Share News

క్లోరినేషన్‌ ఎప్పుడు?

ABN , Publish Date - Oct 31 , 2025 | 12:16 AM

No Cleaning watertanks జిల్లావాసులకు ట్యాంకుల ద్వారా సురక్షితనీరు సక్రమంగా అందడం లేదు. జిల్లాలో జల్‌జీవన్‌ మిషన్‌ ద్వారా ఇంటింటికీ రక్షితనీరు అందించాలన్న ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ మరోవైపు దశాబ్దాల కిందట నిర్మించిన రక్షితనీటి పథకాలు(ట్యాంకులు) శిథిలావస్థకు చేరుకుంటున్నాయి.

క్లోరినేషన్‌ ఎప్పుడు?
ఇచ్ఛాపురం సురంగిరాజావారి కోట సమీపంలో రక్షితనీటి పఽథకం

శుభ్రతకు నోచుకొని రక్షితనీటి పథకాలు

ట్యాంకర్ల నిర్వహణను పట్టించుకోని అధికారులు

ప్రజారోగ్యంపై ప్రభావం

ఇచ్ఛాపురం, అక్టోబరు 30(ఆంధ్రజ్యోతి): జిల్లావాసులకు ట్యాంకుల ద్వారా సురక్షితనీరు సక్రమంగా అందడం లేదు. జిల్లాలో జల్‌జీవన్‌ మిషన్‌ ద్వారా ఇంటింటికీ రక్షితనీరు అందించాలన్న ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ మరోవైపు దశాబ్దాల కిందట నిర్మించిన రక్షితనీటి పథకాలు(ట్యాంకులు) శిథిలావస్థకు చేరుకుంటున్నాయి. ఆ ట్యాంకులను శుభ్రం చేయకపోవడంతో ప్రజల ఆరోగ్యంపై ప్రభావం చూపే అవకాశం ఉంది. జిల్లావ్యాప్తంగా ఆర్‌డబ్ల్యూఎస్‌ ఆధ్వర్యంలో 1075 గ్రామాల్లో రక్షితనీటి పథకాలు ఉన్నాయి. ఒక్కో ట్యాంకు లక్షమంది వరకూ తాగునీరు అందిస్తోంది. దాదాపు సగం ట్యాంకుల మెట్లు, నిచ్చెనలు పాడయ్యాయి. కొన్ని శిథిలావస్థకు చేరుకుని లీకులకు గురవుతున్నాయి. ట్యాంకులపై మొక్కలు మొలచి, పక్షులు మలమూత్ర విసర్జన చేస్తున్నాయి. కనీసం శుభ్రం చేసిన దాఖలాలు లేవు. దీంతో తాగునీరు కలుషితమై.. ప్రజారోగ్యానికి విఘాతంగా మారుతోంది.

ఉద్దానం ప్రాజెక్టు పరిధిలో..

ఇచ్ఛాపురం, పలాస నియోజకవర్గాలకుగాను ఉద్దానం సమగ్ర మంచినీటి పథకం ద్వారా తాగునీరు అందిస్తున్నారు. హిరమండలంలోని వంశధార రిజర్వాయర్‌లో మదర్‌ ట్యాంకును నిర్మించి అక్కడి నుంచి మెళియాపుట్టి వద్ద ప్లాంట్లు ద్వారా శుద్ధి చేసి నీటిని ట్యాంకర్లలో విడిచిపెడుతున్నారు. అక్కడ నుంచి గ్రామాలకు సరఫరా చేస్తున్నారు. ట్యాంకులు సరిగ్గా లేకపోవడంతో నీరు కలుషితమవుతోందని ఉద్దానం గ్రామాల ప్రజలు చెబుతున్నారు. కొన్నిచోట్ల రంగు మారుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆ నీరు తాగి అనారోగ్యానికి గురవుతున్నామని వాపోతున్నారు. ఉద్దానం సమగ్ర మంచినీటి పథకానికి రూ.750 కోట్లు ఖర్చుచేశారు. కొత్త ట్యాంకులను సైతం నిర్మించారు. కానీ చాలా పాత ట్యాంకులకు సైతం అనుసంధానం చేశారు. వీటితోనే ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

సమన్వయ లోపం..

తాగునీటి ట్యాంకుల నిర్వహణపై ఆర్‌డబ్ల్యూఎస్‌, పంచాయతీ శాఖ అధికారుల మధ్య వాదనలు జరుగుతున్నాయి. ట్యాంకుల నిర్వహణ మీదంటే మీదేనంటూ ఒకరిపై ఒకరు నెపం వేస్తున్నారు. రక్షితనీటి ట్యాంకులను విధిగా రెండు నెలలకు ఒకసారి శుభ్రం చేయాలి. అయితే ఎక్కడా శుభ్రం చేస్తున్న దాఖలాలు లేవు. ఆర్‌డబ్ల్యూఎస్‌ కనీస పర్యవేక్షణ లేకపోవడంతో కొన్ని ట్యాంకులపై పిచ్చి మొక్కలు కూడా దర్శనమిస్తున్నాయి. ప్రస్తుతం ఉద్దానం సమగ్ర మంచినీటి పథకాన్ని మెగా కంపెనీ నిర్వహిస్తోంది. వారికి ఆర్‌డబ్ల్యూఎస్‌ సిబ్బందికి మధ్య సమన్వయం కుదరడం లేదు. దీంతో మంచినీటి పథకాల నిర్వహణలో ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయి. దీనిపై ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.

Updated Date - Oct 31 , 2025 | 12:16 AM