Share News

ప్రతి ధాన్యం గింజా కొనుగోలు చేస్తాం

ABN , Publish Date - Nov 22 , 2025 | 11:53 PM

Purchase of grain ‘రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజనూ కొనుగోలు చేస్తాం. అకాల వర్షాలు కారణంగా రంగుమారిన, తడిచిన ధాన్యానికి కూడా మద్దతు ధర కల్పిస్తామ’ని రాష్ట్ర వ్యవసాయాశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు.

ప్రతి ధాన్యం గింజా కొనుగోలు చేస్తాం
మాట్లాడుతున్న మంత్రి అచ్చెన్నాయుడు

- 48 గంటల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ

- వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు

కోటబొమ్మాళి, నవంబరు 22(ఆంధ్రజ్యోతి): ‘రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజనూ కొనుగోలు చేస్తాం. అకాల వర్షాలు కారణంగా రంగుమారిన, తడిచిన ధాన్యానికి కూడా మద్దతు ధర కల్పిస్తామ’ని రాష్ట్ర వ్యవసాయాశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. శనివారం స్థానిక ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం వద్ద జేసీ ఫర్మాన్‌ ఆహ్మద్‌ ఖాన్‌తో కలిసి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రాంభించారు. మంత్రి అచ్చెన్న మాట్లాడుతూ ‘జిల్లాలో 6.50లక్షల మెట్రిక్‌ టన్నులు ధాన్యం సేకరణ లక్ష్యం. 406 ఽధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా 264 రైస్‌ మిల్లులకు అందిస్తాం. ఏ గ్రేడ్‌ ధాన్యం బస్తాకు రూ.2389, సాధారణ రకానికి రూ.2369 చొప్పున ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించింది. కొనుగోలు ప్రక్రియలో రైతులకు ఇబ్బందులు లేకుండా శతశాతం ఈ-క్రాప్‌ నమోదు చేశాం. వైసీపీ ప్రభుత్వ పాలనలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ అస్తవ్యస్తంగా సాగింది. రైతులకు సక్రమంగా నగదు చెల్లించలేదు. ప్రస్తుతం ధాన్యం విక్రయించిన 48 గంటల్లోనే రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తాం. నరసన్నపేట మండలం కంబకాయలో ఓ రైతుకు నాలుగు గంటల్లోనే జమ చేశాం. గతంలో రైతులు ఇచ్ఛాపురంలో ఽధాన్యం విక్రయిస్తే.. వాటిని కోటబొమ్మాళి, నరసన్నపేట మిల్లులకు పంపించేవారు. దీంతో రైతులు చాలా ఇబ్బందులు పడేవారు. ప్రస్తుతం రైతులు నచ్చిన రైస్‌మిల్లుకు వెళ్లి ఈ నెల నుంచి మార్చి వరకు ధాన్యం విక్రయించుకోవచ్చ’ని తెలిపారు. బ్యాంకు గ్యారంటీ తీసుకోవడంలో మిల్లర్ల నిర్లక్ష్యంపై మంత్రి అసహనం వ్యక్తం చేశారు. జిల్లాలో 264 మిల్లులు ఉండగా, ఇప్పటివరకు 33 మంది మాత్రమే బ్యాంకు గ్యారంటీలు తీసుకున్నారని తెలిపారు. మిల్లర్లు బ్యాంకు గ్యారంటీలు తీసుకుని రైతులకు ఇబ్బందులు లేకుండా కొనుగోలు ప్రక్రియ చేపట్టాలని స్పష్టం చేశారు. అనంతరం రైతులకు వేరుశెనగ వితనాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి వేణుగోపాల్‌, టెక్కలి ఆర్డీవో ఎం.కృష్ణమూర్తి, ఏడీఏ కె.జగన్మోహన్‌నరావు, తహసీల్దార్‌ అప్పలరాజు, ఎంపీడీవో ఫణీంద్రకుమార్‌, పీఏసీఎస్‌ అధ్యక్షురాలు వెలమల విజయలక్ష్మి, కామేశ్వరరావు, పీఏసీఎస్‌ మాజీ అధ్యక్షుడు కింజరాపు హరిప్రసాద్‌, జిల్లా మిల్లర్లు అధ్యక్షుడు బోయిన రమేష్‌, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బోయిన గోవిందరాజులు, టీడీపీ నాయకులు కర్రి అప్పారావు, సాసుమంతు ఆనందరావు, పూజారి శైలజ, బాడాన రమణమ్మ, కోరాడ గోవిందరావు, కోటబొమ్మాళి మిల్లర్ల అధ్యక్షుడు ఎస్‌.లక్ష్మణరావు పాల్గొన్నారు.

Updated Date - Nov 22 , 2025 | 11:53 PM