Share News

సుపరిపాలనకు మార్గదర్శి వాజపేయి

ABN , Publish Date - Dec 20 , 2025 | 12:25 AM

Vajpayee's statue unveiled ‘దేశంలో సుపరిపాలనకు మార్గనిర్దేశం చేసిన వ్యక్తి దివంగత నేత అటల్‌ బిహారీ వాజపేయి. ఆయన విధానాలే దేశాభివృద్ధికి పునాది వేశాయ’ని రాష్ట్రమంత్రులు అచ్చెన్నాయుడు, సత్యకుమార్‌ యాదవ్‌ పేర్కొన్నారు.

సుపరిపాలనకు మార్గదర్శి వాజపేయి
వాజ్‌పేయి విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పిస్తున్న మంత్రి అచ్చెన్నాయుడు

  • 25 ఏళ్ల కిందటే పీపీపీ విఽధానంలో రోడ్ల నిర్మాణం

  • రాష్ట్రమంత్రులు అచ్చెన్నాయుడు, సత్యకుమార్‌ యాదవ్‌

  • ఘనంగా ‘అటల్‌జీ’ విగ్రహావిష్కరణ

  • అరసవల్లి, డిసెంబరు 19(ఆంధ్రజ్యోతి): ‘దేశంలో సుపరిపాలనకు మార్గనిర్దేశం చేసిన వ్యక్తి దివంగత నేత అటల్‌ బిహారీ వాజపేయి. ఆయన విధానాలే దేశాభివృద్ధికి పునాది వేశాయ’ని రాష్ట్రమంత్రులు అచ్చెన్నాయుడు, సత్యకుమార్‌ యాదవ్‌ పేర్కొన్నారు. వాజ్‌పేయి శతజయంతి ఉత్సవాల సందర్భంగా శుక్రవారం శ్రీకాకుళంలో సూర్యమహల్‌ జంక్షన్‌ వద్ద వాజ్‌పేయి విగ్రహాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్‌ మాధవ్‌తో కలిసి మంత్రులు ఆవిష్కరించారు. వాజ్‌పేయి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ నేటి ఆధునిక భారతదేశ పురోగతికి బలమైన పునాదులు వేసిన వ్యక్తి వాజపేయి అని కొనియాడారు. ‘నీతి, నిజాయితీ, దేశభక్తియుత సేవలతో ఆయన రాజకీయ నాయకులకు, దేశ యువతకు వాజపేయి ఆదర్శంగా నిలిచారు. 25 ఏళ్ల క్రితమే పీపీపీ విధానంలో స్వర్ణచతుర్భుజి పేరుతో దేశవ్యాప్తంగా హైవేలను, రహదారులను, గ్రామాలకు అనుసంధానం చేస్తూ రోడ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. దేశ అభివృద్ధిలో నేడు అది ఎంతో ప్రముఖ పాత్ర వహించింది. రెండున్నర దశాబ్దాల క్రితం పీపీపీ విధానంలో రోడ్లు, విమానాశ్రయాలు, పోర్టులు, హైవేల నిర్మాణం ప్రారంభించారు. నేడు మౌలిక వసతుల కల్పనతో దేశం, రాష్ట్రాలు ఎంతో పురోగతి సాధించాయి. ఆరోజు నిర్మించిన రోడ్ల కారణంగానే నేడు కొద్ది గంటల్లోనే మనం విశాఖపట్నం నుంచి ఇచ్ఛాపురం వరకు సజావుగా ప్రయాణించగలుగుతున్నామ’ని మంత్రులు తెలిపారు.

  • వాజపేయి జీవితం.. దేశానికే అంకితం : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్‌ మాధవ్‌

  • జీవితంలో 70 ఏళ్లను దేశసేవ కోసం అంకితం చేసిన మచ్చలేని నాయకుడు, ఆదర్శమూర్తి, సహృదయుడు, అజాతశత్రువు దివంగత ప్రధాని అటల్‌ బిహారీ వాజపేయి అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్‌ మాధవ్‌ అన్నారు. శ్రీకాకుళంలోని ఎన్టీఆర్‌ మునిసిపల్‌ పాఠశాల మైదానంలో నిర్వహించిన మహాసభ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్‌ మాట్లాడుతూ.. ‘వాజపేయి.. మహోన్నత వ్యక్తి. దేశంలో తొలిసారిగా కాంగ్రెసేతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. 1996లో తొలి అణుపరీక్షలు నిర్వహించి, ప్రపంచ దేశాల సరసన భారతదేశాన్ని సగర్వంగా తలెత్తుకునేలా చేశారు. 11సార్లు పార్లమెంట్‌కు ఎన్నికై.. వాక్చాతుర్యం, సత్ప్రవర్తనతో ప్రతిపక్షాల గౌరవాన్ని కూడా పొందిన మహోన్నతుడు. పార్లమెంట్‌లో వాజ్‌పేయి ప్రసంగానికి నాటి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ ముగ్ధులై ‘ఈ యువకుడు దేశ భావి ప్రధాని అవుతాడు’ అని కితాబు ఇచ్చారు. 1998లో పార్లమెంట్‌లో వాజ్‌పేయి చేసిన ప్రసంగం నేటి రాజకీయ నాయకులకు ఒక పాఠం వంటిది. అందరూ అది వినాలి. వాజపేయి ఆశయ సాధనే లక్ష్యంగా నేడు ప్రధాని నరేంద్రమోదీ వికసిత్‌ భారత్‌-2047 వైపుగా అడుగులు వేస్తున్నారు. రక్షణ రంగంలో, టెక్నాలజీలో మనం ప్రపంచానికి మార్గనిర్దేశం చేసే దిశగా పయనిస్తున్నాం. వాజపేయి కలలు, ఆశయాలకు అనుగుణంగా వికసిత్‌ భారత్‌ లక్ష్యాలను చేరుకునేందుకు అందరం కృషి చేద్దామ’ని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - Dec 20 , 2025 | 12:25 AM