పేదల సొంతిల్లు కల నెరవేరుస్తాం
ABN , Publish Date - Oct 25 , 2025 | 12:06 AM
house for poor people గూడులేని పేదలందరికీ సొంతింటి కల నెరవేర్చేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. శుక్రవారం కోటబొమ్మాళి మండలం నిమ్మాడలోని క్యాంపు కార్యాలయంలో గృహ నిర్మాణశాఖ అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు.
- మంత్రి అచ్చెన్నాయుడు
కోటబొమ్మాళి, అక్టోబరు 24(ఆంధ్రజ్యోతి): గూడులేని పేదలందరికీ సొంతింటి కల నెరవేర్చేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. శుక్రవారం కోటబొమ్మాళి మండలం నిమ్మాడలోని క్యాంపు కార్యాలయంలో గృహ నిర్మాణశాఖ అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. మంత్రి అచ్చెన్న మాట్లాడుతూ.. ‘పేదలకు పక్కా ఇళ్లు నిర్మించాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యం. అందుకు అనుగుణంగా అధికారులు పనిచేయాలి. అర్హులను గుర్తించి త్వరలో నూతన నిర్మాణాలు ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలి. ఇళ్ల కోసం పేదలు దరఖాస్తు చేసుకునేలా చూడాల’ని అధికారులకు ఆదేశించారు. గత ప్రభుత్వం పేదలకు ఇళ్లు నిర్మిస్తామని ఆర్భాటపు ప్రచారం చేసి చివరకు లబ్ధిదారులను నిండా ముంచేసిందని ఆరోపించారు. ప్రణాళిక లేకుండా గృహనిర్మాణ పథకం అమలులో విఫలమైందన్నారు. ఫలితంగా లబ్ధిదారులు తీవ్రంగా నష్టపోయారని తెలిపారు.
తొలుత కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహించి, ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఇళ్లు మంజూరు చేయాలని చాలామంది వినతులు అందజేశారు. ఈ మేరకు నవంబరు 15వ తేదీలోగా సచివాలయాల్లో దరఖాస్తు చేసుకుని, సంబంధిత పత్రాలు గృహనిర్మాణ కార్యాలయంలో అందజేయాలని మంత్రి అచ్చెన్న తెలిపారు. స్థలం ఉండి ఇల్లు నిర్మించుకోవాలనుకునేవారు వచ్చే నెల లోగా ఆన్‌లైన్ చేసుకోవాలని సూచించారు. అలాగే సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి పురస్కరించుకుని యూనిట్ మార్చ్‌కు సంబంధించిన గోడపత్రికను మంత్రి ఆవిష్కరించారు. కార్యక్రమంలో గృహనిర్మాణ ప్రాజెక్టు అధికారి రమాకాంత్, ఎన్‌వైకే అధికారులు పాల్గొన్నారు.