Share News

పుట్టినరోజు వేడుకలు చేసుకునేందుకు వెళ్లి..

ABN , Publish Date - Oct 20 , 2025 | 12:11 AM

పుట్టినరోజు వేడుకలు చేసుకునేందుకు స్నేహితులతో కలిసి వెళ్లిన తన కుమారుడు తిరిగి వస్తాడని చూస్తున్న ఆ తల్లిదండ్రులకు పిడుగులాంటి వార్త అందింది.

పుట్టినరోజు వేడుకలు చేసుకునేందుకు వెళ్లి..
గల్లంతైన జగదీష్‌

- సముద్రంలో గల్లంతైన యువకుడు

- ప్రాణాలతో బయటపడిన నలుగురు స్నేహితులు

- మొగదలపాడు తీరంలో ఘటన

పొందూరు/గార, అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి): పుట్టినరోజు వేడుకలు చేసుకునేందుకు స్నేహితులతో కలిసి వెళ్లిన తన కుమారుడు తిరిగి వస్తాడని చూస్తున్న ఆ తల్లిదండ్రులకు పిడుగులాంటి వార్త అందింది. సముద్ర స్నానం చేస్తుండగా తన కుమారుడు అలల తాకిడికి గల్లంతైనట్లు సమాచారం రావడంతో ఆ తల్లిదండ్రులు ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. దీపావళి ముందురోజు జరిగిన ఈ సంఘటన ఖాజీపేట గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది. గార పోలీసులు, మెరైన్‌ సీఐ ప్రసాదరావు తెలిపిన వివరాల మేరకు.. పొందూరు మండలం కింతలి పంచాయతీ ఖాజీపేటకు చెందిన అలబోయిన గోవింద, గోపమ్మ కుమారుడు జగదీష్‌ (18) ఇంటర్మీడియట్‌ పూర్తి చేశాడు. ఆదివారం జగదీష్‌ పుట్టినరోజు కావడంతో వేడుకలు చేసుకోవడానికి మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో తన ఐదుగురు స్నేహితులతో కలిసి గార మండలం మొగదలపాడు బీచ్‌కు వెళ్లాడు. సాయంత్రం 4 గంటల ప్రాంతంలో స్నానం కోసం సముద్రంలోకి దిగారు. అలల తాకిడికి జగదీష్‌ గల్లంతయ్యాడు. మిగిలిన నలుగురు మిత్రులు ప్రాణాలతో బయటపడ్డారు. స్నేహితులు కేకలు వేయడంతో సమీపంలో ఉన్నవారు, గ్రామస్థులు, మెరైన్‌ పోలీసులు వచ్చి రక్షించేందుకు ప్రయత్నించారు. అయినా ఫలితం లేకపోవడంతో స్నేహితులు జగదీష్‌ తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. దీంతో వారు ఒక్కసారిగా కుప్ప కూలిపోయారు. జగదీష్‌ తండ్రి గోవింద ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు గార ఏఎస్‌ఐ టి.చంద్రమోహన్‌ తెలిపారు.

Updated Date - Oct 20 , 2025 | 12:11 AM