Share News

Rain water: నీటిలెక్క తప్పుతోంది

ABN , Publish Date - May 31 , 2025 | 12:22 AM

Water mismanagement నైరుతి రుతుపవనాలు రాకతో జిల్లాలో వర్షాలు కురుస్తున్నాయి. వర్షపు నీటి ఆధారంగానే పంటలు వేస్తారు. కరువు ప్రాంతాలు లెక్కిస్తారు. బాధిత రైతులకు పరిహారం చెల్లిస్తారు. కాగా.. ఈ వర్షపునీటి లెక్క తప్పుతోంది. వర్షపు నీటి ప్రామాణికాన్ని లెక్కించేందుకుగానూ ఏర్పాటు చేసిన ఆటోమెటిక్‌ వెదర్‌ స్టేషన్ల నిర్వహణను వైసీపీ ప్రభుత్వ పాలనలో గాలికొదిలేశారు.

Rain water: నీటిలెక్క తప్పుతోంది
మెళియాపుట్టి తహసీల్దార్‌ కార్యాలయంలో ఆటోమెటిక్‌ వెదర్‌ స్టేషన్‌

  • జిల్లాలో పనిచేయని ఆటోమేటిక్‌ వెదర్‌ స్టేషన్లు

  • వైసీపీ పాలనలో నిర్వహణకు నోచుకోని వైనం

  • కేంద్రాలు పునరుద్ధరించాలని రైతుల విజ్ఞప్తి

  • గతేడాది మెళియాపుట్టి మండలం కరజాడ ప్రాంతంలోని సుమారు పది పంచాయతీల్లో వర్షాలు లేక వరి పంటకు నష్టం వాటిల్లింది. మెళియాపుట్టిలో ఆటోమెటిక్‌ వెదర్‌ స్టేషన్‌ను ఏర్పాటు చేశారు. ఇక్కడ బాగా వర్షాలు కురవడంతో మెళియాపుట్టి ప్రాంతాన్ని ప్రామాణికంగా తీసుకుని.. కరజాడ ప్రాంతంలో పంటలు నష్టపోయినా కరువు ప్రాంతంగా నమోదు చేయలేదు. దీంతో కనీస పరిహారం అందక రైతులు నష్టపోయారు. మండలం మొత్తం ఒకే ప్రామాణికంగా తీసుకోవడం వల్ల ఇటువంటి పరిస్థితి వచ్చిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

    ............................

  • మెళియాపుట్టి, మే 30(ఆంధ్రజ్యోతి): నైరుతి రుతుపవనాలు రాకతో జిల్లాలో వర్షాలు కురుస్తున్నాయి. వర్షపు నీటి ఆధారంగానే పంటలు వేస్తారు. కరువు ప్రాంతాలు లెక్కిస్తారు. బాధిత రైతులకు పరిహారం చెల్లిస్తారు. కాగా.. ఈ వర్షపునీటి లెక్క తప్పుతోంది. వర్షపు నీటి ప్రామాణికాన్ని లెక్కించేందుకుగానూ ఏర్పాటు చేసిన ఆటోమెటిక్‌ వెదర్‌ స్టేషన్ల నిర్వహణను వైసీపీ ప్రభుత్వ పాలనలో గాలికొదిలేశారు. తూతూమంత్రంగా లెక్కలు వేసి.. బాధితులకు మొక్కుబడిగా పరిహారం చెల్లించారనే ఆరోపణలు ఉన్నాయి. జిల్లాలో పాతపట్నం, హిరమండలం, టెక్కలిలో మూడు భారత వాతావరణ శాఖ ఇండియా మెఽథరాలజికల్‌ డిపార్ట్‌మెంట్‌(ఐఎండీ) కేంద్రాలు ఉన్నాయి. వీటితోపాటు 116 ఆటోమేటిక్‌ వెదర్‌ స్టేషన్లు (ఏడబ్ల్యూఎస్‌) ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాల ప్రకారం ప్రతీ ఐదు కిలోమీటర్లకు ఒక ఏడబ్ల్యూఎస్‌ ఏర్పాటు చేయాలి. కానీ జిల్లాలో మండలానికి రెండు.. మూడు మాత్రమే ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాల్లో యంత్రాలు ద్వారా గాలిలో ఉష్ణోగ్రతలు, గాలి వీచే దిశ, వేగం, భూమిలో తేమ, వర్షపాతం లెక్క అంచనా వేయవచ్చు. రోజూ ఉదయం 8 గంటలకు వర్షపాతం వివరాలు నమోదు చేస్తారు. 2.5 మిల్లీమీటర్లు కురిస్తే.. ఒక రైయినీ డేగా కొలుస్తారు. 2.4 మిల్లీమీటర్లు నమోదైనా.. వర్షం కురిసిన రోజుగా లెక్కలోకి తీసుకోరు. ఆశించినస్థాయిలో వర్షపాతం నమోదు కాని ప్రాంతాలను కరువుగా గుర్తిస్తారు. దాని ఆధారంగానే రైతులకు పంట నష్ట పరిహారం కూడా దక్కుతుంది. కాగా ప్రస్తుతం ఈ కేంద్రాల్లో యంత్రాలు సక్రమంగా పనిచేయడం లేదు. గత వైసీపీ ప్రభుత్వం వీటి నిర్వహణకు నిధులు మంజూరు చేయకపోవడంతో యంత్రాలు మరమ్మతులకు గురయ్యాయి. ఇంజనీరింగ్‌ సిబ్బందికి కూడా సకాలంలో జీతాలు చెల్లించకపోవడంతో వీటి నిర్వహణను వదిలేశారు. దీంతో ఈ యంత్రాలు ఎక్కడ పనిచేస్తున్నాయో.. తెలియని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో తుఫాన్ల సమయంలో వాతావరణంలో మార్పులను అంచనా వేసి ముందస్తు చర్యలు చేపట్టేందుకు అధికారులు ఇబ్బందులు పడుతున్నారు. తహసీల్దార్‌ కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన పాతకాలం నాటి రెయిన్‌గేజ్‌లపైనే ఆధారపడి వర్షపాతం లెక్కలు వేస్తున్నారు. దీని ఆధారంగా పంట నష్ట పరిహారాన్ని అందజేస్తున్నారు. కాగా.. ఈ లెక్కలు సరిగా లేక చాలామందికి పరిహారం అందడం లేదనే రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత ప్రభుత్వం స్పందించి ఆటోమెటిక్‌ వెదర్‌ స్టేషన్లను పునరుద్ధరించాలని రైతులు కోరుతున్నారు. యంత్రాల మరమ్మతులు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు. వర్షపాతం వివరాలను మండలం ప్రామాణికంగా కాకుండా.. ప్రాంతాల వారీగా తీసుకుని లెక్కకడితే బాధితులకు న్యాయం జరుగుతుందని పేర్కొంటున్నారు.

  • ఈ విషయమై మెళియాపుట్టి ఏఎస్‌వో మనోహర్‌రావు వద్ద ప్రస్తావించగా.. ‘ఐఎండీ ఏర్పాటు చేసిన ఇంజనీర్లకు గతంలో సకాలంలో జీతాలు అందక రావడం లేదు. నిర్వహణకు నిధులు లేక ఇబ్బందులు పడుతున్నాం. ప్రభుత్వం దృష్టికి మరోసారి సమస్యను తీసుకెళ్తామ’ని తెలిపారు.

  • పరిహారం అందడం లేదు

    ఏటా వర్షాలు లేక పంటలు పోతున్నా ప్రభుత్వం నుంచి నష్ట పరిహారం అందడం లేదు. మండల యూనిట్‌గా వర్షపాతం వివరాలు నమోదు చేయడం వల్ల.. చాలామంది రైతులు నష్టపోతున్నారు.

    - పదనాపురం కృష్ణారావు, రైతు, దీనబందుపురం

    ..................

  • కరువు ప్రాంతంగా గుర్తింపు లేదు

    రెండేళ్లుగా నీరు లేక వరి పంటలు ఎండిపోయినా కరువు ప్రాంతంగా గుర్తించడం లేదు. మెళియాపుట్టిలో అధికంగా వర్షాలు కురిశాయి. మా ప్రాంతంలో మాత్రం ఆశించినస్థాయిలో కురవకపోయినా.. మెళియాపుట్టి కేంద్రంలో వర్షపాతాన్ని పరిగణనలోకి తీసుకోవడంతో ఈ పరిస్థితి కనిపిస్తోంది. ప్రతీ ఐదుకిలోమీటర్లకు ఒక రైన్‌ గేజ్‌ ఏర్పాటు చేయాలి.

    - షణ్ముఖరావు, రైతు, చీపురుపల్లి

Updated Date - May 31 , 2025 | 12:22 AM