Share News

ఎరువుల దుకాణాలపై విజిలెన్స్‌ దాడులు

ABN , Publish Date - Sep 09 , 2025 | 12:23 AM

డీజీపురంలోని ఎరువుల దుకా ణాలపై సోమవారం మండల ఫెర్టిలైజర్స్‌ విజిలెన్స్‌ కమిటీ అధికారులు దాడులు చేశారు.

ఎరువుల దుకాణాలపై విజిలెన్స్‌ దాడులు
పరిశీలిస్తున్న విజిలెన్స్‌ అధికారులు

కంచిలి, సెప్టెంబరు 8(ఆంధ్రజ్యోతి): డీజీపురంలోని ఎరువుల దుకా ణాలపై సోమవారం మండల ఫెర్టిలైజర్స్‌ విజిలెన్స్‌ కమిటీ అధికారులు దాడులు చేశారు. లడ్డు కేశవ్‌పాత్రోకు చెంది న దుకాణంలో అక్రమంగా నిల్వ ఉంచిన 18 బస్తాల యూరియా, ఆర్గానిక్‌ ఎరువులు 10 బస్తాలు, కాంప్లెక్స్‌ ఎరువులు 17 బస్తాలు, గ్రోమోర్‌ ఐదు బస్తాలు, పొటాస్‌ 13 ప్యాకెట్‌ (25 కిలోలు చొప్పున)లను స్వాధీనం చేసుకున్నట్లు విజిలెన్స్‌ అధికారులు తెలిపారు. కేశవ్‌పాత్రోపైౖ 6ఏ కేసు నమోదు చేసినట్లు చెప్పారు. ఎరువులు తన సొంతానికి ఉపయోగించుకునేందుకు కొనుగోలు చేశానని, వాటికి సంబంధించి అన్ని బిల్లులు ఉన్నాయని కేశవ్‌ పాత్రో విలేకరులకు తెలిపారు. ఈ దాడుల్లో ఎస్‌ఐ పారి నాయుడు, తహసీల్దార్‌ ఎన్‌.రమేష్‌ కుమార్‌, డిప్యూటీ ఎంపీడీవో జి.వీరభద్రస్వామి, ఏవో కె.సురేష్‌ కుమార్‌ పాల్గొన్నారు.

హరిపురం, సెప్టెంబరు 8(ఆంధ్రజ్యోతి): మందస పట్టణంలోని ఎరువుల దుకాణంలో సోమవారం వ్యవసాయ అధికారులతో కలిసి విజిలెన్స్‌ ఎస్‌ఐ ఐ.రామారావు తనిఖీ చేశారు. ఎరువులు అధిక ధరలకు అమ్ముతున్నట్లు, ఒడిశా నుంచి నకిలీ ఎరువులు తెచ్చి అమ్మకాలు జరుపుతున్నట్టు వచ్చిన ఫిర్యాదుల మేరకు తనిఖీలు చేపట్టామన్నారు. రికార్డులు, స్టాక్‌ను పరిశీలించారు. ఏవో నాగరాజు, ఏఈవో ఉదయ్‌ తదితరులు పాల్గొన్నారు.

టెక్కలి, సెప్టెంబరు 8(ఆంధ్రజ్యోతి): ఎరువుల్ని అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు తప్పవని విజిలెన్స్‌ ఎస్‌ఐ బి.రామారావు హెచ్చరించారు. సోమవారం మండల వ్యవసాయాధికారి పి.శ్రీకాంత్‌వర్మ, ఏఈఈ ప్రేమ్‌కుమార్‌తో కలిసి నందిగాం, పెద్దతామరాపల్లి వద్ద గల ప్రైవేట్‌ ఎరువుల దుకాణాలను పరిశీలించారు. రికార్డుల్ని పరిశీలించి ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో వివరాలు నమోదు చేయాలని సూచించారు.

Updated Date - Sep 09 , 2025 | 12:23 AM