స్వదేశీ మత్స్యకారులను ఆదుకుంటాం
ABN , Publish Date - Jul 05 , 2025 | 12:24 AM
తీరం, చెరువుల్లో లభించిన మత్స్య సంపదను చేపల మార్కెట్‌లో నేరుగా అమ్ముకొని మత్స్యకారులు ఆర్థిక స్వావలంబన సాధించేందుకు వీలుగా చర్యలు చేపట్టామని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు.
మంత్రి అచ్చెన్న
టెక్కలి, జూలై 4 (ఆంధ్రజ్యోతి): తీరం, చెరువుల్లో లభించిన మత్స్య సంపదను చేపల మార్కెట్‌లో నేరుగా అమ్ముకొని మత్స్యకారులు ఆర్థిక స్వావలంబన సాధించేందుకు వీలుగా చర్యలు చేపట్టామని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. శుక్రవారం స్థానిక చిన్నబజారులో రూ.49 లక్షలతో నిర్మించిన చేపల మార్కెట్‌ను ఆయన ప్రారంభించారు. మత్స్యకార భరోసా కింద ఇప్పటికే మత్స్యకారులను ఆదుకున్నామని గుర్తుచేశారు. చేపలు నిల్వ ఉంచుకునేందుకు ఐస్‌బాక్సులు అందించాలని మత్స్యకార మహిళలు మంత్రిని కోరారు. చేపల మార్కెట్‌లో అమ్మకందారులతో ఒక కమిటీని ఏర్పాటు చేసి వారి నుంచి ఆశీలు వసూలుచేసి ఆ మొత్తాన్ని ఇక్కడ పనిచేసే మత్స్యకారుల కోసం వినియోగించేలా చూడాలని సంబంధిత అధికారి ధర్మరాజు పాత్రోకు ఆదేశించారు. పక్కనే ఉన్న మార్కెట్ సముదాయాన్ని పరిశీలించారు. అందులో మొదటి మూడు మాంసం దుకాణాలకు కేటాయించాలని, మిగిలినవన్నీ లాటరీ ద్వారా కూరగాయల దుకాణాలకు అందజేయాలని ఆర్డీవో ఎం.కృష్ణమూర్తి, ఎంపీడీవో కె.ఫణీంద్రకుమార్‌లకు ఆదేశించారు. పక్కనే అసంపూర్తిగా ఉన్న భవనాలను మండల పరిషత్ నిధులతో పూర్తిచేసి షాపింగ్ కాంప్లెక్స్‌లు సిద్ధం చేయాలన్నారు. ఈ సందర్భంగా పలువురు తమ సమస్యలపై అర్జీలు అందజేశారు. ఈ కార్యక్రమంలో బగాది శేషగిరి, లవకుమార్, కామేసు, దమయంతి, సుందరమ్మ, బుజ్జి, సూర్యనారాయణరెడ్డి, ప్రసాద్‌రెడ్డి, ప్రీతీష్, షణ్ముఖరావు పాల్గొన్నారు.