No stock urea: ఆ యూరియా.. ఏమైంది?
ABN , Publish Date - Aug 16 , 2025 | 11:37 PM
Farmers face problems with urea ఖరీఫ్ సీజన్ వేళ.. నరసన్నపేట మండలంలో యూరియా దొరక్క రైతులు ఇబ్బందులు పడుతున్నారు. నరసన్నపేట ప్రాథమిక సహకార సంఘానికి(పీఏసీఎస్) ఇరవై రోజుల కిందట 440 యూరియా బస్తాలు వచ్చాయి. వీటిని పంపిణీ చేయకుండా అధికారులు తాత్సారం చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు.
నరసన్నపేట పీఏసీఎస్‌లో నిల్వలు పక్కదారి
పాలకవర్గం, సిబ్బంది తీరుపై అనుమానాలు
రైతులకు తప్పని ఇబ్బందులు
జమ్ము గ్రామానికి చెందిన ఒక రైతు యూరియా కోసం ఈ నెల 12న నరసన్నపేట పీఏసీఎస్‌కు వెళ్లాడు. యూరియా సొసైటీకి రాలేదని, వచ్చిన తర్వాత పంపిణీ చేస్తామని సిబ్బంది చెప్పడంతో నిరాశతో వెనుదిరిగాడు. ఇలా గత పదిహేను రోజులుగా సొసైటీ చుట్టూ రైతులు తిరుగుతున్నా.. యూరియాను పంపిణీ చేయడం లేదు. సొసైటీకి వచ్చిన 440 బస్తాల యూరియా ఏమైందో తెలియడం లేదు
నరసన్నపేట, ఆగస్టు 16(ఆంధ్రజ్యోతి): ఖరీఫ్ సీజన్ వేళ.. నరసన్నపేట మండలంలో యూరియా దొరక్క రైతులు ఇబ్బందులు పడుతున్నారు. నరసన్నపేట ప్రాథమిక సహకార సంఘానికి(పీఏసీఎస్) ఇరవై రోజుల కిందట 440 యూరియా బస్తాలు వచ్చాయి. వీటిని పంపిణీ చేయకుండా అధికారులు తాత్సారం చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. నరసన్నపేట సొసైటీ పరిధిలో 34 పంచాయతీల్లో సుమారు 6వేలు మంది రైతులు ఉన్నారు. సొసైటీలో సుమారు 4వేల మంది రుణాలు తీసుకున్నారు. సొసైటీకి వచ్చిన యూరియా బస్తాలను వీరికి పంపిణీ చేయాలి. బస్తాకు రూ.270 చొప్పున విక్రయించాలి. కానీ పాలకవర్గం, సిబ్బంది బ్లాక్‌మార్కెట్‌కు తరలించారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తమ బంధువుల పేరిట టోకెన్లు రాయించుకుని యూరియాను పక్కదారి పట్టించారనే ఆరోపణలు ఉన్నాయి. బయట మార్కెట్‌లో కూడా రూ.బస్తా రూ.500కు కొనుగోలు చేద్దామన్నా యూరియా దొరకడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి యూరియా పంపిణీ చేయాలని కోరుతున్నారు. కాగా సొసైటీ అధ్యక్షుడు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వకపోవడంతో యూరియా పంపిణీ చేయడం లేదని ఓ ఉద్యోగి తెలిపారు. ఈ విషయమై శనివారం సీఈవో ఈశ్వరరావు వద్ద ‘ఆంధ్రజ్యోతి’ ప్రస్తావించగా.. రెండు రోజుల కిందటే కొంతమంది రైతులకు టోకెన్లు పంపిణీ చేశామని తెలిపారు. వర్షం కారణంగా యూరియా పంపిణీ చేయలేదన్నారు.