ఏడాదిలో పలాస-కాశీబుగ్గకు తాగునీరు ఇచ్చాం: ఎమ్మెల్యే శిరీష
ABN , Publish Date - Jun 07 , 2025 | 12:23 AM
‘పాకిస్థాన్‌పై ఆపరేషన్ సిందూర్ పేరుతో యుద్ధం చేసి విజయం సాధించామని... దానికి గుర్తుగా పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీలో తాగునీరు అందించేందుకు నిర్దేశించిన పథకానికి ‘సిందూర జలసిరి’ అని పేరు పెట్టడాన్ని అదృష్టంగా భివిస్తున్నామని ఎమ్మెల్యే గౌతు శిరీష అన్నారు.
పలాస, జూన్ 6(ఆంధ్రజ్యోతి): ‘పాకిస్థాన్‌పై ఆపరేషన్ సిందూర్ పేరుతో యుద్ధం చేసి విజయం సాధించామని... దానికి గుర్తుగా పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీలో తాగునీరు అందించేందుకు నిర్దేశించిన పథకానికి ‘సిందూర జలసిరి’ అని పేరు పెట్టడాన్ని అదృష్టంగా భివిస్తున్నామని ఎమ్మెల్యే గౌతు శిరీష అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి న ఏడాది లోపే జంట పట్టణాలలో శాశ్వత తాగునీటి పథకం ప్రారంభించామని అన్నారు. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో ‘సిందూర జలసిరి’ కార్యక్రమంపై ఇంజనీరింగ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ యుద్ధ ప్రాతిపదికన తాగునీరు తీసుకువచ్చామని చెప్పారు. గతంలో పలాస మీదుగా జల జీవన్ మిషన్ ద్వారా నీరు వెళ్తున్నా వైసీపీ పాలకుల చేతకాని తనం వల్ల నీరు ఇవ్వలేదని విమర్శించారు. తాము అధికారం చేపట్టిన వెంటనే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి... తాగునీరు రప్పించామన్నారు. ఇప్పటి వరకూ 60 శాతం మందికి కుళాయిలతో నీరు అందిస్తున్నారని తెలిపారు. మిగిలిన వారికి కూడా నీరు అందించేందుకు అధికారులు ప్రణాళికబద్ధంగా వెళ్లాలని సూచించారు. సూదికొండకాలనీ, రోటరీనగర్, శివాజినగర్‌తో పాటు మరికొన్ని వార్డులకు యుద్ధ ప్రాతిపదికన నీరు ఇవ్వాలని ఆమె ఆదేశించారు. పైపులైన్ల కోసం రూ.1.50 కోట్లు ఖర్చవుతుందని అధికారులు చెప్పడంతో ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి నిధులు రప్పించుకుందామని తెలిపారు. కిడ్నీ పరిశోధన కేంద్రం, 200 పడకల ఆసుపత్రికి కూడా ఉద్దానం నీరు వెళ్లే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. దీనికి సంబంధించిన అంచనాలు సిద్ధం చేయాలని కోరారు. సమావేశంలో కమిషనర్ ఎన్. రామారావు, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ రంగప్రసాద్, డీఈఈ ఆశాలత, తదితరులు పాల్గొన్నారు.
సబ్సిడీ విత్తనాలను
సద్వినియోగం చేసుకోవాలి
పలాస రూరల్, జూన్ 6 (ఆంఽధ్రజ్యోతి): ప్రభుత్వం రైతులకు అందిస్తున్న సబ్సిడీ విత్తనాలను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే గౌతు శిరీష అన్నారు. కాంట్రగడలో శుక్రవారం రూ.10లక్షల నిధులతో మంజూరైన రెండు సీసీ రోడ్లను ప్రారంభించారు. అనంతరం ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ విత్తనాలను రైతులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పీరుకట్ల విఠల్‌రావు, సర్పంచ్ ఎస్.తిరుమలరావు, ఎంపీడీవో వసంత్‌కుమార్, ఏవో పోలారావు, కార్యదర్శి సద్గుణరాజు పాల్గొన్నారు.