పంచాయతీ ఉద్యోగులకు అప్‌గ్రేడ్
ABN , Publish Date - Oct 12 , 2025 | 11:21 PM
Panchayat employees divided into four categories పంచాయతీరాజ్ ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం తీపికబురు చెప్పింది. పంచాయతీల పునర్నిర్మాణం.. పునర్ వర్గీకరణకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. 10 రకాల సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. దీపావళి కానుకగా పంచాయతీలను నాలుగు గ్రేడ్‌లుగా విభజించి ఉద్యోగులకు పదోన్నతులు కల్పిస్తున్నట్లు శుక్రవారం జరిగిన కేబినెట్‌లో సమావేశంలో ప్రకటించింది.
నాలుగు కేటగిరీలుగా విభజన
పదోన్నతుల కల్పనకు శ్రీకారం
మంత్రివర్గ ఆమోదంపై హర్షం
మెళియాపుట్టికి చెందిన అజిత్‌కుమార్ మిశ్రా అనే వ్యక్తి 24 ఏళ్ల కిందట పంచాయతీరాజ్ శాఖలో టైపిస్టుగా ఉద్యోగంలో చేరారు. రెండేళ్ల కిందట ఆయన సీనియర్ సహాయకులుగా పదోన్నతి పొందారు. సీనియర్ సహాయకుడి స్థాయికి ఎదగడానికి ఆయనకు 22 ఏళ్ల సమయం పట్టింది. ఇకనుంచి ఈ పరిస్థితి మారనుంది. పంచాయతీరాజ్ ఉద్యోగులను గ్రేడ్‌లుగా విభజించి పదోన్నతి కల్పించనున్నారు.
టెక్కలి రూరల్, అక్టోబరు 12(ఆంధ్రజ్యోతి): పంచాయతీరాజ్ ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం తీపికబురు చెప్పింది. పంచాయతీల పునర్నిర్మాణం.. పునర్ వర్గీకరణకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. 10 రకాల సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. దీపావళి కానుకగా పంచాయతీలను నాలుగు గ్రేడ్‌లుగా విభజించి ఉద్యోగులకు పదోన్నతులు కల్పిస్తున్నట్లు శుక్రవారం జరిగిన కేబినెట్‌లో సమావేశంలో ప్రకటించింది. పంచాయతీ ఉద్యోగులకు గత 48 ఏళ్ల నుంచి పదోన్నతుల చానల్ లేదు. మిగతా శాఖల్లో పనిచేసే వారికి ముందుగానే పదోన్నతులు వస్తుంటాయి. ఈ పరిస్థితి పంచాయతీరాజ్‌శాఖలో లేదు. దీంతో ఈ శాఖకు రావడానికి ఉద్యోగులు ఇష్టపడేవారు కాదు. ఈ సమస్యను ఇటీవల డిప్యూటీ సీఎం, పంచాయతీరాజ్‌శాఖ మంత్రి పవన్‌కల్యాణ్ దృష్టికి కొందరు ఉద్యోగులు తీసుకెళ్లారు. దీంతో వివిధ సంస్కరణలకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పంచాయతీలను జనాభా, ఆదాయం ఆధారంగా స్పెషల్ (రూర్బన్) గ్రేడ్, గ్రేడ్ -1, గ్రేడ్ -2, గ్రేడ్ -3లుగా విభజించి పాలన అందించనుంది. ఇక పంచాయతీ కార్యదర్శిలు పంచాయతీ అభివృద్ధి అధికారులుగా వ్యవహరించనున్నారు. 48 ఏళ్ల తరువాత పంచాయతీరాజ్‌శాఖలో ప్రక్షాళన జరుగుతుండడంతో ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
జిల్లాలో పరిస్థితి..
జిల్లాలో 912 పంచాయతీల పరిధిలో 835 సచివాలయాలు ఉన్నాయి. అన్ని గ్రేడ్ల కార్యదర్శిలు 2,044 మందికిగానూ 1,804 మంది ఉన్నారు. గ్రేడ్-1 కార్యదర్శిలు 33 మందికి గాను 11 మంది, గ్రేడ్-2 కార్యదర్శిలు 22 మందికి 18 మంది, గ్రేడ్-3 కార్యదర్శిలు 129 మందికి 115 మంది, గ్రేడ్-4కు సంబంధించి 498 మంది కార్యదర్శులకు 404 మంది, గ్రేడ్-5కి సంబంధించి 529 మందికిగాను 490 మంది, గ్రేడ్-6 కార్యదర్శులు 835 మందికి 766 మంది ఉన్నారు. వీరిని ఇక నుంచి మూడు గ్రేడ్‌లుగా విభజించి పంచాయతీ పాలన కొనసాగనుంది. మునిసిపాలిటీ తరహాలో పారిశుధ్యం, తాగునీరు, గ్రామీణ ప్రణాళిక, వీధిలైట్లు, ఇంజనీరింగ్, రెవెన్యూ విభాలుగా విభజించనున్నారు.
ఆనందంగా ఉంది..
దాదాపు ఐదు దశాబ్దాల తరువాత పంచాయతీలను గ్రేడ్‌లుగా విభజించడం ఆనందంగా ఉంది. దీనివల్ల కార్యదర్శులకు ఎప్పుడూ లేనంతగా గౌరవం దక్కుతుంది. ప్రభుత్వానికి రుణపడి ఉంటాం.
- శివాజీ, పంచాయతీ కార్యదర్శుల సంఘం నాయకుడు, మెళియాపుట్టి
పేస్కేల్ అమలు చేయాలి
గ్రేడ్లగా విభజించడాన్ని కూటమి ప్రభుత్వం కార్యదర్శులకు ఇచ్చిన దీపావళి కానుకగా భావిస్తున్నాం. గ్రేడ్‌లు విభజించినట్టే వాటి ఆధారంగా పేస్కేల్ అమలు చేస్తే బాగుంటుంది. దీనివల్ల మరింత చురుగ్గా పని చేయగలుగుతాం.
- మోహనరావు, పంచాయతీ కార్యదర్శి