డిగ్రీ తరగతులు ప్రారంభమెప్పుడో?
ABN , Publish Date - Sep 18 , 2025 | 12:03 AM
విద్యాసంవత్సరం ప్రారంభమై నాలుగు నెలలు కావస్తుంది. ఇప్పటికీ డిగ్రీ ప్రథమ సంవత్సర తరగతులు మొదలుకాలేదు. ఇంకా సీట్ల కేటాయింపు ప్రక్రియ కొలిక్కి రాలేదు.
- ఇంకా కేటాయించని ప్రథమ సంవత్సర సీట్లు
- ఇప్పటికే నాలుగు నెలల జాప్యం
- ఆందోళనలో విద్యార్థులు
పాతపట్నం, సెప్టెంబరు 17(ఆంధ్రజ్యోతి): విద్యాసంవత్సరం ప్రారంభమై నాలుగు నెలలు కావస్తుంది. ఇప్పటికీ డిగ్రీ ప్రథమ సంవత్సర తరగతులు మొదలుకాలేదు. ఇంకా సీట్ల కేటాయింపు ప్రక్రియ కొలిక్కి రాలేదు. డిగ్రీ అడ్మిషన్లపై ప్రభుత్వం జీవో జారీ చేసి రెండునెలలు కావస్తున్నా నేటికీ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి స్పందించకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే ఆసక్తిగల అభ్యర్థులు డిగ్రీ ప్రవేశాలకు దరఖాస్తులు చేస్తున్నారు. వారికి సీట్ల కేటాయించకుండా రేపు మాపు అంటూ తేదీలు మారుస్తుండడంపై విద్యార్థులు వారి తల్లిదండ్రుల అసహనం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో 17 వరకు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు, 99 వరకు ప్రైవేటు డిగ్రీ కళాళాలలు ఉన్నాయి. వీటిలో ప్రథమ సంవత్సరానికి సంబంధించి సుమారు 3,500మంది వరకూ విద్యార్థులు ప్రవేశించాల్సి ఉంది. వారంతా దరఖాస్తులైతే చేశారు గానీ సీట్ల కేటాయింపు కొలిక్కి రాకపోడంతో ప్రవేశాలపై డోలాయమాన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ప్రవేశాలు ఆలస్యం జరుగుతుండడంతో ఐటీఐ, పాలిటెక్నిక్, నర్సింగ్, ఇంజనీరింగ్ తదితర కోర్సుల్లో జాయిన్ చేసేందుకు విద్యార్థులను ప్రైవేటు కళాశాలలు ఎగరేసుకుపోతున్నాయి.
వరుస వాయిదాలు
డిగ్రీ కళాశాలల్లో ప్రవేశానికి అనుసరించాల్సిన విధివిధానాలు, కోర్సులు తదితర అంశాలపై ప్రభుత్వం వివిధ వర్గాల ప్రతినిధులు, విద్యావేత్తలతో చర్చలు జరిపి తుదినిర్ణయం తీసుకుంది. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ విధానాల్లో డిగ్రీ ప్రవేశాలకు దరఖాస్తులు స్వీకరించాలంటూ ఈ ఏడాది జూలై 15న జీవో జారీచేసింది. తదుపరి అడ్మిషన్ షెడ్యూల్‌ను ప్రకటించాల్సి ఉండగా రాష్ట్ర ఉన్నత విద్యా మండలి తీవ్ర జాప్యం చేసింది. వాస్తవానికి ప్రభుత్వం జీవో జారీ చేసిన వారం రోజుల వ్యవధిలో అడ్మిషన్ ప్రక్రియ ప్రారంభించాల్సి ఉండగా, ఇందుకు సంబంధించి ఆన్‌లైన్ పోర్టర్‌ను సిద్ధం చేయలేదు. ఎట్టకేలకు 35రోజుల తదుపరి అడ్మిషన్ ప్రక్రియ షెడ్యూల్‌ను అధికారులు ప్రకటించారు. ఆగస్టు 20న ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమైంది. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించారు. చివరి తేదీగా ఆగస్టు 26 అని తొలుత అధికారులు ప్రకటించారు. దీనిప్రకారం సీట్ల అలాట్‌మెంట్ పూర్తిచేసి, సెప్టెంబరు ఒకటో తేదీ నుంచి తరగతులు ప్రారంభిస్తామని చెప్పారు. సాంకేతిక సమస్యల కారణంగా దరఖాస్తుల ఆన్‌లైన్‌కు ఇబ్బందులు ఎదురవడంతో, రెండు విడతలుగా దరఖాస్తుల స్వీకరణ గడువును సెప్టెంబరు 4వరకూ పొడిగించారు. అనంతరం దరఖాస్తుల స్వీకరణ పూర్తిచేసి స్పెషల్ కేటగిరీ అభ్యర్థుల వెరిఫికేషన్ కోర్సుల ఆప్షన్ నమోదు పూర్తయింది. ధ్రువపత్రాల పరిశీలన పూర్తిచేసి ఈనెల 6 నుంచి విద్యార్థులకు సీట్ల కేటాయింపు చేస్తామని ముందుగా ప్రకటించారు. చివరిక్షణంలో 8వ తేదీ అని, మళ్లీ 10వ తేదీన సీట్ల కేటాయింపు ఉంటుందని అధికారులు చెప్పారు. కానీ, ఇప్పటికీ ఆ ప్రక్రియ చేపట్టలేదు. సమాచారం లేకుండా ఎప్పటికప్పుడు వాయిదా వేసుకుంటూ వస్తున్నారు. అసలు సీట్ల కేటాయింపు ఎప్పుడు పూర్తవుతుందో తెలియక విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. కాగా, కొన్ని ప్రైవేట్ కళాశాలలు అనధికారికంగా డిగ్రీ ప్రథమ సంవత్సర తరగతులు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.