Share News

ప్రతి ధాన్యం గింజా కొనుగోలు చేస్తాం

ABN , Publish Date - Nov 19 , 2025 | 12:10 AM

రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజనూ ప్రభుత్వం మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేస్తుందని, దళారులకు విక్రయించి నష్టపోవద్దని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి అన్నారు.

ప్రతి ధాన్యం గింజా కొనుగోలు చేస్తాం
ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి

జలుమూరు, నవంబరు 18 (ఆంధ్రజ్యోతి): రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజనూ ప్రభుత్వం మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేస్తుందని, దళారులకు విక్రయించి నష్టపోవద్దని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి అన్నారు. చల్లవానిపేట సొసైటీలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం ఆయన ప్రారంబించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రైతులు అభ్యున్నతే కూటమి ప్రభుత్వం ధ్యేయమన్నారు. మండలంలో 21 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేసినట్లు చెప్పారు. గ్రేడు-ఏ రకం ధాన్యం క్వింటారు.2,389, 80 కేజీల బస్తా రు.1,792, సాధారణ రకం క్వింటా రూ.2,369, 80 కేజీల బస్తా రు.1,777కు ప్రభుత్వం కొనుగోలు చేస్తున్నట్లు వివరించారు. ధాన్యం మిల్లర్లకు చేరిన 24 గంటల్లో నగదు రైతుల ఖాతాకు జమవుతుందని తెలిపారు. కార్యక్రమంలో నియోజకవర్గ టీడీపీ సమన్వయకర్త బగ్గు అర్చన, చల్లవానిపేట, అల్లాడ సొసైటీల చైర్మన్‌లు దుంగ స్వామిబాబు, వెలమల రాజేంద్రనాయుడు, వ్యవసాయశాఖ ఏడీ ఎల్‌.వి.మధు, తహసీల్దార్‌ జె.రామారావు, ఎంపీడీవో బి.చిన్నమ్మడు, వ్యవసాయాధికారి కె.రవికుమార్‌, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - Nov 19 , 2025 | 12:10 AM