Share News

కందిపప్పు ఏదీ?

ABN , Publish Date - Oct 20 , 2025 | 12:16 AM

జిల్లాలో రేషన్‌ డిపోల ద్వారా అందించే నిత్యావసరాల పంపిణీలో కేవలం రెండింటికే పరిమితమవుతున్నారు.

 కందిపప్పు ఏదీ?

-9 నెలలుగా నిలిచిన సరఫరా

-రేషన్‌కార్డుదారులకు నిరాశ

ఇచ్ఛాపురం, అక్టోబరు 19(ఆంధ్రజ్యోతి) జిల్లాలో రేషన్‌ డిపోల ద్వారా అందించే నిత్యావసరాల పంపిణీలో కేవలం రెండింటికే పరిమితమవుతున్నారు. బియ్యంతోపాటు పంచదార మాత్రమే అందిస్తున్నారు. గత తొమ్మిది నెలలుగా కందిపప్పు అందించడం లేదు. దీంతో సామాన్య, మధ్యతరగతి ప్రజలు బహిరంగ మార్కెట్‌లో కందిపప్పు కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఎదురైంది. జిల్లావ్యాప్తంగా 1603 రేషన్‌ డిపోలు ఉన్నాయి. వీటి పరిధిలో 6,51,778 రేషన్‌ కార్డులు ఉన్నాయి. ప్రతినెలా రేషన్‌కార్డుదారులకు బియ్యం, అరకేజీ పంచాదార మాత్రమే పంపిణీ చేస్తున్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో రేషన్‌ పంపిణీలో భాగంగా 12 రకాల వస్తువులు అందించేవారు. బియ్యం, పంచదార, కందిపప్పు కిరోసిన్‌, పామాయిల్‌, శెనగలు, వివిధ రకాల నిత్యావసరాలు అందించేవారు. కానీ తరువాత వచ్చిన ప్రభుత్వాలు రేషన్‌లో కోత విధిస్తూ వచ్చాయి. వైసీపీ హయాంలో అయితే కేవలం బియ్యం, పంచదార మాత్రమే పంపిణీ చేశారు. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత కొన్నాళ్లు కందిపప్పును అందించారు. కానీ, గత తొమ్మిది నెలలుగా రేషన్‌కార్డుదారులకు కందిపప్పు ఇవ్వడం లేదు. దీంతో ప్రతినెలా రేషన్‌కార్డుదారులు నిరాశ చెందుతున్నారు. ప్రస్తుతం మార్కెట్‌లో కిలో కందిపప్పు రూ.150వరకూ పలుకుతోంది. దీంతో అంత ధర ఇచ్చి కొనుగోలు చేయలేకపోతున్నామని సామాన్యులు వాపోతున్నారు. కనీసం కార్తీక మాసం దృష్ట్యా నవంబరు నెలలో అయినా రేషన్‌ డిపోల్లో కందిపప్పు అందించాలని కోరుతున్నారు. ఈ విషయమై డీఎస్‌వో సూర్యప్రకాశరావు వద్ద ప్రస్తావించగా.. ‘ప్రభుత్వం కందిపప్పు సరఫరాను నిలిపివేసింది. అందుకే అందించలేకపోతున్నాం. ప్రభుత్వం దృష్టికి ఈ సమస్య తీసుకెళ్లామ’ని తెలిపారు.

Updated Date - Oct 20 , 2025 | 12:16 AM