Share News

647 భవనాల పరిస్థితేంటి?

ABN , Publish Date - Aug 31 , 2025 | 11:33 PM

Incomplete government office constructions జిల్లావ్యాప్తంగా ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా 647 ప్రభుత్వ భవనాలు అసంపూర్తిగా వదిలేశారు. అవి ఎప్పుడు అందుబాటులోకి వస్తాయో తెలియని పరిస్థితి. వైసీపీ పాలనలో ఆ పార్టీ నేతలే భవనాల పనులు చేపట్టగా.. ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడంతో మధ్యలో నిలిపేశారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తామన్నా.. పనులు పూర్తిచేసేందుకు వారు ముందుకు రాకపోవడం గమనార్హం.

647 భవనాల పరిస్థితేంటి?
చిల్లపేటరాజాంలో అసంపూర్తిగా వెల్‌నెస్‌ సెంటర్‌

  • గ్రామాల్లో అసంపూర్తిగా ప్రభుత్వ కార్యాలయ నిర్మాణాలు

  • వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం

  • కూటమి ప్రభుత్వంపైనే ఆశలు

  • ఎచ్చెర్ల నియోజకవర్గంలో సుమారు 30 ప్రభుత్వ భవనాల నిర్మాణాలు అసంపూర్తిగా వదిలేశారు. రణస్థలం మండలానికి 27 గ్రామ సచివాలయ భవనాలు మంజూరయ్యాయి. ఇందులో 18 భవనాల నిర్మాణం పూర్తయింది. 9 భవనాలను అసంపూర్తిగా వదిలేశారు. జి.సిగడాం మండలంలో 21 సచివాలయ భవనాలు పూర్తికాగా 5 అసంపూర్తిగా ఉన్నాయి. లావేరు మండలంలో 16 సచివాలయాల నిర్మాణాలు పూర్తయ్యాయి. 7 అసంపూర్తిగా ఉన్నాయి. ఎచ్చెర్ల మండలంలో 20 సచివాలయాల నిర్మాణాలు పూర్తికాగా.. 8 భవనాలను అలానే వదిలేశారు.

  • రణస్థలం, ఆగస్టు 31(ఆంధ్రజ్యోతి): జిల్లావ్యాప్తంగా ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా 647 ప్రభుత్వ భవనాలు అసంపూర్తిగా వదిలేశారు. అవి ఎప్పుడు అందుబాటులోకి వస్తాయో తెలియని పరిస్థితి. వైసీపీ పాలనలో ఆ పార్టీ నేతలే భవనాల పనులు చేపట్టగా.. ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడంతో మధ్యలో నిలిపేశారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తామన్నా.. పనులు పూర్తిచేసేందుకు వారు ముందుకు రాకపోవడం గమనార్హం. ప్రతిపక్షంలో ఉండడంతో బిల్లులు చెల్లిస్తారో.. లేదోనన్న అనుమానమే ఇందుకు కారణం. కాగా.. ఈ భవనాలు పూర్తికాకుండానే శిథిలావస్థకు చేరుతున్నాయి. మరోవైపు ప్రైవేటు భవనాల్లో సచివాలయాలు నిర్వహిస్తుండడంతో ప్రభుత్వానికి అద్దె బాధ తప్పడం లేదు.

  • ఇదీ పరిస్థితి

  • వైసీపీ ప్రభుత్వం గ్రామస్థాయిలో అన్నిరకాల ప్రభుత్వ సేవలను అందించాలనే ఉద్దేశంతో 2019 అక్టోబరు 2న సచివాలయ వ్యవస్థను ప్రారంభించింది. అలాగే సచివాలయాలు, రైతుసేవా కేంద్రాలు, వెల్‌నెస్‌ సెంటర్లు, డిజిటల్‌ గ్రంథాలయ భవనాల నిర్మాణాలకు శ్రీకారం చుట్టింది. కాగా.. ఐదేళ్ల పాలనలో వీటి నిర్మాణాలను పూర్తిచేయలేకపోయింది. కొన్నింటి నిర్మాణం పూర్తయినా వినియోగించడం లేదు. దీంతో అవి నిర్వహణ లేక శిథిలావస్థకు చేరుకుంటున్నాయి. వాస్తవానికి ఈ భవనాలను కేంద్ర ప్రభుత్వం ఉపాధిహామీ పథకం నిధులతో నిర్మించతలపెట్టారు. ఒక్కో సచివాలయానికి రూ.45లక్షలు, రైతుభరోసా కేంద్రం, వెల్‌నెస్‌ కేంద్రాలు, డిజిటల్‌ గ్రంథాయాల నిర్మాణానికి రూ.25లక్షలు చొప్పున కేటాయించారు. జిల్లాలో మొత్తం 2,046 భవనాలకు సంబంధించి రూ.641కోట్లతో పనులు ప్రారంభించారు. ఐదేళ్లలో రూ.325కోట్ల వరకూ ఖర్చుచేసి 828 భవనాలను మాత్రమే పూర్తిచేశారు. 647 భవనాలను అసంపూర్తిగా వదిలేశారు. 571 భవనాల పనులు అసలు ప్రారంభానికి నోచుకోలేదు.

  • ఒక్కటి కూడా కట్టలే..

  • ఉమ్మడి జిల్లాకు తొలి విడతగా 195 డిజిటల్‌ గ్రంథాలయ భవనాలు మంజూరయ్యాయి. తొలి విడతగా 2022 ఉగాదికి, రెండో విడత అదే ఏడాది డిసెంబరుకు, మూడో విడత 2023 మార్చి నాటికి పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. పర్యవేక్షణ బాధ్యతను పంచాయతీరాజ్‌ శాఖకు అప్పగించారు. చాలాచోట్ల పనులు ప్రారంభించారు కానీ ఒక్కచోట కూడా పూర్తికాలేదు.

  • అంతటా అస్పష్టత

  • కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాది పూర్తయినా.. సచివాలయాలతో పాటు ఇతర ప్రభుత్వ భవనాల నిర్మాణం పూర్తిచేయడం లేదు. నిర్మించినవి కూడా ప్రారంభించడం లేదు. వైసీపీ సర్పంచ్‌లు, ఇతర నేతలు వీటి నిర్మాణ బాధ్యతలు చూసేవారు. వైసీపీ ప్రభుత్వం అప్పట్లో బిల్లులు చెల్లించలేదు. కూటమి ప్రభుత్వం పెండింగ్‌ బిల్లులను చెల్లించింది. కానీ, అసంపూర్తిగా ఉన్న పనులు పూర్తిచేసేందుకు మాత్రం వైసీపీ ప్రజాప్రతినిధులు ముందుకు రావడం లేదు. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికలు కొద్దిరోజులే ఉండడంతో తరువాత చూద్దాంలే అన్నట్టు కూటమి నేతలు ఉన్నారు. దీంతో 647 భవనాలకు సంబంధించి ఎటూ పాలుపోవడం లేదు. దీంతో ప్రతి గ్రామంలో ఈ భవనాలు దిష్టిబొమ్మల్లా దర్శనమిస్తున్నాయి. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం వీటి నిర్మాణాలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.

  • త్వరలో పూర్తిచేస్తాం..

  • సచివాలయాలు, రైతుభరోసా కేంద్రాలకు సంబంధించి భవనాల నిర్మాణం పూర్తిచేయడంపై ప్రభుత్వం దృష్టిపెట్టింది. ఇప్పటికే పెండింగ్‌ బిల్లులు సైతం చెల్లించింది. నిర్మాణాలు పూర్తిచేసిన వాటిని అందుబాటులోకి తీసుకొస్తాం. వీలైనంత త్వరగా వాటి నిర్మాణాలు పూర్తయ్యేలా చేస్తాం.

    - జి.రవి, పంచాయతీరాజ్‌ ఇన్‌చార్జి ఎస్‌ఈ, శ్రీకాకుళం

  • దిష్టిబొమ్మల్లా..

  • గ్రామంలో ఈ భవనాలు అసంపూర్తిగా దిష్టిబొమ్మల్లా దర్శనమిస్తున్నాయి. కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని వైసీపీ ప్రభుత్వ వృథా చేసింది. కూటమి ప్రభుత్వం వీటి విషయంలో ప్రత్యేకంగా దృష్టిసారించాలి.

    - కెల్ల హేమంత్‌ కుమార్‌, రణస్థలం

  • కాలయాపన చేశారు

  • మా గ్రామంలో సచివాలయ నిర్మాణానికి అదిగో.. ఇదిగో అంటూ కాలయాపన చేశారు. పాలకేంద్రం భవనంలో సచివాలయం నిర్వహిస్తున్నారు. సచివాలయ నిర్మాణం పూర్తిచేసి.. అందుబాటులోకి తేవాలి.

    - బసవ గోవిందరెడ్డి, కొచ్చెర్ల

Updated Date - Aug 31 , 2025 | 11:33 PM