Share News

రైతులందరికీ ఎరువులు అందిస్తాం

ABN , Publish Date - Sep 06 , 2025 | 11:56 PM

రైతు లందరికీ సకాలంలో ఎరువులు అందించి ఆదుకోవడమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి అన్నారు.

రైతులందరికీ ఎరువులు అందిస్తాం
మాట్లాడుతున్న ఎమ్మెల్యే రమణమూర్తి

-ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి

- వెలుగు ఏపీఎంకు షోకాజ్‌ నోటీసులు

జలుమూరు, సెప్టెంబరు 6 (ఆంధ్రజ్యోతి): రైతు లందరికీ సకాలంలో ఎరువులు అందించి ఆదుకోవడమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి అన్నారు. స్థానిక మండల పరిషత్‌ సమావేశ భవనంలో ఎంపీపీ వాన గోపి అధ్యక్షతన శనివారం నిర్వహించిన మండల సాధారణ సర్వసభ్య సమావేశంలో ఆయన పాల్గొని మా ట్లాడారు. అనివార్యకారణాలతో ఈ ఏడాది జూలైలో యూరియా రానందున కొంతమంది వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టించి రైతులకు వాటిని అందకుండా చేశారని అన్నారు. పాగోడు వ్యవసాయ సహాయకుడు మెండ వెంకటేశం విధులకు డుమ్మా కొట్టి రైతులకు అందుబాటులో ఉండడం లేదని గ్రామ సర్పంచ్‌ దామ మన్మథరావు, శ్రీముఖలింగం ఎంపీటీసీ కె.హరిప్రసాద్‌ సమావేశం దృష్టికి తీసుకెళ్లారు. వెలుగు ఏపీఎం హేమసుందరరావు గత మూడు సర్వసభ్య సమావేశాలకు గైర్హాజరయ్యారని, ఆయనకు షోకాజ్‌ నోటీసు జారీచేయాలని ఎంపీపీ, ఎంపీడీవోలను ఎమ్మెల్యే ఆదేశించారు. అలాగే వ్యవసాయాధికారి రవికుమార్‌ సర్వసభ్య సమావేశానికి గైర్హాజరవడంపై సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ తర్ర బలరాం, పర్లాం డిస్ట్రిబ్యూటరీ కమిటీ అధ్యక్షుడు కింజరాపు సత్యం, చల్లవానిపేట సొసైటీ అధ్యక్షుడు దుంగ స్వామిబాబు, డిప్యూటీ తహసీల్దార్‌ మధు తదితరులు పాల్గొన్నారు.

రాయితీలను సద్వినియోగ పరచుకోవాలి

ప్రభుత్వం అందిస్తున్న రాయితీలను రైతులు సద్వినియోగ పరచుకోవాలని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి అన్నారు. గొటివాడకు చెందిన వెంకటేశ్వర కిసాన్‌ సభ్యులకు రాయితీపై డ్రోన్‌ యంత్రాన్ని శనివారం అందించారు రూ.9.80 లక్షల విలువ గల డ్రోనును రైతులకు రాయితీపై రూ.2 లక్షలకే ప్రభుత్వం అందిస్తుందన్నారు. కార్యక్రమంలో వ్యవసాయశాఖ ఏడీ మధు, టీడీపీ మండల అధ్యక్షుడు వెలమల రాజేంద్రనాయుడు, నాయకులు, రైతులు పాల్గొన్నారు.

గురువుల సేవలు వెలకట్టలేనివి

పోలాకి, సెప్టెంబరు 6 (ఆంధ్రజ్యోతి): విద్యార్థులను బావిపౌరులుగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయులు ప్రముఖ పాత్రవహిస్తారని, వారి సేవలు వెలకట్టలేనివని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి అన్నారు. శనివారం మండల పరిషత్‌ కార్యాలయంలో నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొని ప్రసంగించారు. అనంతరం ఉత్తమ ఉపాధ్యాయులను ఆయన సన్మానించారు. ఎంఈవో శ్రీనివాసనాయక్‌, ఏపీటీఎఫ్‌ రాష్ట్ర సహాయకులు చింతాడ దిలీప్‌కుమార్‌, మల్లేశ్వరరావు, కూటమినాయకులు పాల్గొన్నారు.

Updated Date - Sep 06 , 2025 | 11:56 PM