పోర్టు పునరావాస కేంద్రం సందర్శన
ABN , Publish Date - Jun 23 , 2025 | 11:52 PM
మూలపేట పోర్టు నిర్వాసిత గ్రామమైన విష్ణుచక్రం గ్రామస్థులు ఉంటున్న పునరావాస కాలనీని తహసీల్దార్ హేమ సుందరరావు సోమవారం సందర్శించారు.
సంతబొమ్మాళి, జూన్ 23(ఆంధ్రజ్యోతి): మూలపేట పోర్టు నిర్వాసిత గ్రామమైన విష్ణుచక్రం గ్రామస్థులు ఉంటున్న పునరావాస కాలనీని తహసీల్దార్ హేమ సుందరరావు సోమవారం సందర్శించారు. సోమవారం ‘ఆంధ్రజ్యోతి’లో ‘పునరావసంలో ఎలా బతకాలి?’ శీర్షికతో వచ్చిన కథనానికి ఆయన స్పందించారు. స్థానికు లతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నీటి సౌకర్యం, విద్యుత్ సరఫరా కల్పించామని, గోతు లతో ఉన్న చోట మట్టితో కప్పుతామన్నారు. కాలువలు లేకపోవడం వల్ల వాడుక నీరు నిల్వ ఉండిపోయి దోమలతో ఇబ్బందులు పడుతు న్నామని స్థానికులు ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. కాలనీ నుంచి నౌపడ మూడు రోడ్ల వరకు రోడ్డు అనుసంధానం చేయాలని కోరారు. పాత గ్రామంలో ఉన్న ఆలయానికి సంబంధించి రూ. 16 లక్షలు అంచనా వేశారని, ఆ మొత్తం మంజూరు చేస్తే కాలనీలో నిర్మించుకుంటా మన్నారు. ఇంకా కొంత మందికి తాత్కాలిక షెడ్లు ఇవ్వలేదని, తగు చర్యలు తీసుకోవాలని కోరారు. వీటికి స్పందించిన తహసీల్దార్.. ఇప్పటికే కాలనీలో సీసీ రోడ్లు, కాలువల నిర్మాణానికి ఇంజనీరింగ్ అధికారులు మార్కింగ్ ఇచ్చారని, త్వరలోనే పనులు చేపడతామని హామీ ఇచ్చారు. కాలనీ నుంచి నౌపడ మూడు రోడ్ల కూడలి వరకు రోడ్డు నిర్మాణం చేపడతామన్నారు. నిర్వాసితుల సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.