Share News

జిల్లా అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం

ABN , Publish Date - Nov 06 , 2025 | 12:16 AM

జిల్లాను అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు కట్టుబడి ఉన్నామని కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు, రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు.

 జిల్లా అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం
మాట్లాడుతున్న కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు, చిత్రంలో రాష్ట్ర మంత్రులు అచ్చెన్నాయుడు, శ్రీనివాస్‌

- కేంద్ర, రాష్ట్ర మంత్రులు రామ్మోహన్‌నాయుడు, అచ్చెన్నాయుడు

- వ్యవసాయ శాఖ జేడీపై నిప్పులు చెరిగిన రవికుమార్‌

- ఎంఎస్‌ఎంఈల అభివృద్ధిపై ఎమ్మెల్యేల అసంతృప్తి

- వాడీవేడిగా జిల్లా సమీక్ష సమావేశం

శ్రీకాకుళం/కలెక్టరేట్‌, నవంబరు 5(ఆంధ్రజ్యోతి): జిల్లాను అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు కట్టుబడి ఉన్నామని కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు, రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. జిల్లా పరిషత్‌ కార్యాలయంలో బుధవారం జిల్లా ఇన్‌చార్జి మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌తో కలిసి డీఆర్సీ సమావేశం నిర్వహించారు. వ్యవసాయం, దాని అనుబంధ శాఖలు, పరిశ్రమల శాఖ, పింఛన్లు, ఎన్‌ఆర్‌ఈజీఎస్‌, ఆరోగ్యశాఖ, స్కిల్‌ డెవ లప్‌మెంట్‌ శాఖ, శానిటేషన్‌, మెడికల్‌ అండ్‌ హెల్త్‌ శాఖలపై వాడీవేడిగా చర్చ జరిగింది. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్న మాట్లాడుతూ.. ఇటీవల మొంథా తుఫాన్‌తో నష్టపోయిన ప్రతి రైతునూ ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు. ఇప్పటికే అధికారులు పంట నష్టం వివరాలను నమోదు చేస్తున్నారని వివరించారు. ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేస్తామని చెప్పారు. పలాసలో కిడ్నీ ఆసుపత్రిలో రోగులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని వైద్యులను ఆదేశించారు. మత్స్యకార తీర ప్రాంతాల్లో అభివృద్ధి పనులు చేపట్టాలని సూచించారు. గత ప్రభుత్వం తొలగించిన వితంతు పింఛన్లను పునరుద్ధరించామన్నారు. ఎంఎస్‌ఎంఈ పార్కుల్లో కొత్తగా సబ్‌స్టేషన్‌ ఏర్పాటు చేస్తామన్నారు. రాష్ట్రంలో వంద శాతం ఈక్రాప్‌ నమోదైందని, దీనికోసం ప్రభుత్వం ప్రత్యేకంగా యాప్‌ కూడా అందుబాటులోకి తీసుకువచ్చిందని వివరించారు.

అంకిత భావంతో పనిచేస్తున్నాం : మంత్రి కొండపల్లి

జిల్లాను అభివృద్ధి బాటలో నడిపించేందుకు అంకితభావంతో కృషి చేస్తున్నామని జిల్లా ఇన్‌చార్జి మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు అన్నారు. ఉపాధి కల్పన, పరిశ్రమలు, పారిశుధ్యం తదితర అంశాలపై విస్తృతంగా చర్చించారు. ముఖ్యంగా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల్లో (ఎంఎస్‌ఎంఈ పార్కులు) మౌలిక వసతులను త్వరితగతిన అందుబాటులోకి తేవాలని చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రూ.600కోట్ల వ్యయంతో పీఎంఈజీపీ, సీఎంఈజీపీ కార్యక్రమాల ద్వారా ఉపాధి కల్పించనున్నట్లు తెలిపారు. ప్రతీ ఆరు నెలలకోసారి నియోజకవర్గాల వారీగా సమీక్ష నిర్వహించాలని కలెక్టర్‌ను ఆదేశించారు. జిల్లాలో చెరకు సాగు తగ్గుతోందని, ఈ విషయంపై తగు చర్యలు తీసుకోవాలని అన్నారు.

ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ బిల్లుల చెల్లింపుల సమస్యను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానని ఈ సందర్భంగా కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు భరోసా ఇచ్చారు. పూర్తయిన పనులకు కూడా బిల్లులు చెల్లించకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని, త్వరలోనే సమస్య పరిష్కారం అవుతుందన్నారు. స్వర్ణాంధ్ర - 2047 లక్ష్యాలను చేరుకునేలా శ్రీకాకుళాన్ని అభివృద్ధి చేస్తామని తెలిపారు.

సమాచారం కూడా లేకుండా ఎలా వస్తారు?: రవికుమార్‌

వ్యవసాయ శాఖ జేడీ పనితీరుపై ఆమదాలవలస ఎమ్మెల్యే, పీయుసీ ఛైర్మన్‌ కూన రవికుమార్‌ నిప్పులు చెరిగారు. జిల్లా సమీక్ష సమావేశానికి కనీస సమాచారం కూడా తీసుకురాకుండా ఎలా వస్తారని ప్రశ్నించారు. అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్‌ పథకానికి సంబంధించి 47వేలమంది రైతులు జిల్లా సమాచారంలో తక్కువగా ఉన్నారని అన్నారు. ఇంత నిర్లక్ష్యంగా ఎలా పనిచేస్తారని నిలదీశారు. ఆమదాలవలస సుగర్‌ ఫ్యాక్టరీకి 250 కోట్ల విలువైన 75 ఎకరాల భూమి ఉంది. ఏపీఐఐసీ ద్వారా దీనిని అభివృద్ధి చేస్తే మంచి ఫలితాలు వస్తాయని సూచించారు.

- శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్‌ మాట్లాడుతూ.. శ్రీకాకుళం ఎంఎస్‌ఎంఈ పార్క్‌లో భాగంగా ప్లాటెడ్‌ ఫ్యాక్టరీ కాంప్లెక్స్‌లో గ్రౌండ్‌ ఫ్లోర్‌ మాత్రమే పెడుతున్నారని.. మరో రెండు ఫ్లోర్లు నిర్మించుకునే అవకాశాల్ని కూడా పరిశీలించాలని కోరారు.

- ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఎన్‌.ఈశ్వరరావు మాట్లాడుతూ.. గ్రామస్థాయి సచివాలయ సిబ్బందిని సంబంధిత ఎమ్మెల్యేల దృష్టిలో పెట్టకుండా వారిని ఓడీ డెప్యుటేషన్‌పై మరొక చోట వేస్తున్నారని, దీనివల్ల సేవలకు అంతరాయం ఏర్పడుతుందని తెలిపారు.

- పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష మాట్లాడుతూ... ఉద్దానంలో కిడ్నీ వ్యాధులపై మరోమారు సర్వే జరిపించాలని కోరారు. అత్యవసరంగా కిడ్నీ ఆసుపత్రి కోసం ప్రత్యేకంగా ఉద్దానం ప్రాజెక్టు నుంచి పైపులైన్‌ వేసి నీరు అందించాలని కోరారు.

- పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు మాట్లాడుతూ.. అటవీ ప్రాంతాల్లో ఉపాధి హామీ పథకం పనుల కింద రోడ్లు వేయడానికి అనుమతుల పెండింగ్‌ ఉన్నాయని, దీనిపై చర్యలు తీసుకోవాలని కోరారు.

- మెళియాపుట్టి, పలాస మండలం, రామకృష్ణాపురం, ఎచ్చెర్ల మండలంలో ఎంఎస్‌ఎంఈ అభివృద్ధిలో తీవ్ర నిర్లక్ష్యం కనిపిస్తోందని, గత ఆరు నెలలుగా అధికారులు ఆ వైపు కూడా చూడడం లేదని పలువురు ఎమ్మెల్యేలు విమర్శించారు. పారిశ్రామికవేత్తలు సిద్ధంగా ఉన్నారని, కనీసం రోడ్లు అయినా వేస్తే వారు ముందుకు వస్తారన్నారు. అలాగే ప్రతీ ఎంఎస్‌ఎంఈ వద్ద ఒక 33 కేవీ సబ్‌స్టేషన్‌ ఏర్పాటు చేయాలని వారు కోరారు. ఈ సమీక్షలో విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ప్రభుత్వ విప్‌, ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్‌, నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి, ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసనాయుడు, కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌, డీసీఎంఎస్‌ చైర్మన్‌ చౌదరి అవినాష్‌, అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Nov 06 , 2025 | 12:16 AM