Share News

శివారు భూములకు సాగునీరు అందిస్తాం

ABN , Publish Date - Jul 03 , 2025 | 12:16 AM

వంశధార కాలువల ద్వారా శివారు భూములకు సాగునీరు అందించడమే లక్ష్యమని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ తెలిపారు.

      శివారు భూములకు సాగునీరు అందిస్తాం
ఎడమ కాలువ ద్వారా సాగు నీరు విడిచిపెడుతున్న కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌, ఎమ్మెల్యేలు రమణమూర్తి, గోవిందరావు

-కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌

- వంశధార ఎడమ కాలువ ద్వారా నీరు విడుదల

హిరమండలం, జూలై2 (ఆంధ్రజ్యోతి): వంశధార కాలువల ద్వారా శివారు భూములకు సాగునీరు అందించడమే లక్ష్యమని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ తెలిపారు. బుధవారం ఉదయం పాతపట్నం, నరసన్నపేట ఎమ్మెల్యేలు మామిడి గోవిందరావు, బగ్గు రమణమూర్తితో కలిసి ఆయన గొట్టాబ్యారేజీ వద్ద వంశధార ఎడమ ప్రధాన కాలువ హెడ్‌రెగ్యులేటర్‌ గేట్లు పైకెత్తి నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. ఈ ఏడాది ఖరీఫ్‌లో రైతులు సాగునీటికి ఎలాంటి కష్టాలు పడకుండా చూస్తామన్నారు. శివారు భూముల వరకూ నీరు అందిస్తామని, అధిక దిగుబడులు సాధించాలని ఆకాంక్షించారు. మరికొద్ది రోజుల్లో కుడి కాలువ ద్వారా నీటిని విడిచిపెడతామని తెలిపారు.

500 క్యూసెక్కులు విడుదల..

వంశధార ఎడమ కాలువ ద్వారా ముందుగా 500 క్యూసెక్కుల నీటిని విడిచిపెట్టామని, దీన్ని క్రమేపి పెంచుకుంటూ వారంలో పూర్తి స్థాయిలో వదులుతామని గొట్టాబ్యారేజి ఈఈ సీతారాంనాయుడు తెలిపారు. 104 కిలోమీటర్ల మేర ఉన్న ఎడమ కాలువ ద్వారా హిరమండలం, సారవకోట, జలుమూరు, పోలాకి, నరసన్నపేట, కోటబొమ్మాళి, సంతబొమ్మాళి, టెక్కలి, నందిగాం, వజ్రపుకొత్తూరు, మెళియాపుట్టి, పలాస మండలాల్లోని 398గ్రామాల్లో 1,48,200 ఎకరాలకు సాగు నీరు అందించనున్నారు. కాలువ పరిధిలో ఉన్న 584 చెరువులను నీటితో నింపనున్నారు. ప్రస్తుతం క్యాచ్‌మెంట్‌ ఏరియా నుంచి నదిలోకి ఇన్‌ఫ్లో 1400 క్యూసెక్కులు వస్తుందని ఈఈ తెలిపారు. బ్యారేజి వద్ద 38.01 నీటి మట్టం కొనసాగిస్తూ, దిగువకు 1400 క్యూసెక్కులు విడిచిపెడతామన్నారు. ముందుగా పలాస, వజ్రపుకొత్తూరు మండలాల్లోని శివారు ఆయకట్టుకు నీటిని పంపిస్తామని తెలిపారు.

బ్యారేజీ పటిష్టతకు చర్యలు తీసుకోండి

హిరమండలం వద్ద ఉన్న గొట్టాబ్యారేజీ పటిష్టతకు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యేలు బగ్గు రమణమూర్తి, మామిడి గోవిందరావు కలెక్టర్‌ను కోరారు. గత ఆరేళ్లుగా బ్యారేజీ నిర్వహణకు నిధులు కేటాయించకపోవడంతో శిథిలావస్థకు చేరుకుంటుందన్నారు. అలాగే ఎడమ కాలువను ఆధునీకరించాల్సి ఉందన్నారు. దీనికోసం రూ.1800 కోట్లు అవసరం ఉందని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించినట్లు చెప్పారు. కార్యక్రమంలో వంశధార డిస్ర్టిబ్యూటరీ కమిటీ చైర్మన్‌ రవీంద్ర, జడ్పీటీసీ సభ్యుడు పి.బుచ్చిబాబు, జాయింట్‌ కలెక్టర్‌ ఫర్మాన్‌ అహ్మద్‌ ఖాన్‌, వంశధార ఎస్‌ఈ సుగుణాకరరావు, ఆర్డీవో కృష్ణమూర్తి, ఈఈ శేఖర్‌బాబు, డీఈలు సరస్వతి, అనిల్‌కుమార్‌, ఏఈ ధనుంజరరావు పాల్గొన్నారు.

Updated Date - Jul 03 , 2025 | 12:16 AM