rain: అకాల వర్షం.. రైతులకు నష్టం
ABN , Publish Date - Apr 10 , 2025 | 12:09 AM
rain: అకాల వర్షం రైతులకు నష్టం మిగిల్చింది. మంగళవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో ఎటువంటి మేఘం, ఉరుములు, మెరుపులు లేకుండా ఒక్కసారిగా జోరువాన కురిసింది.

తడిచిన ధాన్యం రాశులు
పాక్షికంగా దెబ్బతిన్న నువ్వు, పొద్దుతిరుగుడు
నరసన్నపేట/జలుమూరు, ఏప్రిల్ 9 (ఆంధ్రజ్యోతి): అకాల వర్షం రైతులకు నష్టం మిగిల్చింది. మంగళవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో ఎటువంటి మేఘం, ఉరుములు, మెరుపులు లేకుండా ఒక్కసారిగా జోరువాన కురిసింది. దీంతో నరసన్నపేట మండలంలోని కరగాం, కంబకాయి, జమ్ము, నారాయణవలస, జలుమూరు మండలం కోనసింహాద్రిపేట, సైరిగాం తదితర గ్రామాల్లో పొలాలు, కళ్లాలు, రోడ్లపై ఆర బెట్టిన ధాన్యం రాశులు తడిచిపోయాయి. ధాన్యం కాపాడుకోవడానికి రాత్రి వేళ రైతులు అష్టకష్టాలు పడ్డారు. ధాన్యంపై పరదాలు కప్పారు. అలాగే పలు గ్రామాల్లో నువ్వు, పొద్దుతిరుగు పంటలు కూడా తడిచిపోవడంతో పాక్షికంగా దెబ్బతిన్నాయి. దీంతో రంగుమారే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బుధవారం ఉదయం వాటిని ఆరబెట్టారు. రబీలో ధాన్యం కొనుగోలు చేసే నాథుడు లేక ఈ పరిస్థితి ఏర్పడిందని నరసన్నపేట మండలం భవానీపురానికి చెందిన రైతులు నేతింటి రాజేశ్వరరావు, కర్రెన్న తదితరులు వాపోతున్నారు.