Share News

ఇవేమి సేవలు?

ABN , Publish Date - Oct 29 , 2025 | 12:06 AM

Special officer's intolerance towards medical staff పలాసలో 200 పడకల కిడ్నీ ఆస్పత్రి, పరిశోధన కేంద్రంలో అన్నీ హంగులు సమకూర్చినా, రోగులకు ఇతర ఆసుపత్రులకు పంపించాల్సిన అవసరం ఎందుకు వస్తోందని జిల్లా ప్రత్యేకాధికారి కేవీఎన్‌ చక్రధర్‌బాబు వైద్యులు, సిబ్బందిని ప్రశ్నించారు.

ఇవేమి సేవలు?
కిడ్ని ఆసుపత్రిలో వైద్యాధికారులను ప్రశ్నిస్తున్న చక్రధర్‌బాబు

కిడ్నీ ఆస్పత్రిలో వైద్యసిబ్బంది తీరుపై ప్రత్యేకాధికారి అసహనం

మూడు గంటలపాటు తనిఖీ

పలాస, అక్టోబరు 28(ఆంధ్రజ్యోతి): పలాసలో 200 పడకల కిడ్నీ ఆస్పత్రి, పరిశోధన కేంద్రంలో అన్నీ హంగులు సమకూర్చినా, రోగులకు ఇతర ఆసుపత్రులకు పంపించాల్సిన అవసరం ఎందుకు వస్తోందని జిల్లా ప్రత్యేకాధికారి కేవీఎన్‌ చక్రధర్‌బాబు వైద్యులు, సిబ్బందిని ప్రశ్నించారు. ఇవేమి సేవలను మండిపడ్డారు. మంగళవారం మధ్యాహ్నం ఆయన కిడ్నీ ఆస్పత్రిని సందర్శించారు. మూడు గంటలపాటు అన్ని విభాగాలనూ పరిశీలించారు. రోగులకు సక్రమంగా సేవలు అందని వైనంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. పరికరాలు, ఆపరేషన్‌ ఽథియేటర్లు, సరిపడా సిబ్బంది, వైద్యాధికారులు ఉన్నా.. అనేకమంది రోగులు ఇతర కార్పొరేట్‌, ప్రైవేటు ఆసుపత్రికి ఎందుకు తరలివెళ్లిపోతున్నారని ప్రశ్నించారు. వివిధ పరీక్షలను ప్రైవేటు క్లినిక్‌ల్లో చేయిస్తున్నట్టు ఫిర్యాదులు వస్తున్నాయని, ఇది సరికాదన్నారు. ఆస్పత్రిలో రసాయనాలు నిండుకోవడంతో రోగులకు బయట పరీక్షలు చేయాల్సి వస్తోందని వైద్యసిబ్బంది వివరణ ఇచ్చారు. ఆస్పత్రికి తగినంత నిధులున్నా.. ఎందుకు కొనుగోలు చేయలేదని ప్రత్యేకాధికారి ప్రశ్నించగా వైద్యసిబ్బంది నీళ్లు నమిలారు. కొత్తగా విధుల్లో చేరిన సూపరింటెండెంట్‌ జె.కిషోర్‌ మాట్లాడుతూ సొంతంగా కొనుగోలు చేస్తామని తెలిపారు. ఆస్పత్రిలో మందుల కొరత, ఇతర సమస్యలు ఏమైనా ఉంటే తనకు నివేదిక ఇవ్వాలని, దానిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని ప్రత్యేకాధికారి స్పష్టం చేశారు. అనంతరం పౌరసరఫరాల గిడ్డంగి, రేషన్‌డిపోలు, ఎఫ్‌సీ గోదామును ఆయన పరిశీలించారు. కార్యక్రమంలో రాష్ట్ర ట్రేడ్‌ప్రమోషన్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ వజ్జ బాబూరావు, ఎంఎంసీ చైర్మన్‌ మల్లా శ్రీనివాస్‌, గాలి కృష్ణారావు, పట్టణ అధ్యక్షుడు బడ్డ నాగరాజు, కార్యదర్శి సప్ప నవీన్‌, యవ్వారి మోహనరావు, జిల్లా ఆసుపత్రుల సమన్వయకర్త కళ్యాణ్‌బాబు, తహసీల్దార్‌ టి.కళ్యాణచక్రవర్తి, పశుసంవర్థకశాఖ ఏడీ డాక్టర్‌ మట్ట రవికృష్ణ పాల్గొన్నారు.

Updated Date - Oct 29 , 2025 | 12:06 AM