Share News

Vigilance : ఎరువుల బ్లాక్‌మార్కెట్‌పై విజిలెన్స్‌

ABN , Publish Date - Aug 24 , 2025 | 11:52 PM

Vigilance Inspections ఎరువుల బ్లాక్‌మార్కెట్‌పై విజిలెన్స్‌ అధికారులు నిఘా పెట్టారు. విజిలెన్స్‌ డీజీ హరీష్‌కుమార్‌ గుప్తా ఆదేశాల మేరకు శ్రీకాకుళం ప్రాంతీయ నిఘా(విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌) సిబ్బంది ఆదివారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లోని ఎరువుల దుకాణాల్లో తనిఖీ చేశారు.

Vigilance : ఎరువుల బ్లాక్‌మార్కెట్‌పై విజిలెన్స్‌
నరసన్నపేటలోని ఎరువుల దుకాణంలో తనిఖీ చేస్తున్న విజిలెన్స్‌ సిబ్బంది

మూడు జిల్లాల్లో తనిఖీలు..

విజయనగరంలో రికార్డులు సక్రమంగా లేవని నిర్ధారణ

శ్రీకాకుళం, ఆగస్టు 24(ఆంధ్రజ్యోతి) : ఎరువుల బ్లాక్‌మార్కెట్‌పై విజిలెన్స్‌ అధికారులు నిఘా పెట్టారు. విజిలెన్స్‌ డీజీ హరీష్‌కుమార్‌ గుప్తా ఆదేశాల మేరకు శ్రీకాకుళం ప్రాంతీయ నిఘా(విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌) సిబ్బంది ఆదివారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లోని ఎరువుల దుకాణాల్లో తనిఖీ చేశారు. శ్రీకాకుళం జిల్లాలో ఎనిమిది చోట్ల, విజయనగరం జిల్లాలో 9, పార్వతీపురం మన్యం జిల్లాలో 6 ప్రాంతాల్లో స్థానిక రెవెన్యూ, పోలీసు, వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి తనిఖీలు నిర్వహించారు. విజయనగరంలో శ్రీమాతా వెంకటేశ్వరరావు సన్స్‌ దుకాణంలో రికార్డులు సక్రమంగా లేకపోవడాన్ని గుర్తించారు. దుకాణంలో ఉన్న సుమారు రూ.2.47 లక్షల విలువైన 4.35 టన్నుల కాంప్లెక్స్‌ ఎరువుల విక్రయం నిలుపుదల చేయాలని సిఫారసు చేశారు. విజిలెన్స్‌ ఎస్పీ బర్ల ప్రసాదరావు మాట్లాడుతూ ఎరువుల కృత్రిమ కొరతను సృష్టించి అధిక ధరలకు విక్రయించే వ్యాపారులు, దళారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. తనిఖీల్లో విజిలెన్స్‌ ఇన్‌స్పెక్టర్‌ సతీష్‌కుమార్‌, అసిస్టెంట్‌ జియాలజిస్ట్‌ సురేష్‌కుమార్‌, అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌ ఎర్రన్నాయుడు, ఎస్‌ఐ రామారావు, రెవెన్యూ, వ్యవసాయ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Aug 24 , 2025 | 11:52 PM