ఉపాధ్యాయుడ్ని చుట్టుముట్టిన గ్రామస్థులు
ABN , Publish Date - Dec 11 , 2025 | 12:11 AM
విద్యార్థిని పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారంటూ తల్లిదండ్రులతో పాటు బంధువులు ఓ ఉపాధ్యాయుడ్ని చుట్టుముట్టారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగాల్సి వచ్చింది.
విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపణ
రణస్థలం, డిసెంబరు 10(ఆంధ్రజ్యోతి): విద్యార్థిని పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారంటూ తల్లిదండ్రులతో పాటు బంధువులు ఓ ఉపాధ్యాయుడ్ని చుట్టుముట్టారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగాల్సి వచ్చింది. రణస్థలం మండలంలోని ఓ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని మూడు రోజులుగా బడికి వెళ్లడం లేదు. ఏం జరిగిందని తల్లిదండ్రులు ఆరా తీయగా ఓ ఉపాధ్యాయుడు తనపట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నట్టు చెప్పింది. దీంతో బాలిక తల్లిదండ్రులతో పాటు గ్రామస్థులు బుధవారం మధ్యాహ్నం పాఠశాలకు చేరుకుని ఇంగ్లీష్ ఉపాధ్యాయుడ్ని ప్రశ్నించారు. నిర్బంధించినంత పనిచేశారు. దీంతో హెచ్‌ఎం వెంటనే జేఆర్‌పురం ఎస్‌ఐ ఎస్.చిరంజీవికి సమాచారం ఇవ్వగా ఆయన తన సిబ్బందితో అక్కడికి చేరుకున్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇంగ్లీష్ ఉపాధ్యాయుడికి రక్షణ కల్పించారు. అక్కడినుంచి పోలీస్ జీపులో తరలించారు. దీనిపై డిప్యూటీ డీఈవో విజయకుమారి విచారణ చేపట్టారు. ఉపాధ్యాయుడి ప్రవర్తనపై ఆరాతీశారు. విద్యార్థులతో మాట్లాడి లిఖితపూర్వకంగా వివరాలు తెలుసుకున్నట్లు ఆమె తెలిపారు. ఉన్నత అధికారులకు నివేదిస్తామన్నారు. ఈ విషయాన్ని ఎస్‌ఐ చిరంజీవి వద్ద ప్రస్తావించగా తనకు ఫిర్యాదు రాలేదని తెలిపారు.