Share News

Dsc certificate : రేపటి నుంచి డీఎస్సీ అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన

ABN , Publish Date - Aug 26 , 2025 | 11:51 PM

certificates Verification for Dsc మెగా డీఎస్సీ మెరిట్‌ లిస్ట్‌ అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన ఈ నెల 28న జరగనుంది. శ్రీకాకుళంలోని మహాలక్ష్మినగర్‌లో(డీఈవో కార్యాలయం వెనుక) విశ్వవిజేత జూనియర్‌ కళాశాలలో ఈ ప్రక్రియ నిర్వహణకు జిల్లా విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు చేపట్టారు.

Dsc certificate : రేపటి నుంచి డీఎస్సీ అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన

12 బృందాల ఏర్పాటు

నరసన్నపేట, ఆగస్టు 26(ఆంధ్రజ్యోతి): మెగా డీఎస్సీ మెరిట్‌ లిస్ట్‌ అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన ఈ నెల 28న జరగనుంది. శ్రీకాకుళంలోని మహాలక్ష్మినగర్‌లో(డీఈవో కార్యాలయం వెనుక) విశ్వవిజేత జూనియర్‌ కళాశాలలో ఈ ప్రక్రియ నిర్వహణకు జిల్లా విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు చేపట్టారు. ఉమ్మడి జిల్లాలో వివిధ కేటగిరిలకు చెందిన 543 మంది అభ్యర్థుల సర్టిపికెట్లను పరిశీలించనున్నారు. గురువారం ఉదయం 7 గంటల నుంచి ప్రక్రియ ప్రారంభం కానుంది. కళాశాలలో 15 గదులను సిద్ధం చేశారు. సర్టిఫికెట్ల పరిశీలన కోసం ఎంఈవోలు, గెజిటెడ్‌ హెచ్‌ఎం, డిప్యూటీ తహసీల్దార్‌, ఎంఐఎస్‌ ఆపరేటర్లతో కూడిన 12 తనిఖీ బృందాలను ఏర్పాటు చేశారు. మరో రెండు బృందాలను రిజర్వులో ఉంచారు. ప్రతీ బృందం 50 మంది అభ్యర్థుల సర్టిఫికెట్లను తనిఖీ చేసి ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌ చేయాలి. ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేసిన సర్టిఫికెట్లతో.. అభ్యర్థులు తీసుకువచ్చే కులధ్రువీకరణ పత్రాలను తహసీల్దార్లు, మిగిలిన విద్యార్హత సర్టిఫికెట్లను ఇతర బృందం సభ్యులు పరిశీలిస్తారు.

ఈ ప్రక్రియ సజావుగా సాగేందుకు విద్యాశాఖ పరిశీలకుడిని నియమించింది. అలాగే డీఈవో, డీవైఈవో, ఎగ్జామ్స్‌ ఏడీలు ప్రక్రియను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తారు. కళాశాలలో ఇంటర్‌ నెట్‌, విద్యుత్‌, తదితర సదుపాయాలకు అంతరాయం లేకుండా ఆయాశాఖ అధికారులకు కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ ఆదేశాలు జారీ చేశారు.

అభ్యర్థులు ఒరిజనల్‌ సర్టిఫికెట్లు, మూడు సెట్ల అటెస్టెడ్‌ జిరాక్స్‌ కాపీలు, కులధ్రువీకరణ, డిజేబుల్డ్‌ సర్టిఫికెట్‌, స్టడీ / రెసిడెన్షియల్‌ సర్టిఫికెట్‌, టెట్‌ మార్కుల కాపీ, డీఎస్సీ హాల్‌ టికెట్‌, ఆధార్‌ కార్డు, 5 పాస్‌పోర్టు సైజు ఫొటోలతో హాజరు కావాలి. ముందుగా అభ్యర్థి తన ఒరిజనల్‌ సర్టిఫికెట్లను వ్యక్తిగత లాగిన్‌లో స్కాన్‌ చేసి ఏపీడీఎస్సీ. ఏపీసీఎఫ్‌ఎస్‌ఎస్‌.ఇన్‌ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయాలి. అభ్యర్థితోపాటు సహాయకుడిగా లోపలకు ఒకరినే మాత్రమే అనుమతిస్తారు.

Updated Date - Aug 26 , 2025 | 11:51 PM