Share News

No Uria: యూరియా.. ఏదయ్యా?

ABN , Publish Date - Aug 11 , 2025 | 12:03 AM

Shortage of urea supply జిల్లాలో యూరియా లభించక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం రైతు సేవా కేంద్రాలు(ఆర్‌ఎస్‌కే), సహకార సంఘాల ద్వారా యూరియాను అరకొరగా సరఫరా చేయడంతో ఈ పరిస్థితి నెలకొంది.

No Uria: యూరియా.. ఏదయ్యా?

జిల్లాలో తీవ్ర కొరత

ఆర్‌ఎస్‌కేలు, సహకార సంఘాల ద్వారా అరకొరగా సరఫరా

ప్రైవేట్‌ వ్యాపారులను ఆశ్రయిస్తున్న రైతులు

కాంప్లెక్స్‌ ఎరువులు కొంటేనే యూరియా, డీఏపీ ఇస్తామంటున్న వైనం

అధిక ధరలకు విక్రయం

అదును దాటిపోతుండడంతో అన్నదాతల్లో ఆందోళన

నరసన్నపేట/ఇచ్ఛాపురం, ఆగస్టు 10(ఆంధ్రజ్యోతి):

నరసన్నపేట మండలం కామేశ్వరిపేటకు చెందిన ఒక రైతు ఇటీవల నరసన్నపేటలోని ఓ ఎరువుల దుకాణం వద్దకు వెళ్లి యూరియా, డీఏపీ కావాలని అడిగాడు. తన వద్ద యూరియా, డీఏపీ స్టాక్‌ లేదని, కావాలంటే 20.20.0.13 రకం ఎరువు ఉందని షాపు యాజమాని చెప్పాడు. దీంతో ఆ రైతు తప్పనిసరి పరిస్థితుల్లో 20.20.0.13 రకం ఎరువును తీసుకెళ్లాడు.

నరసన్నపేట మండలం కంబకాయి గ్రామానికి చెందిన ఓ రైతు యూరియా కోసం ఇటీవల స్థానిక ఓ ఎరువుల దుకాణం వద్దకు వెళ్లాడు. యూరియా, డీఏపీ కావాలని అడిగితే జింక్‌, గుళికలు కొనుగోలు చేస్తే వాటిని ఇస్తామని షాపు యజమాని చెప్పాడు. అదేంటని ప్రశ్నిస్తే.. కొంటే కొను.. లేదంటే వెళ్లిపో.. అని ఆ రైతుతో యజమాని దురుసుగా ప్రవర్తించాడు.

జిల్లాలో యూరియా లభించక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం రైతు సేవా కేంద్రాలు(ఆర్‌ఎస్‌కే), సహకార సంఘాల ద్వారా యూరియాను అరకొరగా సరఫరా చేయడంతో ఈ పరిస్థితి నెలకొంది. దీంతో రైతులు ప్రైవేట్‌ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. వారు అధిక ధరలకు విక్రయిస్తున్నారు. పైగా కాంప్లెక్స్‌ ఎరువులు కొంటేనే యూరియా, డీఏపీ ఇస్తామని షరతు పెడుతున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో రైతులు వాటిని కొనుగోలు చేస్తున్నారు. ఒకపక్క యూరియా దొరక్కపోవడం.. మరోపక్క అదును దాటిపోతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

ఇదీ పరిస్థితి..

ఈ ఏడాది జిల్లాలో సుమారు 4,42,775 ఎకరాల్లో వివిధ పంటలను రైతులు సాగు చేస్తున్నారు. ఇందులో 3,41,775 ఎకరాల్లో వరి సాగు అవుతోంది. జిల్లాలో 30 మండలాల్లోని రైతు సేవా కేంద్రాల ద్వారా యూరియా, కాంప్లెక్స్‌ ఎరువులు సుమారు 25వేల మెట్రిక్‌ టన్నులు రైతులకు పంపిణీ చేశారు. వీటిలో యూరియా 10వేల మెట్రిక్‌ టన్నులు మాత్రమే. వరి పంటకు సంబంధించి ఎకరాకు మూడు విడతలుగా 50 కేజీల వరకు యూరియా అవసరం. ఈ లెక్కన జిల్లాలో సాగు చేస్తున్న 3,41,775 ఎకరాల వరికి 35 వేల మెట్రిక్‌ టన్నుల వరకు యూరియా అవసరం ఉంటుంది. కానీ, అధికారులు కేవలం 10వేల మెట్రిక్‌ టన్నుల యూరియాను మాత్రమే పంపిణీ చేశారు. దీంతో 25వేల మెట్రిక్‌ టన్నుల కొరత ఉండడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నరసన్నపేట మండలంలో సుమారు 7వేల ఎకరాల్లో వరి సాగు చేస్తుండగా యూరియా 589 మెట్రిక్‌ టన్నులు, డీఏపీ 220 మెట్రిక్‌ టన్నులు, గ్రోమర్‌ 10 మెట్రిక్‌ టన్నులు మాత్రమే రైతు సేవా కేంద్రాల ద్వారా అన్నదాతలకు పంపిణీ చేశారు. సరిపడా యూరియా లేక రైతులు ప్రైవేట్‌ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. ఇదే అదునుగా కొందరు వ్యాపారులు దోపిడీకి పాల్పడుతున్నారు. యూరియా కావాలంటే.. జింక్‌, దుబ్బు గుళికలు, పోటాస్‌ తదితర కాంప్లెక్స్‌ ఎరువులను కొనాల్సిందేనని షరతులు పెడుతున్నారు. పైగా వాటిని అధిక ధరలకు విక్రయిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. రైతుసేవా కేంద్రాల్లో 45 కిలోల యూరియా బస్తా రూ.275కు అందించారు. అదే యూరియా బస్తాను ప్రైవేట్‌ వ్యాపారులు రూ.350 నుంచి రూ.400 వరకు అమ్ముతున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో రైతులు అధిక ధర వెచ్చించి యూరియాను కొనుగోలు చేస్తున్నారు.

గోడౌన్లలో స్టాక్‌..

జిల్లాలోని ప్రతీ ఎరువుల దుకాణానికి వారానికి ఒకసారి లారీ లోడ్‌ యూరియా వస్తుంది. దీన్ని వ్యాపారులు తమ దుకాణాల్లో దించకుండా, అనుమతి లేని గోడౌన్‌లలో నిల్వ చేస్తున్నారు. కొన్ని బస్తాలను మాత్రమే దుకాణాల్లో ఉంచుతున్నారు. దీంతో యూరియా కావాలని దుకాణాలకు వెళ్తున్న రైతులకు స్టాక్‌ తక్కువగా ఉందని ఆ బస్తాలను చూపించి అధిక ధరలకు విక్రయిస్తున్నారు. రెగ్యులర్‌గా తమ వద్ద ఎరువులు, పురుగు మందులు కొనుగోలు చేసే రైతులకు మాత్రం తక్కువ ధరకు ఇస్తున్నారు. ఆర్‌ఎస్‌కేలు, సహకార సంఘాలు యూరియా తెప్పించడం లేదని, పరిస్థితి ఇంత తీవ్రంగా ఉన్నా అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు వాపోతున్నారు.

పూర్తికాని ఉబాలు..

పలాస, ఇచ్ఛాపురం నియోజకవర్గాల్లో ఇంకా ఉబాలు పూర్తికాలేదు. ఈ రెండు నియోజకవర్గాలకు వర్షాధారమే. పలాస, వజ్రపుకొత్తూరు మండలాలకు వంశధార ఎడమ కాలువ ఉంది. కానీ, శివారు ఆయకట్టుగా ఉండడంతో ఎప్పుడు నీరు వస్తుందో? ఎప్పుడు రాదో? తెలియని పరిస్థితి. ఇచ్ఛాపురం, కంచిలి, సోంపేటలో అరకొరగా ఉబాలు పూర్తయ్యాయి. మెట్ట ప్రాంతాలుగా ఉన్న లావేరు, రణస్థలంలో సైతం ఇంతవరకూ ఉబాలు జరగలేదు. శ్రీకాకుళం, నరసన్నపేట, ఆమదాలవలస, పాతపట్నం నియోజకవర్గాల్లో మాత్రమే వరి నాట్లు వేయడం పూర్తయింది. టెక్కలిలో సగం వరకూ జరిగాయి. వరి నాట్లు పూర్తయిన చోట యూరియాతోపాటు డీఏపీ అవసరం అవుతోంది. కానీ, అవి దొరకడం లేదు. దీంతో యూరియా వినియోగానికి అదును దాటిపోతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

కొరత లేదు

జిల్లాలో ఎరువుల కొరత లేదు. డీఏపీ ముందుగానే తెప్పించాం. ఎక్కడకు యూరియా అవసరమో అక్కడికే పంపిస్తున్నాం. ఎరువుల విషయంలో అదనంగా వసూలు చేసే వ్యాపారులపై చర్యలు తీసుకుంటాం. ప్రతీ రైతుకి అవసరానికి తగ్గట్టు ఎరువులను అందిస్తాం. ఆందోళన చెందాల్సిన పనిలేదు. ప్రస్తుతం డీఏపీ పూర్తిస్థాయిలో అందుబాటులో లేనప్పటీకీ బాస్పరం, నత్రజని కలిపి కాంప్లెక్స్‌ ఎరువులు అందిస్తున్నాం. పూర్తిస్థాయిలో వర్షాలు లేనందున ఎక్కువ శాతం వరినాట్లు కాలేదు. ప్రస్తుతం సమస్య లేకుండా చర్యలు తీసుకుంటున్నాం.

- పి.భవానీ శంకరరావు, వ్యవసాయ శాఖ ఏడీ, సోంపేట

Updated Date - Aug 11 , 2025 | 12:03 AM