Share News

Vamsadhara: నేడు వంశ‘ధార’ విడుదల

ABN , Publish Date - Jul 01 , 2025 | 11:16 PM

Release of irrigation water వంశధార ప్రాజెక్టు ఎడమ ప్రధాన కాలువ ద్వారా బుధవారం సాగునీటిని విడుదల చేయనున్నారు.

Vamsadhara: నేడు వంశ‘ధార’ విడుదల
గొట్టా బ్యారేజీ వద్ద నిల్వ ఉన్న నీరు

  • హిరమండలం, జూలై 1(ఆంధ్రజ్యోతి): వంశధార ప్రాజెక్టు ఎడమ ప్రధాన కాలువ ద్వారా బుధవారం సాగునీటిని విడుదల చేయనున్నారు. జిల్లాలో వంశధార ప్రాజెక్టు ఎడమ కాలువ 104 కి.మీ. మేర విస్తరించి ఉంది. హిరమండలం, సారవకోట, జలుమూరు, పోలాకి, నరసన్నపేట, కోటబొమ్మాళి, సంతబొమ్మాళి, టెక్కలి, నందిగాం, వజ్రపుకొత్తూరు, మెళియాపుట్టి, పలాస మండలాల్లో 398 గ్రామాల్లో 1,48,200 ఎకరాలకు సాగునీరు అందిస్తోంది. క్యాచ్‌మెంట్‌ ఏరియాలో వర్షాలు పడుతుండటంతో నదిలో పుష్కలంగా నీరు చేరుతోంది. ఖరీఫ్‌ అవసరాల దృష్ట్యా కొన్నిరోజులుగా బ్యారేజీ ఎగువ ప్రాంతంలో నీటిని నిల్వ చేస్తున్నారు. మంగళవారం సాయంత్రానికి 1060 క్యూసెక్కులు ఇన్‌ఫ్లో వస్తోంది. బ్యారేజీ ఎగువ ప్రాంతంలో 38.1 మీటర్లు మేర నీటిమట్టం ఉంది. హిరమండలంలోని గొట్టాబ్యారేజీ వద్ద పాతపట్నం, నరసన్నపేట ఎమ్మెల్యేలు మామిడి గోవిందరావు, బగ్గు రమణమూర్తి, కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ చేతులమీదుగా బుధవారం ఉదయం 10 గంటలకు ఎడమ ప్రధాన కాలువ ద్వారా సాగునీటిని విడుదల చేయనున్నట్టు డీఈఈ సరస్వతి తెలిపారు.

Updated Date - Jul 01 , 2025 | 11:16 PM