..

బీసీ స్వయం ఉపాధి పథకం కింద స్లాబ్‌-1 యూనిట్‌ విలువ రూ.2లక్షల వరకు (50శాతం సబ్సిడీ, గరిష్ఠంగా రూ.75వేలు), స్లాబ్‌-2 యూనిట్‌ విలువ రూ.2లక్షల నుంచి రూ.3లక్షల వరకు (50శాతం సబ్సిడీ, గరిష్ఠం రూ.1.25లక్షలు), స్లాబ్‌-3 యూనిట్‌ విలువ రూ.3లక్షల నుంచి రూ.5లక్షల వరకు (50శాతం సబ్సిడీ గరిష్ఠంగా రూ.2లక్షలు) మంజూరు చేయాల్సి ఉంది. జిల్లాకు సంబంధించి 2,724 యూనిట్‌లకు గానూ రూ.51.87కోట్ల మంజూరు చేసేందుకు ప్రతిపాదించారు. అలాగే స్వయం ఉపాధి పథకం ఈబీసీ కమ్మ, రెడ్డి బ్రాహ్మణ, క్షత్రియ, ఆర్యవైశ్యులకు 41యూనిట్‌లకు గాను రూ.71లక్షలు మంజూరు కావాల్సి ఉంది. కాపు స్వయం ఉపాధి పథకానికి సంబంధించి 105 యూనిట్లకు గాను రూ.3.54కోట్లు కేటాయించాల్సి ఉంది.

జిల్లాపై చిన్నచూపు..

బీసీ రుణాల కోసం దరఖాస్తులు అందించి ఎనిమిది నెలలు దాటుతున్నా ఇంకా మంజూరు కాలేదని అభ్యర్థులు ఆవేదన చెందుతున్నారు. వివిధ బ్యాంక్‌ అధికారులు ఇంటర్వ్యూలు సైతం నిర్వహించేశారని, అయినా రుణాలు ఎందుకు మంజూరు చేయడం లేదని ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రంలో పలు జిల్లాలో ఇప్పటికే సబ్సిడీ రుణాలు మంజూరైనట్లు తెలుస్తోంది. కానీ, శ్రీకాకుళం జిల్లాపై అధికారులు, పాలకులు చిన్నచూపు చూస్తున్నారని దరఖాస్తుదారులు వాపోతున్నారు. ఇప్పటికైనా రుణాలు మంజూరు చేయాలని కోరుతున్నారు.

Updated Date - Nov 27 , 2025 | 12:11 AM