floods in vamsadhara కరకట్టలు నిర్మించేదెప్పుడు?
ABN , Publish Date - Aug 29 , 2025 | 11:22 PM
If it floods, the fields will be flooded గార మండలంలో వంశధార పరివాహక ప్రాంతాలు ఏటా వర్షాకాలంలో వరదలకు ముంపునకు గురవుతూనే ఉన్నాయి. పంట పొలాలు కూడా నీట మునిగిపోతున్నాయి. నదికి ఆనుకుని ఉన్న పొలాలు కోతకు గురై.. నదీగర్భంలో కలిసిపోతున్నాయి.
వరదొస్తే ఏటా పంట పొలాలు ముంపు
ఆందోళనలో నదీ పరివాహక ప్రాంత రైతులు
పట్టించుకోని పాలకులు, అధికారులు
గార రూరల్, ఆగస్టు 29(ఆంధ్రజ్యోతి): గార మండలంలో వంశధార పరివాహక ప్రాంతాలు ఏటా వర్షాకాలంలో వరదలకు ముంపునకు గురవుతూనే ఉన్నాయి. పంట పొలాలు కూడా నీట మునిగిపోతున్నాయి. నదికి ఆనుకుని ఉన్న పొలాలు కోతకు గురై.. నదీగర్భంలో కలిసిపోతున్నాయి. మండలంలోని బూరవిల్లి, అంబళ్లవలస, పూసర్లపాడు, శాలిహుండం, బోరవానిపేట, గార, వమరవల్లి, కళింగపట్నం తదితర గ్రామాల్లో వేలాది ఎకరాలు నదీగర్భంలో కలిసిపోయాయి. ఇటీవల వర్షాలకు కూడా వరిపంట నీటమునిగిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కరకట్టలు నిర్మించాలని ఆయా ప్రాంతాల రైతులు, ప్రజలు 20 ఏళ్లుగా అధికారులకు, పాలకులకు మొర పెట్టుకున్నా పట్టించుకునే దాఖలాలు లేవు. 2008లో అప్పటి రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు చొరవతో.. వంశధార, నాగావళి నదులకు ఇరువైపులా కరకట్టలు నిర్మించాలని నిర్ణయించారు. అప్పటి సీఎం రాజశేఖర్‌రెడ్డి రూ.310 కోట్లు నిధులు కేటాయించగా రెండు నదులకు ఇరువైపులా కరకట్టల నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా అప్పట్లో వంశధార నదికి సంబంధించి హిరమండలం గొట్టాబ్యారేజీ నుంచి కళింగపట్నం వరకు, పోలాకి మండలం పల్లిపేట వరకు నదీ పరివాహక ప్రాంతంలో భూసర్వే చేశారు. కొంతమేరకు ప్రభుత్వ భూమి ఉండగా, మరికొంత భూమిని ప్రైవేటు వ్యక్తుల నుంచి అధికారులు సేకరించారు. బాధిత రైతులకు కొంతమేర నష్టపరిహారం చెల్లించారు. సీఎం రాజశేఖర్‌రెడ్డి ప్రమాదవశాత్తు మృతి చెందడం.. తర్వాత నాయకులెవరూ పట్టించుకోకపోవడంతో కరకట్టల నిర్మాణం కార్యరూపం దాల్చలేదు.
2014లో టీడీపీ అధికారంలోకి రాగా.. మళ్లీ కరకట్ట నిర్మాణ వ్యవహారం తెరమీదకు వచ్చింది. నదీ పరివాహక ప్రాంత ప్రజల గోడు, పాలకుల ఒత్తిడి మేరకు అధికారులు నివేదిక తయారు చేశారు. కాగా అక్కడక్కడా గట్టును పోల్చడం, హద్దులు నిర్ణయించడం తప్ప పూర్తిస్థాయిలో పనులు ఎక్కడా జరగలేదు. కొన్నిప్రాంతాల్లో ఉపాధిహామీ పఽథకం ద్వారా వేతనదారులతో గట్టు నిర్మాణానికి రూపకల్పన చేశారు.
2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం కరకట్టల నిర్మాణాన్ని కనీసం పట్టించుకోలేదు. ఎక్కడా తట్టెడు మట్టి వేసిన దాఖలాలు లేవు. ప్రస్తుత కూటమి ప్రభుత్వమైనా స్పందించి కరకట్టల నిర్మాణానికి చర్యలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు. ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా ప్రజాప్రతినిధులు, అధికారులు చొరవ చూపాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
వరద అంటే భయమే..
వంశధార నదికి వరద వస్తుందని తెలిస్తే చాలు.. భయం వేస్తుంది. ప్రతీ ఏడాది వరదనీటి ఉధృతికి పంటపొలాలు మునిగి పోయి గ్రామాల్లోకి నీరు ప్రవేశిస్తుంది. దీంతో చాలా వరకు ఆస్తినష్టం జరుగుతోంది. భూములిచ్చిన రైతులకు నష్ట పరిహారం చెల్లించినా.. కరకట్టల నిర్మాణం చేపట్టకపోవడంతో ఆంత్యరమేమిటో అర్థం కావడం లేదు.
- తంగుడు రమణ, బూరవిల్లి
..............
నదీ గర్భంలో..వందల ఏకరాలు
ఏటా వర్షాకాలంలో సంభవించిన తుఫాన్‌లకు ప్రాజెక్టు నుంచి దిగువ ప్రాంతానికి వరదనీరు ఎక్కువగా అధికారులు విడిచిపెడుతుంటారు. దీంతో నదీ పరివాహక ప్రాంతంలో పంట పొలాలు కోతకు గురై నదీగర్భంలో కలిసిపోతున్నాయి. నా చిన్నతనం నుంచి చూస్తున్నాను మా పంచాయతీకి సంబంధించి సుమారు వంద ఎకరాల వరకు నదీగర్భంలో కలిసిపోయాయి.
- కల్లి రామిరెడ్డి, ఎస్.డి.ఎన్.పేట