ఆదిత్యాలయాన్ని సుందరంగా అభివృద్ధి చేస్తాం
ABN , Publish Date - Oct 24 , 2025 | 12:13 AM
arasavalli devolopment అరసవల్లిలో ఆదిత్యాలయాన్ని సర్వాంగసుందరంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. గురువారం కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఎమ్మెల్యే గొండు శంకర్‌తో కలిసి అరసవల్లిలోని ఆలయ పరిసరాల్లో పర్యటించారు.
రథససప్తమి నాటికి పనులు పూర్తి
మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు
అరసవల్లి, అక్టోబరు 23(ఆంధ్రజ్యోతి): అరసవల్లిలో ఆదిత్యాలయాన్ని సర్వాంగసుందరంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. గురువారం కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఎమ్మెల్యే గొండు శంకర్‌తో కలిసి అరసవల్లిలోని ఆలయ పరిసరాల్లో పర్యటించారు. ఆలయ అభివృద్ధిపై ఆదిత్యాలయ అనివెట్టి మండపంలో సమీక్ష నిర్వహించారు. మంత్రి అచ్చెన్న మాట్లాడుతూ.. ‘గతేడాది రథసప్తమి ఉత్సవాలను రాష్ట్ర పండుగగా, అత్యంత వైభవంగా నిర్వహించాం. ఇదే మాదిరి వచ్చే ఏడాది కూడా జనవరి 25న రథసప్తమితోపాటు సిక్కోలు ఉత్సవాలు వారం రోజులపాటు నిర్వహించాలని నిర్ణయించాం. ఆలయ అభివృద్ధికి సంబంధించి కచ్చితమైన ప్లాన్ తయారుచేయాలి. అన్నదాన భవనం, ప్రసాదాల తయారీ, విక్రయ కేంద్రాలు, రాజగోపురం చెడిపోకుండా ఆలయ అభివృద్ధి చేయాలి. ఇంద్రపుష్కరిణితోపాటు భక్తుల కోసం వెయిటింగ్ హాల్ నిర్మాణం, వసతి ఏర్పాట్లు, షాపింగ్ కాంప్లెక్సు, కొత్త క్యూలైన్ల ఏర్పాటు వంటి పనులు రానున్న రథసప్తమి నాటికే పూర్తిచేయాలి. సుమారు రూ.12కోట్ల ఆలయ, సీజీఎఫ్ నిధులతో ఈ పనులు చేపట్టాల’ని అధికారులను ఆదేశించారు. ‘షాపింగ్ కాంప్లెక్స్‌ను గుడ్‌విల్ పద్ధతిలో నిర్మించేలా చర్యలు తీసుకోవాలి. అంచనాలు రూపొందించి టెండర్లు పిలవాలి. స్థానిక ఎమ్మెల్యే, కలెక్టర్, జేసీ, ఆర్డీవో, మున్సిపల్ కమిషనర్, ఇంజినీర్‌తో ఫెస్టివల్ వాట్సాప్ గ్రూప్‌ను ఏర్పాటు చేయండి. ఏ సమస్య ఉన్నా సరే వెంటనే ఈ గ్రూప్ ద్వారా తెలియజేయండి’ అని మంత్రి సూచించారు. ఇంజినీరింగ్ సిబ్బంది అత్యవసరంగా కావాలని ఈవో అడగ్గా.. వెంటనే దేవదాయశాఖ కమిషనర్‌తో మంత్రి అచ్చెన్న ఫోన్‌లో మాట్లాడారు. రెండ్రోజుల్లో ఒక ఏఈ, డీఈల నియామక ఉత్తర్వులు జారీ చేయాలని ఆదేశించారు. అలాగే దినసరి వేతన ఉద్యోగులకు ఔట్‌సోర్సింగ్ ద్వారా జీతాలు చెల్లించాలని కోరారు. కార్యక్రమంలో జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, ఆర్డీవో సాయి ప్రత్యూష, ఏఎస్పీ కె.వి.రమణ, మున్సిపల్ కమిషనర్ ప్రసాదరావు, మునిసిపల్ ఇంజినీర్ పొగిరి సుగుణాకరరావు పాల్గొన్నారు.