Arasavalli Temple: ఇదేం మతలబు?
ABN , Publish Date - May 29 , 2025 | 11:47 PM
Arasavalli Temple: ఆదిత్యాలయంలో దినసరి ఉద్యోగుల నియామకంపై పైరవీలు జోరందుకున్నాయి.
-అప్పుడు 50 మంది అవసరమన్నారు
- ఇప్పుడు 15 మంది చాలంటున్నారు
- ఆదిత్యాలయంలో దినసరి ఉద్యోగుల నియామకంపై పైరవీలు
- పనిచేయని వ్యక్తులకే మళ్లీ చాన్స్
- రాజకీయ సిఫారసులతో జాబితా తయారు?
అరసవల్లి, మే 29(ఆంధ్రజ్యోతి): ఆదిత్యాలయంలో దినసరి ఉద్యోగుల నియామకంపై పైరవీలు జోరందుకున్నాయి. ఇప్పటికే దినసరి ఉద్యోగులుగా సేవలందిస్తున్న 49 మందిని తొలగించి, కొత్తగా 15 మందిని ఔట్ సోర్సింగ్ ద్వారా నియమించేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. అయితే, ఎక్కడైనా బాగా పనిచేసిన వారికి ఉద్యోగాలు ఇస్తారు. కానీ, ఆదిత్యాలయంలో మాత్రం రాజకీయ సిఫారసుల కారణంగా పని చేయని వ్యక్తులకు ఉద్యోగం ఇచ్చేందుకు జాబితా తయారు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. నిజానికి ఆదిత్యాలయంలో కనీసం 50 మంది దినసరి సిబ్బంది అవసరం అని గతంలో విచారణాధికారిగా ఆలయానికి వచ్చిన డీసీ శోభారాణి చెప్పారు. అదే అధికారి ప్రస్తుత ఈవో భద్రాజీ సెలవుల్లో ఉండడంతో ఇన్‌చార్జిగా బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. అయితే, ఇప్పుడు 50 మంది సిబ్బంది అవసరం లేదని, 15 మందిని ఔట్ సోర్సింగ్ ద్వారా నియమిస్తే చాలని అంటున్నారు. ఈ లిస్టును ఫైనలైజ్ చేయడానికి ముగ్గురు సభ్యుల కమిటీ గురువారం విశాఖలో సమావేశమైంది. కేవలం 15 మంది సిబ్బందినే సిఫారసు చేయాలనడం, అందులోను రాజకీయ పలుకుబడి గల కుటుంబాలకు సంబంధించిన వ్యక్తులను నియమించాలనుకోవడం, ఆలయ అభివృద్ధిని, ప్రతిష్ఠను నీరుకార్చడమే తప్ప మరోకటి కాదని భక్తులు విచారం వ్యక్తం చేస్తున్నారు.
ఎందుకీ అలసత్వం?
అరసవల్లి సూర్యనారాయణ స్వామివారి ఆలయం ప్రస్తుతం అభివృద్ధి పథంలో నడుస్తోంది. ఈవో స్థాయి నుంచి డీసీ స్థాయికి చేరుకుంది. నిజానికి డీసీ స్థాయి ఆలయంలో 80 వరకూ సిబ్బంది అవసరం ఉంటుంది. అయితే, గత కొన్నేళ్లుగా 49 మంది దినసరి వేతన ఉద్యోగుల సేవలతోనే అరసవల్లి ఆలయం అభివృద్ధి చెంది డీసీ స్థాయికి చేరుకుందనడంలో ఎటువంటి సందేహం లేదు. కానీ, గత 16 నెలలుగా దినసరి వేతనదారులకు జీతాలు అందడం లేదు. అయితే, మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడి చొరవతో 5 నెలల జీతాలు వారికి అందాయి. దేవస్థానం ఆదాయం ప్రతీ ఏడాది పెరుగుతూ వస్తున్నా సిబ్బంది నియామకం, జీతాల చెల్లింపులో ఎందుకు ఇంతటి తర్జన భర్జనలు, అలసత్వం కనిపిస్తోందో ఆ ఆదిత్యునికే తెలియాలి. అలాగే ఆలయంలో గతంలో పనిచేసిన కొందరు దినసరి వేతన సిబ్బంది తప్పుడు బిల్లులు పెట్టి లక్షల రూపాయలు వసూళ్లకు పాల్పడేందుకు ప్రయత్నించినట్లు తీవ్ర ఆరోపణలు వచ్చాయి. అలాగే, వారినికోసారి ఆలయానికి వస్తూ, విధులు సరిగ్గా నిర్వర్తించకుండా, జీతాలను మాత్రం ప్రతీ నెలా తీసుకునేవారని ఆరోపణలు ఉన్నాయి. అయితే, మళ్లీ వీరి పేర్లే కొత్తగా నియమించనున్న 15 మంది ఔట్ సోర్సింగ్ సిబ్బంది జాబితాలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇలా అయితే ఆదిత్యాలయం బాగుపడేదెలా? అని భక్తులు విచారం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు, నాయకులు చిత్తశుద్ధితో ఆలోచించి, ఆలయ అభివృద్ధికి తగు చర్యలు తీసుకోవాలని, నియామకాలను కచ్చితమైన పద్ధతిలో చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.