For port residents: సుందరంగా పునరావాస కాలనీ నిర్మిస్తాం
ABN , Publish Date - Aug 10 , 2025 | 11:52 PM
Devolopment works మూలపేట పోర్టు నిర్వాసితులకు సర్వాంగ సుందరంగా పునరావస కాలనీ నిర్మిస్తామని రాష్ట్ర వ్యవసాయ, మత్స్యశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు.
- వ్యవసాయ, మత్స్యశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు
సంతబొమ్మాళి, ఆగస్టు 10(ఆంధ్రజ్యోతి): మూలపేట పోర్టు నిర్వాసితులకు సర్వాంగ సుందరంగా పునరావస కాలనీ నిర్మిస్తామని రాష్ట్ర వ్యవసాయ, మత్స్యశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. ఆదివారం సాయంత్రం నౌపడలో పోర్టు నిర్వాసిత గ్రామాల కాలనీలో రూ.32కోట్లతో 12 రకాల మౌలిక వసతుల పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం మంత్రి అచ్చెన్న మాట్లాడుతూ.. ‘పోర్టు నిర్మాణంతో జిల్లా శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. పోర్టు నిర్మాణం కోసం భూములు, ఇళ్లు త్యాగం చేసిన మూలపేట, విష్ణుచక్రం గ్రామాల ప్రజలకు పునరావాస కాలనీలో ఎటువంటి సమస్యలు లేకుండా చేస్తాం. పునరావాస కాలనీలో ఇప్పటికే విద్యుత్ సరఫరా ఏర్పాటు చేశాం. సిమెంట్ రోడ్ల నిర్మాణం త్వరలోనే పూర్తవుతుంది. బడి,గుడి నిర్మాణం కూడా చేపడతాం. నిర్వాసితులు ఆందోళన చెందొద్దు. అందరి సమస్యలు పరిష్కరిస్తామ’ని తెలిపారు. పునరావాస కాలనీని ఆదర్శంగా తీర్చిదిద్దాలని అధికారులకు సూచించారు. అంతకుమందు రూ.50లక్షల వ్యయంతో నౌపడ-టెక్కలి రహదారి నుంచి ఇజ్ఞవరం గ్రామానికి సిమెంట్ రోడ్డుకు శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఆర్డీవో కృష్ణమూర్తి, టీడీపీ నాయకులు జీరు భీమారావు, ఎల్.ఎల్.నాయుడు, అట్టాడ రాంప్రసాద్, బాడాన రమణమ్మ, రెడ్డి అప్పన్న, బొడ్డేపల్లి సత్యనారాయణ పాల్గొన్నారు.