శభాష్.. మేజర్ కవిత!
ABN , Publish Date - Aug 06 , 2025 | 12:31 AM
సిక్కోలు యువతికి అరుదైన గౌరవం దక్కింది.
సిక్కోలు యువతికి అరుదైన గౌరవం
బ్రహ్మపుత్రలో 1040 కి.మీ. ర్యాఫ్టింగ్ ప్రయాణం
అభినందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు
శ్రీకాకుళం, ఆగస్టు 5(ఆంధ్రజ్యోతి): సిక్కోలు యువతికి అరుదైన గౌరవం దక్కింది. మెట్టూరు గ్రామానికి చెందిన వసుపల్లి కవిత బ్రహ్మపుత్ర నదిలో 1040 కిలోమీటర్ల ర్యాఫ్టింగ్ ప్రయాణం చేసి అరుదైన రికార్డు నెలకొల్పింది. ఇటీవల లండన్‌కు చెందిన వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌కు తన పేరును నిలుపుకొన్నారు. బ్రహ్మపుత్ర నదిలో అన్ని కిలోమీటర్లు ర్యాఫ్టింగ్ యాత్రను పూర్తిచేసిన ఏకైక మహిళగా రికార్డు సొంతం చేసుకున్నారు. ఈ ప్రమాదకరమైన ప్రయాణంలో ర్యాఫ్ట్ నాలుగుసార్లు తిరగబడింది. ప్రవాహధాటికి చిక్కుకుపోయిన సందర్భాలూ ఉన్నాయి. అయినా టీమ్ వర్క్.. భగవంతుని ఆశీస్సుల వల్ల గమ్యాన్ని చేరుకున్నామని మేజర్ కవిత వెల్లడించారు. ఇంతటితో ఆగకుండా ‘మౌంట్ గొరిచెన్’ పర్వతం అధిరోహించే యాత్రలో 5,900 మీటర్ల ఎత్తున అపస్మారక స్థితిలోకి వెళ్లిన సహపర్వతారోహకుడిని కాపాడి ఆమె అసాధారణ ధైర్యాన్ని చూపించింది. ఇందుకు గుర్తింపుగా ‘సీఓఏఎస్ కామెండేషన్ అవార్డు’ ఆమెకు లభించింది. ఈ నేపథ్యంలో ఏపీ సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును మేజర్ కవిత కలుసుకున్నారు. కవిత సాహసయాత్రలు, ప్రత్యేకించి అడ్వెంచర్ స్పోర్ట్స్‌ని ముఖ్యమంత్రి ప్రశంసించారు. ‘మేజర్ కవిత జీవిత ప్రయాణం దేశ యువతకు ప్రేరణగా నిలుస్తుంది. యువతీ యువకులు అడ్వెంచర్ రంగాల్లో తమకు ఇష్టమైన మార్గాన్ని ఎంచుకుని ముందుకు సాగాలి’ అని సీఎం అన్నారు.