మేం ఇక్కడ వైద్యం చేయం
ABN , Publish Date - Oct 11 , 2025 | 12:12 AM
నరసన్నపేట ఏరియా ఆసుపత్రికి వచ్చే రోగులకు, గర్భిణులకు వైద్యసేవలు అందించకుండా కుంటి సాకులు చెప్పి వెనుకకు పంపించేస్తుండడం ఇక్కడ ఆనవాయితీగా మారింది.
గర్భిణిని తనిఖీ చేయని వైద్య సిబ్బంది
వైద్యులను నిలదీసిన టీడీపీ నాయకులు
ఎట్టకేలకు చికిత్స అందించిన వైనం
నరసన్నపేట, అక్టోబరు 10(ఆంధ్రజ్యోతి): నరసన్నపేట ఏరియా ఆసుపత్రికి వచ్చే రోగులకు, గర్భిణులకు వైద్యసేవలు అందించకుండా కుంటి సాకులు చెప్పి వెనుకకు పంపించేస్తుండడం ఇక్కడ ఆనవాయితీగా మారింది. దీంతో చికిత్స కోసం వచ్చేవారంతా ఇబ్బందిపడుతున్నారు. ఇలాంటి సంఘటనే శుక్రవారం కూడా చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్లే.. నరసన్నపేట పట్టణం తమ్మయ్యపేటకు చెందిన గర్భిణి దేవాది ప్రియాంక ఉమ్మునీరు పోతుందని శుక్రవారం మధ్యాహ్నం 12గంటల సమయంలో ఏరియా ఆసుపత్రికి వచ్చిం ది. అయితే సంబంధిత డాక్టర్ ఆమెను తనిఖీ చేసేందుకు నిరాకరించారు. ఇంతవరకు ఏ డాక్టర్‌కి చూపించారో.. ఇప్పుడు అక్కడికే వెళ్లాలంటూ సలహా ఇచ్చారు. దీంతో ఆ గర్భిణి తిరుగుముఖం పట్టి.. ఆసుపత్రిలో వైద్యులు తీరును బంధువులకు చెప్పింది. ఈ విషయం స్థానిక టీడీపీ నాయకులకు ఆమె బంధువులు చెప్పడంతో, వారంతా ఆసుపత్రికి చేరుకొని గర్భిణికి వైద్యం అందించకపోవడంపై సంబంధిత డాక్టర్‌ను నిలదీశారు. మీరు ఎవరికి చెప్పుకున్నా భయం లేదని, నేను వైద్యం చేసే ప్రసక్తే లేదని ఆ డాక్టర్ మొండిపట్టు పట్టి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ విషయంపై ఆసుపత్రి సూపరింటెండెంట్ శ్రీనివాసబాబు దృష్టికి చేరడంతో ఆయన స్పందించి.. ఆ గర్భిణికు వైద్యపరీక్షలు నిర్వహించారు. కగా డాక్టర్ తీరుపై మండిపడుతూ వారంతా అక్కడి నుంచి వెళ్లిపోయారు. నరసన్నపేట ఏరియా ఆసుపత్రిలో కొందరు వైద్యులు, సిబ్బంది తీరుతో రోగులకు సేవలు అందకపోవడంతో పాటు ప్రైవేట్ ఆసుపత్రులకు రిఫర్ చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా స్త్రీవైద్య నిపుణులు కొందరు తమ ఆసుపత్రిల్లో కాన్పులు చేయించుకునేందుకు ఇలా ఏరియా ఆసుపత్రుల్లో వ్యవహరిస్తున్నట్టు ప్రచారం జరుగుతుంది. గతంలో మాదిరిగానే ఏరియా ఆసుపత్రిలో వైద్యసేవలపై సర్వత్రా విమర్శలు వినిపిస్తుండడం విశేషం.
గర్భిణి బంధువులను వారిస్తున్న పోలీసు