Share News

Rivers connection: వంశధార, బాహుదా అనుసంధానం లేనట్టే!

ABN , Publish Date - Aug 22 , 2025 | 11:46 PM

Water being wasted into the sea వంశధార, బాహుదా నదుల అనుసంధానం కలగానే మిగులుతోంది. గత వైసీపీ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయం రైతుల పాలిట శాపంగా మారింది. హిరమండలంలోని గొట్టాబ్యారేజీ నుంచి నీరు వృథాగా సముద్రంలోకి పోతోంది.

Rivers connection: వంశధార, బాహుదా అనుసంధానం లేనట్టే!
గొట్టాబ్యారేజ్‌ నుంచి వృధాగా పోతున్న నీరు

- ఐదేళ్లు నీరుగార్చిన వైసీపీ ప్రభుత్వం

- ఏటా సముద్రంలోకి వృథాగా పోతున్న నీరు

- పెరిగిన అంచనా వ్యయం

టెక్కలి, ఆగస్టు 22(ఆంధ్రజ్యోతి): వంశధార, బాహుదా నదుల అనుసంధానం కలగానే మిగులుతోంది. గత వైసీపీ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయం రైతుల పాలిట శాపంగా మారింది. హిరమండలంలోని గొట్టాబ్యారేజీ నుంచి నీరు వృథాగా సముద్రంలోకి పోతోంది. వంశధార నది నుంచి సుమారు 97.262 టీఎంసీలను బాహుదాకు మళ్లించాలని టీడీపీ ప్రభుత్వ హయాంలో (2014- 19) సీఎం చంద్రబాబునాయుడు భావించారు. వంశధార, బాహుదా నదులను అనుసంధానం చేసి.. సుమారు 1.50 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని నిర్ణయించారు. 2018లో అప్పటి నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో సర్వే చేశారు. రూ.5కోట్ల నిధులు మంజూరు చేయగా, నీటిపారుదల శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో అధ్యయనం ప్రారంభించారు. అందులో భాగంగా 2019 మార్చిలో వంశధార, బాహుదా నదుల అనుసంధానానికి టీడీపీ ప్రభుత్వం రూ.6,400కోట్లకు ఆమోదం తెలిపింది. బెంగుళూరకు చెందిన బీఎస్‌ఆర్‌ కనస్ట్రక్షన్స్‌ టెండర్లను సైతం దక్కించుకుంది. కొద్ది రోజుల్లో సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల కావడంతో పనులకు బ్రేకులు పడ్డాయి.

వైసీపీ వచ్చిన తర్వాత

2019 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులకు కనీసస్థాయిలో నిధులు విడుదల చేయలేదు. సరికదా.. టీడీపీ ప్రభుత్వ హయాంలో 25శాతం లోపల జరిగిన కాంట్రాక్ట్‌ పనులన్నీ రద్దుచేసింది. దీంతో వంశధార, బాహుదా నదుల అనుసంధానానికి శాపంగా మారింది. ప్రస్తుతం ఈ నదులు అనుసంధానం చేయాలంటే బడ్జెట్‌ సుమారు రూ.12వేల కోట్ల అంచనాకు చేరుకుంది. కూటమి ప్రభుత్వం ఆ స్థాయిలో నిధులు కేటాయించడానికి సముఖంగా లేకపోవడంతో ప్రజాప్రతినిధులు ఎవరూ నోరుమెదపని పరిస్థితి నెలకొంది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు నీటిపారుదల శాఖ సీఈ ఈ అంశాన్ని ప్రస్తావించినప్పటికీ నిధులు సమస్య మూలంగా పక్కన పెట్టారు. మరోవైపు ఒడిశాలోని బగల్‌హతి డ్యామ్‌ నుంచి 1.5టీఎంసీల నీరు అంతరాష్ట్ర నదుల సర్దుబాటు లెక్కల ప్రకారం ఆంధ్రాకు రావాల్సి ఉన్నా ఒడిశా ప్రభుత్వం వర్షాలు పడితే తప్ప కిందకు నీరు విడిచిపెట్టదు. ఇక బాహుదా నదికి ఎగువ వర్షాలు పడితే తప్ప సాగునీరు అంతంతమాత్రంగానే చెప్పవచ్చు.

అప్పట్లో నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు వంశధారకు సంబంధించి హిరమండలం రిజర్వాయర్‌ దగ్గర ఆప్‌టెక్స్‌ స్లూయిస్‌ నిర్మాణం ప్రారంభించి 60 కాన్టూర్‌ వయా హిరమండలం, పాతపట్నం, మెళియాపుట్టి, మందస, సోంపేట, కవిటి, కంచిలి, ఇచ్ఛాపురం సమీపంలో బాహుదా నది వరకు నీటిని మరల్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ప్రస్తుతం వంశధారలో ఏడాదికి సుమారుగా 97.262టీఎంసీల నీరు వృఽథాగా సముద్రంలోకి పోతుంది. 2019-20 సంవత్సరంలో 135.866టీఎంసీలు, 2020-21లో 73.187టీఎంసీలు, 2021-22లో 53.921 టీఎంసీలు, 2022-23లో 124.186టీఎంసీలు, 2023-24లో 51.134 టీఎంసీలు, 2024-25 మే నెల వరకు 44.858టీఎంసీల నీరు వంశధార నుంచి సముద్రంలోకి వృఽథాగా పోయినట్లు నీటిపారుదల శాఖ అధికారులు లెక్కలు కట్టారు. అలా వృఽథాగా పోయే నీటిని ఈ రెండు నదులు అనుసంధానం చేస్తే ఎనిమిది మండలాల రైతులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. కూటమి ప్రభుత్వం స్పందించి వంశధార, బాహుదా నదుల అనుసంధానంపై దృష్టి సారించాలని రైతులు కోరుతున్నారు. ఈ విషయమై వంశధార ఈఈ బి.శేఖరరావు వద్ద ‘ఆంధ్రజ్యోతి’ ప్రస్తావించగా తాజాగా ఎటువంటి ప్రతిపాదనలు చేపట్టలేదని తెలిపారు.

Updated Date - Aug 22 , 2025 | 11:46 PM