Share News

విద్యుత్‌ చార్జీలు తగ్గిస్తున్నాం

ABN , Publish Date - Oct 02 , 2025 | 12:18 AM

వైసీపీ ప్రభుత్వం విద్యుత్‌ చార్జీలతో పాటు నిత్యావసరాల ధరలను పెంచితే కూటమి ప్రభుత్వం వాటిని తగ్గిస్తుందని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు.

 విద్యుత్‌ చార్జీలు తగ్గిస్తున్నాం
బన్నువాడలో మాట్లాడుతున్న మంత్రి అచ్చెన్నాయుడు

- మంత్రి అచ్చెన్నాయుడు

టెక్కలి రూరల్‌, అక్టోబరు 1 (ఆంధ్రజ్యోతి): వైసీపీ ప్రభుత్వం విద్యుత్‌ చార్జీలతో పాటు నిత్యావసరాల ధరలను పెంచితే కూటమి ప్రభుత్వం వాటిని తగ్గిస్తుందని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. బుధవారం తన దత్తత గ్రామం బన్నువాడలో జరిగిన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ‘గత ప్రభుత్వం అప్పులు చేసి సంక్షేమ పథకాలు అమలు చేసింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేకపోయినా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వైసీపీ కంటే రెట్టింపు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. నిత్యావసరాల ధరలను తగ్గిస్తున్నాం. విద్యుత్‌ చార్జీలకు సంబంధించి ప్రతి నెల వచ్చే బిల్లులో ట్రూడౌన్‌ చార్జీలను యూనిట్‌కు 13 పైసలు తగ్గిస్తున్నాం. ప్రజలకు సోలార్‌ విద్యుత్‌ రాయితీ ఇస్తాం. ఈ క్రాప్‌ నమోదు గడువును ఈ నెల 20 వరకు పెంచుతున్నాం. ఇచ్చిన మాట ప్రకారం ఏడాదిలోనే 64 లక్షల మందికి రూ.34 వేల కోట్లు వెచ్చించి ఎన్టీఆర్‌ భరోసా పింఛన్లు అందిస్తున్నాం. సూపర్‌ సిక్స్‌ పథకాలతో పేదల జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తున్నాం. అన్నదాత సుఖీభవ కింద మొదటి విడత డబ్బులు జమకాని రైతులు సచివాలయంలో దరఖాస్తులు చేసుకోవాలి. పోర్టు రోడ్లకు సంబంధించి అండర్‌ పాసేజ్‌కు రూ.15 కోట్లు మంజూరు చేశాం.’ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయమార్కెట్‌ కమిటీ అధ్యక్షుడు బగాది శేషగిరిరావు, టెక్కలి ఆర్డీవో ఎం.కృష్ణమూర్తి, డీఆర్‌డీఏ పీడీ కిరణ్‌కుమార్‌, పీఆర్‌ఈఈ సుధాకర్‌, వ్యవసాయశాఖ జేడీ త్రినాథ్‌స్వామి, ఏడీ జగన్‌మోహన్‌రావు, ఎంపీడీవో రేణుక, డీఎస్పీ లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 02 , 2025 | 12:18 AM