హుద్‌హుద్ ఇళ్ల కాలనీలో సౌకర్యాలేవీ?
ABN , Publish Date - Dec 30 , 2025 | 12:06 AM
Problems in Hudhud colony టెక్కలిలోని హుద్‌హుద్ ఇళ్ల కాలనీవాసులకు కనీస సౌకర్యాలు కరువవుతున్నాయి. హుద్‌హుద్ తుఫాన్ బాధితుల కోసం టెక్కలి మేజర్ పంచాయతీ గోపీనాథపురం సమీపాన కంకరబందలో 2016 ఏప్రిల్ 14న రూ.7.68కోట్ల అంచనా వ్యయంతో 192 ఇళ్ల కాలనీ నిర్మాణానికి మంత్రి అచ్చెన్నాయుడు శంకుస్థాపన చేశారు.
రెండేళ్లుగా చీకట్లోనే..
మౌలిక సదుపాయాలు లేక ఇబ్బందులు
టెక్కలి, డిసెంబరు 29(ఆంధ్రజ్యోతి): టెక్కలిలోని హుద్‌హుద్ ఇళ్ల కాలనీవాసులకు కనీస సౌకర్యాలు కరువవుతున్నాయి. హుద్‌హుద్ తుఫాన్ బాధితుల కోసం టెక్కలి మేజర్ పంచాయతీ గోపీనాథపురం సమీపాన కంకరబందలో 2016 ఏప్రిల్ 14న రూ.7.68కోట్ల అంచనా వ్యయంతో 192 ఇళ్ల కాలనీ నిర్మాణానికి మంత్రి అచ్చెన్నాయుడు శంకుస్థాపన చేశారు. జీ ప్లస్ 2 నిర్మాణం సాగుతుండగా.. నిధుల కొరత నేపథ్యంలో మౌలిక సదుపాయాల కోసం రాష్ట్ర ప్రభుత్వం అదనంగా రూ.1.53 కోట్లు కేటాయించింది. దీంతో ఆరు బ్లాకుల పరిధిలో 192 ఇళ్ల నిర్మాణాలు పూర్తిచేశారు. రోడ్డు విస్తరణ పనులు చేపట్టాల్సి ఉండగా.. 2019 సార్వత్రిక ఎన్నికలు సమీపించాయి. దీంతో లబ్ధిదారుల కేటాయింపు ప్రక్రియ నిలిచిపోయింది. తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం నాలుగేళ్లపాటు ఈ హుద్‌హుద్ ఇళ్ల కాలనీని పట్టించుకోలేదు. మళ్లీ ఎన్నికల ముంగిట 2023 నవంబరు 30న ఈ కాలనీలో 90 మంది లబ్ధిదారులకు ఇళ్లను కేటాయించారు. ఇక్కడే పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని, వైసీపీ నేతలు డబ్బులు తీసుకుని స్థానికేతరులకు కూడా ఈ ఇళ్లను కేటాయించారని మంత్రి అచ్చెన్నాయుడు పలుమార్లు ఆరోపిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో మిగిలిన ఇళ్ల కేటాయింపు ప్రక్రియ కూడా నిలిచిపోయింది. కాగా ప్రస్తుతం ఈ కాలనీలో విద్యుత్ సౌకర్యం, మరుగుదొడ్లు, కాలువలు, తాగునీరు వంటి మౌలిక సదుపాయాలు లేక లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారు. రెండేళ్లుగా చీకట్లోనే మగ్గుతున్నామని, ఈ కాలనీ అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంత్రి అచ్చెన్నాయుడు, అధికారులు స్పందించి మౌలిక సౌకర్యాలు కల్పించాలని కోరుతున్నారు.
ఈ విషయమై ఆర్డీవో ఎం.కృష్ణమూర్తి వద్ద ప్రస్తావించగా హుద్‌హుద్ ఇళ్ల కాలనీకి సంబంధించి పూర్తిస్థాయి మౌలిక సదుపాయాలు కల్పనకు అవసరమైన నిధుల కోసం గృహనిర్మాణశాఖ ఎండీకి ప్రతిపాదనలు పంపించామన్నారు. నిధులు రాగానే పనులు పూర్తిచేస్తామని తెలిపారు.
చీకట్లో మగ్గుతున్నాం :
రెండేళ్లుగా చిమ్మ చీకట్లోనే ఉంటున్నాం. విద్యుత్, తాగునీరు సౌకర్యాలకు దూరంగా ఉన్నాం. ఎన్నో ఇబ్బందులు పడుతూ హుద్‌హుద్ ఇళ్ల కాలనీలో నివసిసున్నాం.
- కె.అనసూయ, టెక్కలి
అధికారుల చుట్టూ తిరుగుతున్నాం :
మౌలిక సదుపాయాలు కల్పించాలని అధికారులకు వినతులు అందించాం. అయినా సమస్య పరిష్కారం కావడం లేదు. చీకటిపడితే పాముల భయంతో ఇబ్బందులు పడుతున్నాం.
- డి.గీత, టెక్కలి