Share News

టీకా.. ఆరోగ్యానికి రక్ష

ABN , Publish Date - Nov 09 , 2025 | 10:58 PM

వ్యాధుల నుంచి జీవితాంతం రక్షణ పొందాలంటే వ్యాధి నిరోధక టీకాలు తప్పనిసరిగా వేయించాలి.

 టీకా.. ఆరోగ్యానికి రక్ష

- గర్భిణులు, పిల్లలకు తప్పనిసరి

- ప్రభుత్వాసుపత్రుల్లో సరిపడ నిల్వలు

- ప్రతి శని, బుధవారాల్లో ఉచితంగా వేస్తారు

- నేడు ప్రపంచ టీకాల దినోత్సవం

నరసన్నపేట, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి): వ్యాధుల నుంచి జీవితాంతం రక్షణ పొందాలంటే వ్యాధి నిరోధక టీకాలు తప్పనిసరిగా వేయించాలి. గర్భిణుల నుంచి శిశువుల వరకూ ప్రభుత్వం సూచించిన సమయాల్లో టీకాలు వేయిస్తే వ్యాధులు దరిచేరకుండా ఆరోగ్యకరమైన జీవితం గడపొచ్చు. అయితే గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు సరైన అవగాహన లేక టీకాలు వేయించుకోవడం లేదు. దీనివల్ల వివిధ రకాల వ్యాధులకు గురవుతున్నారు. ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న వ్యాధినిరోధన టీకాలపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లోనూ ప్రతి శని, బుధవారాల్లో గర్భిణులు, చిన్నారులకు ఉచితంగా టీకాలు వేస్తున్నారు. జిల్లాలో శ్రీకాకుళం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రితో పాటు టెక్కలి జిల్లా ఆసుపత్రి, నరసన్నపేట ఏరియా ఆసుపత్రి, సీహెచ్‌సీలు, పీహెచ్‌సీలు, గ్రామీణ క్లినిక్‌లో టీకాలు వేస్తున్నారు.

వ్యాక్సిన్‌లు ఇలా..

- గర్భిణులకు మూడునెలలు నిండిన తరువాత ఒక టీటీ ఇంజెక్షన్‌, మరో నెలరోజుల వ్యవధిలో మరో టీటీ ఇంజెక్షన్‌ వేయాలి. వీటితో పాటు ఐరన్‌, పోలిక్‌, కాల్షియం టాబ్లెట్లు ఇస్తారు.

- అప్పుడే పుట్టిన చిన్నారికి 24 గంటల వ్యవధిలో పోలియో చుక్కలు, హైపటైటీస్‌-బీ డోసు వేయాలి. వీటివల్ల పోలియో, పచ్చకామెర్ల వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుంది. 14రోజుల వ్యవధిలో క్షయ రాకుండా బీసీజీ టీకా వేయించాలి. 6-14 వారాల్లో ఐపీవీ చుక్కలు వేయించాలి.

- 6,10,14 వారాల వ్యవధిలో పోలియో చుక్కలు, పెంటా వాలెంట్‌ వేయించాలి. వీటివల్ల కోరింత దగ్గు, కంఠసర్పి, ధనుర్వాతం, మెదడువాపు, పచ్చకామెర్లు వంటి వ్యాధుల నుంచి చిన్నారిని కాపాడుకోవచ్చు.

- తొమ్మిది నెలల నుంచి 12 నెలల వ్యవధిలో తట్టు వ్యాధి రాకుండా మీజల్స్‌, కంటి, చర్మ వ్యాధులు రాకుండా విటమిన్‌-ఏ చుక్కలు వేయించాలి. తొమ్మిది నెలల నుంచి ఐదేళ్ల వయసు వరకూ ప్రతి ఆరు నెలలకు ఒకసారి విటమిన్‌-ఏ చుక్కలు మొత్తం తొమ్మిది డోసులు ఇప్పించాలి.

- 16 నెలల నుంచి 2నెలల వ్యవధిలో బూస్టర్‌ డోసు డీపీటీ, మీజల్స్‌, విటమిన్‌-ఏ, ఓపీని వేయించాలి.

- ఐదేళ్లు పూర్తయిన తరువాత డీపీటీ డోసు వేయించాలి. 10ఏళ్లకు, 16 ఏళ్లకు టెట్నాస్‌ (టీటీ ) చేయించాలి.

టీకాలు తప్పనిసరి

గర్భిణులు , చిన్నారులకు నిర్దేశించిన సమయంలో వ్యాధి నిరోధక టీకాలు తప్పనిసరిగా వేయాలి. వీటివల్ల ప్రాణాంతక వ్యాధుల నుంచి చిన్నారులను కాపాడుకోచ్చును. గ్రామీణ ప్రాంత ప్రజలకు టీకాలపై అవగాహన కల్పిస్తున్నాం.

-దుంగ సుధారాణి, వైద్యురాలు, బొంతు, ప్రాథమిక ఆరోగ్యకేంద్రం, సారవకోట

Updated Date - Nov 09 , 2025 | 10:58 PM