నిఘా ఏం చేస్తోంది?
ABN , Publish Date - Sep 19 , 2025 | 11:58 PM
Timber smuggling in the srikakulam జిల్లాలో కలప అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. అధికారుల పర్యవేక్షణ లోపంతో పచ్చనిచెట్లపై అక్రమార్కుల గొడ్డలివేటు పడుతోంది. తీరప్రాంత గ్రామాల్లో సరుగుడు, నీలగిరితోపాటు అకేసు, టేకు తదితర మొక్కలు పెంచుతున్నారు. పోలాకి, సంతబొమ్మాళి, కోటబొమ్మాళి, నరసన్నపేట, లావేరు, రణస్థలం, ఎచ్చెర్ల, ఆమదాలవలస తదితర మండలాల్లో మెట్టు ప్రాంతాల్లో అధికంగా నీలగిరి సాగు చేస్తున్నారు. కాగా.. నీలగిరి, సరుగుడు కలప మాటున టేకు, అకేశ్ కర్రలు లారీల్లో లోడ్ చేసి రాత్రివేళ ఇతర రాష్ట్రాలకు రవాణా చేస్తున్నారు.
జిల్లాలో యథేచ్ఛగా కలప అక్రమ రవాణా
రాత్రివేళ ఇతర ప్రాంతాలకు తరలింపు
కొరవడుతున్న అధికారుల పర్యవేక్షణ
నరసన్నపేట, సెప్టెంబరు 19(ఆంధ్రజ్యోతి):
ఈ నెల 17న నరసన్నపేట మండలం గోపాలపెంట వద్ద లారీలో అకేసు కలపను అక్రమంగా తరలిస్తుండగా అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నదీ తీర ప్రాంతాల్లో గల అకేసు చెట్లు కొందరు నరికి అక్రమంగా రవాణా చేస్తున్నట్లు సమాచారం అందడంతో టెక్కలి రేంజర్ జగదీష్ ఆధ్వర్యంలో అటవీశాఖ అధికారులు దాడులు నిర్వహించారు. గోపాలపెంట నుంచి ఎచ్చెర్ల వద్ద లోడింగ్ పాయింట్‌కు ఆ కలప తరలిస్తున్నట్టు గుర్తించి.. లారీని సీజ్ చేశారు.
వజ్రపుకొత్తూరు మండలంలోని బాతుపురం- చినవంక మధ్య ఆర్‌అండ్‌బీ రోడ్డుకు ఇరువైపులా ఉన్న చెట్లను కూడా అక్రమార్కులు వదలడం లేదు. ఆర్‌అండ్‌బీ అధికారుల అనుమతి లేకుండానే కొంతమంది వ్యక్తులు రాత్రివేళ ఈ చెట్లను నరికేసి.. అక్రమ రవాణా సాగిస్తున్నారు.
.. ఇలా జిల్లాలో కలప అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. అధికారుల పర్యవేక్షణ లోపంతో పచ్చనిచెట్లపై అక్రమార్కుల గొడ్డలివేటు పడుతోంది. తీరప్రాంత గ్రామాల్లో సరుగుడు, నీలగిరితోపాటు అకేసు, టేకు తదితర మొక్కలు పెంచుతున్నారు. పోలాకి, సంతబొమ్మాళి, కోటబొమ్మాళి, నరసన్నపేట, లావేరు, రణస్థలం, ఎచ్చెర్ల, ఆమదాలవలస తదితర మండలాల్లో మెట్టు ప్రాంతాల్లో అధికంగా నీలగిరి సాగు చేస్తున్నారు. కాగా.. నీలగిరి, సరుగుడు కలప మాటున టేకు, అకేశ్ కర్రలు లారీల్లో లోడ్ చేసి రాత్రివేళ ఇతర రాష్ట్రాలకు రవాణా చేస్తున్నారు. జిల్లాలో పలు వేబ్రిడ్జిల వద్ద కలప అక్రమ విక్రయాలు చేపడుతున్నారు. నీలగిరి కలప టన్ను రూ.5వేల వరకు, సరుగుడు కలప టన్ను రూ.12వేల వరకు విక్రయిస్తున్నారు.
ఎచ్చెర్ల, లావేరు, రణస్థలం మండలాల్లో జాతీయ రహదారి పక్కనే పలు ప్రాంతాల్లో నీలగిరి తొక్కతీసి చిన్న దుంగలుగా కట్ చేసి ఉంచుతారు. వీటిని ప్లేఉడ్ తయారీ కోసం పశ్చిమబెంగాల్‌కు ఎక్కువగా ఎగుమతి చేస్తారు. రోజుకు సుమారు పది లారీల కలప జిల్లా నుంచి ఎగుమతి చేస్తున్నారు. అలాగే సారవకోట, పాతపట్నం, హిరమండలం, ఎల్.ఎన్.పేట, మెళియపుట్టి, మందస, టెక్కలి తదితర మండలాల్లో కొండ ప్రాంతాల నుంచి విలువైన కలప రాత్రి సమయంలో అక్రమంగా తరలిపోతోంది. టేకు, మద్ది తదితర రకాల కలపను వ్యాపారులు.. రైతులు, గిరిజనుల నుంచి కొనుగోలు చేస్తున్నారు. అటవీశాఖ అధికారుల కన్నుసన్నల్లోనే గిరి ప్రాంతాల నుంచి గుట్టుచప్పుడు కాకుండా మైదాన ప్రాంతాలకు దిగుమతి చేస్తున్నారు. వీటిని జిల్లాలో కొన్ని టింబర్ డిపోలకు రవాణా చేయగా, మరికొందరు వ్యాపారులు తమ ఇళ్లు, కళ్లాలు వద్ద నిల్వ చేస్తున్నారు. వేసవిలో వీటిని బయటకు తీసి ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేస్తారు.
టేకుకు ప్రత్యామ్నయంగా అకేసు
టేకు ధర ఎక్కువగా ఉండటంతో ఇంచుమించు టేకును పోలిన అకేసుకు డిమాండ్ పెరిగింది. టేకు అడుగు ధర రూ.3వేలు ఉండగా.. అకేసు అడుగు ధర రూ.1500 పలుకుతోంది. చాలామంది టేకుకు ప్రత్యామ్నాయంగా అకేసును వినియోగిస్తున్నారు. అకేసు చెట్లు ఇసుక నెలల్లో అధికంగా పెరుగుతాయి. నదీ తీర గ్రామాల్లో సాగుచేస్తున్న వారికి అకేసు చెట్లు తక్కువ ధరకు కొనుగోలు చేసి.. వాటిని కలప పేరుతో అక్రమ రవాణా సాగిస్తున్నారు.
అటవీశాఖ కనుసన్నల్లో...
జిల్లాలో కలప అక్రమ రవాణా కొంతమంది అటవీశాఖ అధికారులు కన్నుసన్నల్లోనే జరుగుతుందనే ఆరోపణలు ఉన్నాయి. అక్రమార్కుల దగ్గర మామూళ్లు తీసుకుని కలప అక్రమ రవాణాను చూసీచూడనట్టు వదిలేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టాస్క్‌ఫోర్స్ జిల్లాలో తిరిగే సమయంలో కలప అక్రమ వ్యాపారం చేసేవారికి అటవీశాఖ అఽధికారులే సమాచారం ఇస్తారన్న వాదనలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం నుంచి ఒత్తిడి పెరిగితే నామమాత్రంగానే దాడులు చేసి వదిలేస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఈ విషయమై జిల్లా ఇన్‌చార్జి డీఎఫ్‌వో ప్రసన్న వద్ద ప్రస్తావించగా.. కలప అక్రమ రవాణా నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. అనుమతి లేకుండా కలప అక్రమ రవాణా చేస్తే అపరాధ రుసుం విధిస్తున్నామన్నాని తెలిపారు.